Share News

దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలి

ABN , Publish Date - May 04 , 2026 | 10:44 PM

దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా, సామాజికంగా బలపడాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ సూచించారు.

దివ్యాంగులు ఆర్థికాభివృద్ధి సాధించాలి
మోటార్‌ ట్రైసైకిళ్ల పంపిణీని ప్రారంభిస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు

ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌

దివ్యాంగులకు మోటారు ట్రై సైకిళ్ల పంపిణీ

కర్నూలు అర్బన్‌, మే 4 (ఆంధ్రజ్యోతి): దివ్యాంగుల సంక్షేమం, సాధికారత కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థికంగా, సామాజికంగా బలపడాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ నూరుల్‌ ఖమర్‌ సూచించారు. నగరంలోని కలెక్టరేట్‌ ఆవరణలో విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల శాఖ ఆధ్వర్యంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, ‘కుడా’ చైర్మన్‌ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మతో కలిసి దివ్యాం గులకు మూడు చక్రాల మోటార్‌ సైకిళ్లను పంపిణీ చేశారు. ఇన్‌చార్జి కలెక్టర్‌ మాట్లాడుతూ.. జిల్లాకు మూడు చక్రాల మోటార్‌ సైకిళ్లు 70 మంజూరయ్యాయని, ప్రతి నియోజక వర్గానికి 10 మందికి చొప్పున పంపిణీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మిషన్‌ మోడ్‌లో ఖాళీలను భర్తీ చేయడంతో పాటు కారుణ్య నియామకాల ద్వారా కూడా దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నామని తెలిపారు. గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ ఇంద్రధనస్సు పథకాలతో దివ్యాంగులకు నూతన అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తోందని చెప్పారు. వయోవృద్ధుల సంక్షేమ కార్పొరేషన్‌ చైర్మన్‌ నారాయణస్వామి మాట్లాడుతూ భారీ పింఛన్లు, ఉచిత ప్రయాణం, రాజకీయ అవకాశాలతో సమ గ్ర సంక్షేమం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే న్యాయం జరుగుతోందని అన్నారు. సోమిశెట్టి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. గుడిసె కృష్ణమ్మ మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతుల, వయో వృద్ధుల శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ రాయిస్‌ ఫాతిమా, రాష్ట్ర సివిల్‌ సప్లయీస్‌ డైరెక్టర్‌ కె. లక్ష్మీనారాయణ, టీడీపీ నగర అధ్యక్షుడు రవికుమార్‌, జనసేన రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల నాయకులు నాగరాజు, ఎల్లప్ప, సురేష్‌ నాయుడు, ఈరన్న తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 04 , 2026 | 10:44 PM