Share News

లోగుట్టు సీఎంవోకు ఎరుక

ABN , Publish Date - Aug 09 , 2026 | 11:20 PM

ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ‘పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టమ్‌’ (పీజీఆర్‌ఎ్‌స)ను అమలు చేస్తుంది.

లోగుట్టు సీఎంవోకు  ఎరుక

పీజీఆర్‌ఎ్‌స అర్జీల పరిష్కారం కాగితాల మీదే

బయట పెట్టిన పీజీఆర్‌ఎస్‌ చీఫ్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌

రెవెన్యూ, సర్వే శాఖల్లో అపరిష్కృత సమస్యలకు అగ్రస్థానం

అర్జీదారులకు ఉచిత సలహాలిస్తున్న మండల అధికారులు

సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసిన కలెక్టర్‌

ప్రజల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం ‘పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టమ్‌’ (పీజీఆర్‌ఎ్‌స)ను అమలు చేస్తుంది. ప్రతి సోమవారం కలెక్టర్‌, ఎస్పీ స్వీకరించే అర్జీలను తక్షణం పరిష్కరించమని అధికారులను ఆదేశిస్తున్నారు. వాటిలో 75-80 శాతం పరిష్కరిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి సమస్యలు పరిష్కారం కావడం లేదు. కొందరు అధికారులైతే అర్జీదారులను పిలిపించి ఉచిత సలహాలు ఇచ్చి పంపుతున్నారు. మరి కొందరు రేపురా.. చూద్దాం..! అని, లేనిపోని కారణాలతో కాలయాపన చేస్తున్నారు. అయితే రికార్డుల్లో మాత్రం సమస్య పరిష్కారమైనట్లు నమోదు చేస్తున్నారు. ఈ లోగుట్టు ఎవరో చెప్పడం లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఈ వివరాలపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.

కర్నూలు, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు మే 6, 7 తేదీల్లో కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమై.. వివిధ జిల్లాల్లోని శాఖల వారిగా ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి, సంక్షేమంపై సమీక్షించారు. మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. వివిధ శాఖల పనితీరుపై చర్చించారు. అందులో భాగంగా ‘పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టమ్‌ (పీజీఆర్‌ఎస్‌)’లో ప్రజా సమస్యల పరిష్కారం గురించి కూడా చర్చించారు. ఏ నెలలో ఎన్ని సమస్యలు పరిష్కారించారు? ఎన్ని పెండింగులో ఉంచారు? ఎన్ని అర్జీలు పరిశీలనలో ఉన్నాయి? సమగ్రంగా చర్చించడమే కాకుండా జిల్లాల వారిగా నివేదిక ఇచ్చారు. కర్నూలు జిల్లాలో పీజీఆర్‌ఎస్‌ ద్వారా వివిధ సమస్యల పరిష్కారంలో 85 శాతం ప్రజలు ఎంతో సంతృప్తిగా ఉన్నారని ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఈ ఏడాది జవనరి 31 నుంచి మే 1 వరకు వ్యక్తిగత సమస్యలపై 7,548 అర్జీలు రాగా, 4,104 అర్జీలు పరిష్కరించామని, 3,444 ఫిర్యాదులు వివిధ కారణాలతో పెండింగులో ఉంచామని, 2,558 అర్జీలు పరిశీలనలో ఉన్నాయని ఆ రోజుకి జిల్లా యంత్రాంగం ఇచ్చిన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. కమ్యూనిటీపరమైన సమస్యలతో 1,828 అర్జీలు జిల్లా కేంద్రానికి రాగా.. 1,178 సమస్యలు పరిష్కరించామని, 882 అర్జీలు పరిశీలనలో ఉన్నాయని, 90 శాతం ప్రజలు సంతృప్తితో ఉన్నారని వెల్లడించారు. ప్రతి నెల దాదాపుగా పీజీఆర్‌ఎ్‌సలో వివిధ సమస్యలపై 225 - 350కి పైగా అర్జీలు వస్తున్నాయి. వాటిలో 75-80 శాతానికిపైగా గడువులోగా పరిష్కరిస్తున్నామని, ప్రజలు కూడా సంతృప్తికరంగా ఉన్నారని అధికారులు చెబుతున్న మాట. క్షేత్రస్థాయిలో వాస్తవాలు ఇందుకు భిన్నంగా ఉన్నాయనే ఆరోపణులు ఉన్నాయి.

ఇది మోసం కాదా?

జిల్లాలో జూలై 11 నుంచి 17 వరకు ఏడు రోజుల్లో ప్రజల నుంచి వచ్చిన అర్జీల పరిష్కారంపై ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) - పీజీఆర్‌ఎస్‌ చీఫ్‌ గ్రీవెన్స్‌ ఆఫీసర్‌ సమీక్ష నిర్వహించారు. ఇందులో పౌర ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, లోపాలను గుర్తించారు. పీజీఆర్‌ఎ్‌సకు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించే సమయంలో అర్జీదారులను వ్యక్తిగతంగా సంప్రదించి మాట్లాడడం లేదు. ప్రజల సమస్యలను పరిష్కరించకుండానే అర్జీలను మూసివేస్తున్నారు. సరైన కారణాలు చూపకుండానే, అసంబద్ధమైన ఆమోదాల ఆధారంగా ఫిర్యాదులు తొలగిస్తున్నారు. అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో వివిధ శాఖల మధ్య అర్జీలను బదిలీ చేయడం లేదు. అర్థవంతమైన చర్యలు తీసుకోకుండానే ఫిర్యాదులను అకారణంగా మూసివేస్తున్నారని సీఎంవో-పీజీఆర్‌ఎస్‌ చీఫ్‌ గ్రీవెన్స్‌ ఆఫీసరు నిర్వహించిన ఆడిట్‌లో వెలుగులోకి వచ్చింది. సమస్యల పరిష్కారంలో అంతులేని నిర్లక్ష్యం, బాధ్యత లేకపోవడం, పీజీఆర్‌ఎస్‌ ప్రమాణికత, నిర్వహణ విధానాలను పాటించకపోవడం వల్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని, ఏకంగా సీఎంవో ఆఫీసు నిగ్గుతేల్చిందంటే నిర్లక్ష్యం ఏస్థాయిలో ఉందో ఇట్టే తెలుస్తోంది. ఇది మోసం కాదా..? అంటూ ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు.

షోకాజ్‌ నోటీసులు జారీ

‘పబ్లిక్‌ గ్రీవెన్స్‌ రిడ్రెస్సల్‌ సిస్టమ్‌ (పీజీఆర్‌ఎ్‌స)లో వచ్చిన వివిధ ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం చేయడంపై సీఎంవో-పీజీఆర్‌ఎస్‌ చీఫ్‌ గ్రీవెన్స్‌ ఆఫీసరు నిర్వహించిన సూపర్‌ ఆడిట్‌లో పలు లోపాలు వెలుగు చూపడడంపై కలెక్టర్‌ డాక్టర్‌ ఎ. సిరి తీవ్రంగా స్పందించారు. తక్షణం వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులకు షోకాజ్‌ నోటీస్‌ పంపించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, బాధ్యతారాహిత్యంపై సీఎంవో ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఇప్పటికైనా అధికారుల్లో మార్పు వస్తుందా..? ప్రజల సమస్యలు పరిష్కారంలో చిత్తశుద్ధి చూపుతారా..? అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు.

జూలై 31 వరకు వివిధ శాఖల అధికారుల వద్ద పెండింగ్‌లో ఉన్న పీజీఆర్‌ఎ్‌సకు వచ్చిన ఫిర్యాదులు

అధికారి పెండింగ్‌

సమస్యలు

ఆర్డీవో, ఆదోని 62

ఎస్‌ఎల్‌ఎల్‌ఆర్‌, ఏడీ కర్నూలు 54

ఆర్డీవో ఆఫీస్‌, కర్నూలు 27

తహసీల్దారు, కర్నూలు అర్బన్‌ 20

ఆర్డీవో, పత్తికొండ 18

తహసీల్దారు, కర్నూలు 14

తహసీల్దారు, వెల్దుర్తి 13

తహసీల్దారు, ఓర్వకల్లు 10

తహసీల్దారు, సి. బెళగల్‌ 10

తహసీల్దారు, హొళగుంద 9

డీఈఈ, కర్నూలు కార్పొరేషన్‌ 9

తహసీల్దారు, కోడుమూరు 8

తహసీల్దారు, దేవనకొండ 7

డీఈవో ఆఫీసు, కర్నూలు 7

సీఎంవో సూపర్‌ అడిట్‌లో వెలుగు చూసిన వాస్తవాలు కొన్ని

కోడుమూరు మండలం ముడుమలగుర్తి గ్రామంలో ఓ రైతు సర్వే నంబరు.311లోని ఆస్తి స్వాధీన ధృవీకరణ పత్రం కోసం పీజీఆర్‌ఎ్‌సలో అర్జీ ఇచ్చారు. ఫిర్యాదు ఐడీ నంబరు: కేయూఆర్‌20260512585 కింద రిజిస్టర్‌ చేశారు. ఈ సమస్యను పరిష్కరించాల్సిన కోడుమూరు తహసీల్దారు.. అర్జీదారుడి స్వాధీనంలో ఆస్తి లేదని గ్రామ రెవిన్యూ అధికారి పరిశీలనలో తేలడంతో స్వాధీన పత్రం ఇవ్వలేదని, ఆ విషయం అర్జీదారుడికి తెలియజేశామని ఫిర్యాదును మూసేశారు. అయితే అర్జీదారుడితో సరైన సంప్రదింపులు జరపకుండానే అర్జీని మూసేశారని సీఎంవో-పీజీఆర్‌ఎస్‌ సూపర్‌ ఆడిట్‌లో గుర్తించారు. అర్జీదారుడితో వ్యక్తిగతంగా మాట్లాడకుండానే వీఆర్‌వో నివేదిక ఆధారంగా ఫిర్యాదును మూసివేయడంపై సీఎంవో ఆఫీస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఆలూరు మండలం మొలగవెల్లి గ్రామానికి చెందిన ఓ రైతు సర్వే నంబరు.1138/బిలోని 2.57 ఎకరాల భూమి స్వభావం, వర్గీకరణ, విస్తీర్ణం సవరణ చేయాలని కోరుతూ పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఐడీ: కేయూఆర్‌20260501544 కింద అర్జీని రిజిస్టర్‌ చేశారు. సంబంధిత భూమి రికార్డులు సమర్పించమని ఫిర్యాదుదారుడికి పలుమార్లు తెలియజేశారు. ఆయన అవసరమైన పత్రాలు ఇవ్వకపోగా విచారణకు సహకరించలేదని, తదుపరి విచారణ కోసం పత్తికొండ ఆర్‌డీవో ఆఫీసుకు పంపామని తెలుపుతూ ఫిర్యాదును ముగించారు. అయితే.. ఈ సమస్య పరిష్కరించడంతో తహసీల్దారు ఘోరంగా విఫలం అయ్యారని సీఎంవో-పీజీఆర్‌ఎస్‌ సూపర్‌ అడిట్‌లో గుర్తించారు.

ఆదోని మండలంలో ఓ రైతు తనకు 2.80 ఎకరాల భూమి ఉంటే రీ-సర్వేలో 1.623 ఎకరాలే చూపించారు. మరోసారి పక్కాగా సర్వే చేసి తన భూమి చూపాలని కోరుతూ పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేశారు. ఐడీ నంబరు: కేయూఆర్‌ 202605042511 కింద ఫిర్యాదు రిజిస్టర్‌ చేసి సంబంధిత తహసీల్దారుకు పంపారు. ఈ భూమికి పక్కనే ఉన్న భూ యజమానులు అంగీకరించడం లేదని, వారే భూమిపై హక్కులు క్లెయిమ్‌ చేస్తున్నందున, ప్రస్తుతం చట్టపరమైన నిబంధనలు మేరకు సర్వే చేసి సరిహద్దులు మార్చడం కుదరని ఆ ఫిర్యాదును క్లోజ్‌ చేశారు. అయితే.. ఫిర్యాదుదారుడికి అర్థవంతమైన పరిష్కారం చూపకుండానే అర్జీని క్లోజ్‌ చేశారని సీఎంవో సూపర్‌ ఆడిట్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

కర్నూలు నగరంలో ఓ కలప డిపో వల్ల దుమ్ము, శబ్దకాలుష్యం, ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఆ డిపోను అనధికారికంగా ఏర్పాటు చేశారని ఓ వ్యక్తి పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేశారు. పారిశుధ్య సిబ్బంది గతంలో ఆ ప్రాంతాన్ని తనిఖీ చేసిన వివరాలను పౌరుడికి వివరించి అర్జీని క్లోజ్‌ చేయడంపై సీఎంవో-పీజీఆర్‌ఎస్‌ సూపర్‌ ఆడిట్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమస్య కాలుష్య నియంత్రణ మండలి పరిధిలోకి వస్తుందని చెప్పినా, ఆ అర్జీని సంబంధిత శాఖకు పంపకుండా, సమన్వయం చేసినట్లు ఆధారాలు చూపకుండా అర్జీదారుడిని మరో శాఖ కార్యాలయంలో సంప్రదించమని ఉచిత సలహా ఇచ్చి ఎలా క్లోజ్‌ చేస్తారని మండిపడిపింది.

కర్నూలు నగరంలో ఓ కాలనీలో ఫుట్‌పాత్‌కు మరమ్మతులు చేయాలని, ఆక్రమణలు తొలగించాలని పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేయగా, ఐడీ నంబరు: కేయూఆర్‌ 202606 084182 కింద రిజిస్టర్‌ చేసి కర్నూలు కార్పొరేషన్‌ డీఈఈకి పంపించారు. ఆ సమస్యకు పరిష్కారం చూపకుండానే ముగించేశారు. దీనిపై సూపర్‌ ఆడిట్‌ తీవ్ర అభ్యంతరం చెప్పింది. ఫిర్యాదుదారుడిని వ్యక్తిగతంగా సంప్రదించకుండానే ఎలా క్లోజ్‌ చేస్తారని నిలదీసింది.

కర్నూలు నగరంలో హంద్రీనదిపై కొత్త వంతెన నిర్మాణం కోసం ఓ వ్యక్తి పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేయగా, ఐడీ నంబరు: కేయూఆర్‌ 20260515268 కింద నమోదు చేసి పరిష్కారం కోసం కర్నూలు కార్పొరేషన్‌ డీఈఈకి పంపించారు. అయితే.. ఈ సమస్య నీటిపారుల శాఖ పరిధిలోకి వస్తుందని ఫిర్యాదుదారుడికి సలహా ఇచ్చి క్లోజ్‌ చేశారు. దీనిపై సీఎంవో-పీజీఆర్‌ఎస్‌ సూపర్‌ ఆడిట్‌ తీవ్రంగా స్పందించింది. పౌర-కేంద్రీకృత ఫిర్యాదుల పరిష్కార సూత్రాలు పాటించకుండా ఫిర్యాదును మూసివేశారని ఆగ్రహం వ్యక్తం చేసింది.

కర్నూలు నగరంలో ఆస్తి పన్ను తప్పుగా అంచనా వేశారని, దానిని సరిచేసి న్యాయం చేయాలని కోరుతూ పీజీఆర్‌ఎ్‌సలో అర్జీ ఇవ్వగా ఐడీ నం.కేయూఆర్‌ 202604201469 కింద నమోదు చేసి కర్నూలు తహసీల్దారుకు పంపారు. జీఐఎస్‌ సర్వేలో కొలతలు తారుమారు కావడంతో ఆస్తి పన్ను అంచనాలో తప్పు జరిగిందని గుర్తించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేశాం, 30 రోజుల్లో ఆస్తి కొలతలు సరిచేసి పన్ను పునఃపరిశీలిస్తామని అర్జీదారుడికి చెప్పి క్లోజ్‌ చేశారు. అయితే.. ఫిర్యాదును పూర్తిగా పరిష్కరించకుండానే ముగించడంపై సూపర్‌ ఆడిట్‌ అభ్యంతరం చెప్పింది.

చిప్పగిరి మండలం పంచాయతీ డెవల్‌పమెంట్‌ ఆఫీసర్‌, గూడూరు, పెద్దకడుబూరు, సి. బెళగల్‌ మండల సర్వేయర్లు కూడా పీజీఆర్‌ఎస్‌ ద్వారా వచ్చిన ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం, జాప్యం చేస్తున్నారని సూపర్‌ అడిట్‌లో వెలుగులోకి వచ్చింది.

Updated Date - Aug 09 , 2026 | 11:20 PM