ఇసుక టెండర్లకు వీడిన గ్రహణం..!
ABN , Publish Date - Apr 07 , 2026 | 12:05 AM
తుంగభద్ర నదిలో ఇసుక లోడింగ్ టెండర్లకు రాజకీయ గ్రహణం వీడింది. ఓ పోలీస్ ఉన్నతాధికారి జోక్యంతో ఓ వర్గం టెండర్ల నుంచి తప్పుకుంది.
రాజకీయ ఒత్తిళ్లతో రెండుసార్లు రద్దు
ఓ పోలీస్ ఉన్నతాధికారి జోక్యంతో సద్దుమణిగిన వివాదం
ఎట్టకేలకు ఇసుక లోడింగ్ టెండర్లు ఖరారు
10 నుంచి నాగులదిన్నె, గంగవరం రీచ్‌లు నుంచి ఇసుక రవాణా
తుంగభద్ర నదిలో ఇసుక లోడింగ్ టెండర్లకు రాజకీయ గ్రహణం వీడింది. ఓ పోలీస్ ఉన్నతాధికారి జోక్యంతో ఓ వర్గం టెండర్ల నుంచి తప్పుకుంది. ఆరు నెలలు తరువాత ఎట్టకేలకు కాంట్రాక్టరును ఖరారు చేశారు. ఈ నెల 10లోగా గనులు భూగర్భ వనరులు శాఖ అధికారులతో ఒప్పందం చేసుకోవాలి. అదే రోజు నుంచి నాగులదిన్నె, గంగవరం-జోహరాపురం రీచ్‌ల నుంచి భవన నిర్మాణదారులకు ఇసుక అందుబాటులోకి రానుంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల ప్రజలకు 18 టన్నులు ఇసుక రూ.5,000 - రూ.6,500 లభించే అవకాశం ఉంది. ఇది భవన నిర్మాణదారులకు తీపికబురు.
కర్నూలు, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో తుంగభద్ర నదిలో ఇసుక తవ్వకాలు, రవాణా కోసం గనులు భూగర్భవనరులు, జలవనరులు, రెవెన్యూ శాఖ అధికారులు సర్వే చేసి నందవరం మండలం నాగులదిన్నె, గంగవరం-జొహారాపురం, వేదవతి నదిలో హోళగుంద మండలం ముద్దటమాగి ఇసుక రీచ్‌లను గుర్తించారు. ఉచిత ఇసుక పాలసీ ప్రకారం ఆన్‌లైన్ బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు తెచ్చే వాహనాల్లో ఇసుక లోడింగ్ చేసేందుకు జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న జిల్లా ఇసుక కమిటీ ఒక మెట్రిక్ టన్ను లోడింగ్‌కు రూ.45గా నిర్ణయించింది. నందవరం మండలం నాగులదిన్నె రీచ్‌లో 1.20 మెట్రిక్ టన్నులు, గంగవనం-జొహారాపురం రీచ్‌లో 1.50 లక్షల మెట్రిక్ టన్నులు, ముద్దటమాగి రీచ్‌లో 75 వేలు మెట్రిక్ టన్నులు ఇసుక కలిపి మూడు రీచ్‌లో 3.45 లక్షల మెట్రిక్ టన్నులు లోడింగ్ చేయడానికి లోడింగ్ కాంట్రాక్ట్ విలువ సుమారుగా రూ.1.55 కోట్లు ఉంటుదని అంచనా వేశారు. గతేడాది అక్టోబరు 10న లోడింగ్ టెండర్లు పిలిచారు. నాగులదిన్నె రీచ్‌లో రూ.6, గంగవరం రీచ్‌లో రూ.0.98 పైసలు, ముద్దటమాగి రీచ్‌లో రూ.6.90 కోట్ చేశారు. జిల్లా శాండ్ కమిటీ రూ.45ధర నిర్ణయిస్తే, అత్యల్పంగా రూ.0.98 పైసలే కోట్ చేయడంతో టెండర్లు రద్దు చేసి, డిసెంబరులో మరోసారి టెండర్లు పిలిచారు. అయితే.. రూ.30 కంటే తక్కువకు కోట్ చేయరాదని, ఒకే ధరకు కోట్ చేస్తే లాటరీ ద్వారా అప్పగిస్తామని నిబంధన పెట్టారు. రెండోసారి 32 మంది కాంట్రాక్టర్లు టన్నుకు రూ.31కు షెడ్యూల్ దాఖలు చేస్తే, జిల్లా శాండ్ కమిటీ పర్యవేక్షణలో లాటరీ ద్వారా నాగులదిన్నె, గంగా వరం-జొహారాపురం రీచ్‌లు కర్నూలు నగరానికి చెందిన శివారెడ్డి, ముద్ద టమాగి రీచ్ కర్ణాటకకు చెందిన టీవీఎస్ అసోసియేట్స్ సంస్థలు లోడింగ్ కాంట్రాక్ట్ దక్కించుకున్నాయి. అధికార కూటమి ముఖ్య నాయకులు సిఫారసు చేసిన కాంట్రాక్టర్‌కు టెండర్లు రాకపోవడంతో, సిండికేట్‌గా ఏర్పడి ఒకే ధర కోట్ చేశారనే కారణంతో మళ్లీ రద్దు చేశారు.
ఎట్టకేలకు ఇసుక టెండరు ఖరారు
నాగులదిన్నె, గంగావరం-జొహారాపురం ఇసుక రీచ్‌ల్లో లోడింగ్ కోసం గత నెల 21న మూడో దఫా మళ్లీ టెండర్లు పిలిచారు. కూటమి ముఖ్య నాయకుల ఒత్తిడి మేరకు జిల్లాకు చెందిన ఓ పోలీస్ ఉన్నతాధికారి జోక్యం చేసుకుని సమస్య తీవ్రతరం కాకుండా సద్దుమణిగించినట్లు సమాచారం. ఆయా రీచ్‌లో ఇసుక లోడింగ్ టెండర్లలో పాల్గొన వద్దని మొదట రెండుసార్లు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు, వారికి మద్దతుగా ఉన్న కూటమి నాయకులకు ఆ పోలీస్ అధికారి గట్టిగా చెప్పినట్లు సమాచారం. దీంతో టెండర్లకు వారు దూరంగా ఉండిపోయారు. అనుమతులు ఉన్న 19 మంది కాంట్రాక్టర్లు మాత్రమే టెండర్లలో పాల్గొన్నారు. ఈ నెల 4న టెండరు షెడ్యూల్ ఓపన్ చేస్తే, అందరు కూడా రూ.30 ప్రకారమే షెడ్యూల్ దాఖలు చేశారు. దీంతో జిల్లా శాండ్ కమిటీ పర్యవేక్షణలో లాటరీ (డిప్) తీశారు. గంగావరం-జొహారాపురం రీచ్ కాంట్రాక్టర్ వి.సాయిబాబు, నాగులదిన్నె రీచ్ కాంట్రాక్టర్ షేక్ ఖాజాహుసేన్‌లకు లోడింగ్ కాంట్రాక్ట్ దక్కింది. ఈ నెల 10న కాంట్రాక్టర్లు మైనింగ్ అధికారులతో ఒప్పందం చేసుకుని ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎట్టకేలకు ఆరు నెలలు తరువాత పై రెండు రీచ్‌ల ద్వారా ఇసుక అందుబాటులోకి రావడంతో భవన నిర్మాణదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
18 టన్నుల ఇసుక రూ.5,000-6,500లోపే
నాగులదిన్నె, గంగావరం-జొహారాపురం రీచ్‌ల నుంచి ఎమ్మిగనూరు పట్టణ వినియోగదారులకు 18 టన్నుల ఇసుక టిప్పరు రూ.5-6 వేలకు లభించే అవకాశం ఉంది. సీఎం చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘ఉచిత ఇసుక పాలసీ’ నిబంధనల మేరకు ఇసుక కోసం ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే.. జిల్లా శాండ్ కమిటీ నిర్ణయించిన లోడింగ్ చార్జీలు, ట్రాక్టర్, టిప్పర్ రవాణా చార్జీలు వినియోగదారుడే భరించాలి.
లోడింగ్ చార్జీ టన్నుకు రూ.45 నిర్ణయిస్తే, రూ.30కే లోడింగ్ చేస్తానని కాంట్రాక్టర్ టెండరు దక్కించుకున్నారు. అంటే ఒక టిప్పరుకు ఇసుక లోడింగ్ చేస్తే 18 టన్నులకు రూ.540, 20 టన్నులకు రూ.600 అవుతుంది.
20 కిలో మీటర్ల వరకు ఆరు టైర్ల టిప్పరు (10 టన్నులు)కు రూ.2 వేలు, 10 టైర్ల లారీ/టిప్పరు (18 టన్నులు)కు రూ.3,600, 12 టైర్ల లారీ/టిప్పరు (22 టన్నులు)కి రూ.3,820 రవాణా చార్జీ నిర్ణయించారు. 20 కిలో మీటర్లు దాటితే.. ఒక కిలో మీటరుకు టన్నుకు రూ.8 రవాణా చార్జీ కింద తీసుజిల్లా ఇసుక కమిటీ నిర్ణయించింది.
ఎమ్మిగనూరు నుంచి నాగులదిన్నె రీచ్ వరకు 25 కిలోమీటర్లు, గంగావరం-జొహారాపురం రీచ్‌కు 35 కిలోమీటర్లు దూరం ఉంటుందని అంచనా. 20 కిలోమీటర్లు పైన కిలోమీటరుకు టన్నుకు రూ.8 అదనంగా రవాణా చార్జీ తీసుకోవచ్చు. ఈ లెక్కన ఎమ్మిగనూరుకు నాగులదిన్నె రీచ్ నుంచి 18 టన్నుల ఇసుక టిప్పర్ రూ.4,870, 22 టన్నుల ఇసుక టిప్పర్ రూ.5,280కు మించదు.
గంగావరం-జొహారాపురం రీచ్ నుంచి 18 టన్నుల ఇసుక రూ.6,320లు, 22 టన్నులు ఇసుక రూ.6,720లకు మించదు. పులచింత మీదుగా గంగావరం రీచ్ నుంచి ఇసుక రవాణా చేస్తే మరింత తగ్గే అవ కాశం ఉంది. 18 టన్నుల టిప్పరు ఇసుక రూ.5,000 - 6,500కు మించదు.
కోర్టు విచారణలో ముద్దటమాగి రీచ్
హోళగుంద మండలం ముద్దటమాగి గ్రామం వద్ద హగరి నదిలో ఇసుక తవ్వకాల కోసం రీచ్ గుర్తించారు. ఇక్కడ 75 వేల మెట్రిక్ టన్నులు ఇసుక లభ్యత ఉందని అంచనా వేశారు. డిసెంబరులో రెండవసారి నిర్వహించిన లోడింగ్ టెండర్లలో కర్ణాటకకు చెందిన టీవీఎస్ అసోషియేట్స్ అనే సంస్థకు షెడ్యూల్ దాఖలు చేసింది. లాటరీలో ఆ సంస్థకే టెండర్ దక్కింది. మైనింగ్ అధికారులు ఆ టెండరు రద్దు చేయడంతో ఆ సంస్థ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నెల 24న విచారణ ఉంది. దీంతో ఆ రీచ్ టెండర్లు పిలవలేదు. అయితే.. రాజకీయ నాయకుల అండదండలతో అనధికారికంగా ఇసుక అక్రమ తవ్వకాలు యథేచ్చగా సాగుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే సగానికి పైగా ఇసుక నిల్వలు ఖాళీ చేశారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.