Share News

భూమి కన్నతల్లితో సమానం

ABN , Publish Date - Jun 20 , 2026 | 11:57 PM

వ్యవసాయ భూమి కన్నతల్లితో సమానమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి అన్నారు.

భూమి కన్నతల్లితో సమానం
మెగా చెక్కును విడుదల చేస్తున్న మంత్రి బీసీ

మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి

కోవెలకుంట్ల, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): వ్యవసాయ భూమి కన్నతల్లితో సమానమని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్‌ రెడ్డి అన్నారు. అటువంటి భూమిని ఎవరూ అమ్ముకోవద్దని ఆయన రైతులను విజ్ఞప్తి చేశారు. శనివారం కోవెలకుంట్ల పట్టణంలో ‘అన్నదాతా సుఖీభవ- పీఎం కిసాన్‌’ నిధులు విడుదల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి హాజరయ్యారు. మంత్రితో పాటు జిల్లాకు చెందిన పలువురు అధికారులు హాజరయ్యారు. ముందుగా వ్యవసాయ శాఖ ఆఽధ్వర్యంలో స్లాళ్లలో ఏర్పాటు చేసిన యంత్రాలను, పరికరాలను మంత్రి పరిశీలించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అన్నారు. రైతులను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. భూమి ఉన్న ప్రతి రైతుతో పాటు కౌలు రైతులకు, అసైన్డ్‌ భూములు సాగు చేసుకున్న రైతులందరు ఆధార్‌ కార్డ్‌ తీసుకుని రైతు సేవా కేంద్రం దగ్గరికి వెళ్లితే వ్యవసాయ సిబ్బంది యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించి పంటలను సాగు చేసుకునేందుకు రైతులు ఎక్కడైనా ఎరువులు తీసుకొనే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా రైతులు భూసార పరీక్షలు చేయించుకుని అధికారుల సలహాల మేరకు పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి వెంకటేశ్వర్లు, కృషి విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ ధనలక్ష్మి, ఆళ్ళగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు, బనగానపల్లె ఆర్డీఓ నరేంద్రనాథ్‌ రెడ్డి, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ కాట్రెడ్డి మల్లికార్జున రెడ్డి, కోవెలకుంట్ల సొసైటీ చైర్మన్‌ గువ్వల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 11:57 PM