Share News

సైకిల్‌ జోరు..!

ABN , Publish Date - Nov 08 , 2026 | 12:32 AM

సైకిల్‌ జోరు..!

సైకిల్‌ జోరు..!

28 జడ్పీటీసీల్లో 23 స్థానాలు టీడీపీ కైవసం

ఐదు స్థానాల్లో వైసీపీ గెలుపు

పోటీ చేసిన రెండు చోట్ల జనసేన ఓటమి

376 ఎంపీటీసీల్లో టీడీపీ-223, వైసీపీ-141, జనసేన-7, బీజేపీ-2, ఇతరులు-3

బనగానపల్లె, ఆళ్లగడ్డ జడ్పీటీసీలన్నీ టీడీపీ వశం

నంద్యాలలో సత్తా చాటిన వైసీపీ

ఆనందోత్సవంలో కూటమి నాయకులు, కార్యకర్తలు

ప్రశాంతంగా కౌంటింగ్‌

పరిషత్‌ పోరులో సైకిల్‌ జోష్‌ కొనసాగింది. జిల్లాలో 28 జడ్పీటీసీ స్థానాల్లో 23 టీడీపీ కైవసం చేసుకోగా వైసీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. కూటమి పొత్తులో రెండు జడ్పీటీసీ స్థానాల్లో( గడివేముల, గోస్పాడు) జనసేన పార్టీ ఓడిపోవడం జనసైనికులతో పాటు కూటమి నేతల్లో కాస్త నిరాశ కల్పించింది. 376 ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీ-223, జనసేన-7, బీజేపీ-2 మొత్తంగా కూటమి-232, వైసీపీ-141, ఇతరులు-3 స్థానాలు కైవసం చేసుకున్నారు. ఇటు జడ్పీటీసీలు.. అటు ఎంపీటీసీల పరంగా కూటమి సత్తా చాటింది. నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ మెరుగైన ఫలితాలతో సత్తా చాటింది. నంద్యాల, గోస్పాడు జడ్పీటీసీలతో పాటు 27 ఎంపీటీసీ స్థానాల్లో 20 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. మిగిలిన 7 స్థానాల్లో టీడీపీ గెలిచింది. కూటమి ప్రభజనంతో నాయకులు, కార్యకర్తల్లో ఆనందం వెల్లివిరిసింది. కౌంటింగ్‌ ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

నంద్యాల, నవంబరు7(ఆంధ్రజ్యోతి): పరిషత్‌ పోరులో మాత్రం కూటమి జోరు పెంచింది. ఒక్క నంద్యాల మినహా అన్నింటా ఫ్యాన్‌ డీలా పడినట్లైంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి వరకు జడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల కౌంటింగ్‌ ఉత్కంఠ భరితంగా సాగింది. జిల్లాలో 28 జడ్పీటీసీ స్థానాల్లో 23 స్థానాలు టీడీపీ కైవసం చేసుకోగా వైసీపీ 5 స్థానాలతో సరిపెట్టుకుంది. కూటమి పొత్తులో రెండు జడ్పీటీసీ స్థానాల్లో(గడివేముల, గోస్పాడు) జనసేన పార్టీ ఓడిపోవడం జనసైనికులతో పాటు కూటమి నేతల్లో నిరాశ కలిగించింది. ఇక్కడ ఒకటి టీడీపీ రెబల్‌ అభ్యర్థి గెలవగా.. మరోచోట వైసీపీ అభ్యర్థి గెలుపొందారు. జిల్లా వ్యాప్తంగా 376 ఎంపీటీసీ స్థానాల్లో కూటమి-232(టీడీపీ-223, జనసేన-07, బీజేపీ-2) వైసీపీ-141, ఇతరులు-3 చొప్పున విజయం సాధించడంతో కూటమి నేతలతో పాటు నాయకులు, కార్యకర్తల్లో ఆనందోత్సవం మొదలైంది. మరోకవైపు ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని ముగ్గురు టీడీపీ జడ్పీటీసీ అభ్యర్థుల్లో వేలల్లో అత్యధిక మెజార్టీతో గెలుపొందడం సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. ఏది ఏమైనా పరిషత్‌ పోరులో కూటమి సత్తా చాటింది.

ఆళ్లగడ్డ, బనగానపల్లె నియోజకవర్గాల్లో..

జిల్లాలోని పరిషత్‌ పోరు ఎన్నికలు టీడీపీ, వైసీపీ మధ్య రసవత్తరంగా సాగింది. బనగానపల్లె, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో ఉండే 11 జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ కైవసం కావడం రాజకీయంగా కూటమిలో మరింత జోష్‌ నింపింది. ఇదే క్రమంలో ఎంపీటీసీల పరంగా కూడా బనగాన పల్లెలో -56, ఆళ్లగడ్డలో-46 చొప్పున ఎంపీటీసీ స్థానాలు కూటమి ఖాతాలో పడినట్లైంది. ఈ రెండు నియోజకవర్గాలు రాజకీయంగా టీడీపీకి కంచుకోటగా మారాయి.

వైసీపీ మెరుగైన ఫలితాలతో..

రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా నంద్యాల నియోజకవర్గంలో వైసీపీ మెరుగైన ఫలితాలతో సత్తా చాటింది. మాజీ వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవి పురపోరు నుంచి పరిషత్‌ పోరు వరకు నంద్యాలలో కూటమితో ఢీ అంటే ఢీ అన్నట్లుగా పోటీ కొనసాగించారు. తాజా పరిషత్‌ పోరులోని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో కూడా శిల్పా రవి తమదైన శైలిలో ముందుండి నడిపించినట్లైంది. ఏకంగా నంద్యాల, గోస్పాడు జడ్పీటీసీలతో పాటు 27 ఎంపీటీసీ స్థానాల్లో 20 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించారు. మిగిలిన 7 స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఈ లెక్కన ఒక్కమాటలో చెప్పాలంటే.. నంద్యాల నియోజకవర్గంలో మాత్రమే వైసీపీ సత్తా చాటగా.. మిగిలిన నియోజకవర్గాల్లో అరకొర స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

వేలల్లో మెజార్టీ..

పరిషత్‌ పోరులో ఎక్కడా లేని విధంగా జిల్లా జడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీలతో విజయం సాధించారు. అత్యధికంగా ఆళ్లగడ్డ నియోజకర్గంలో శిరివెళ్ల టీడీపీ అభ్యర్థి శ్రీకాంత్‌రెడ్డి 24,258 ఓట్లతో, చాగలమర్రి టీడీపీ అభ్యర్థి నరసింహారెడ్డి 17,275, ఆళ్లగడ్డ టీడీపీ అభ్యర్థి 15,745, దొర్నిపాడు టీడీపీ అభ్యర్థి కేదాటి పార్వతి 9686, రుద్రవరం టీడీపీ అభ్యర్థి పకీరన్న -16,258, ఉయ్యాలవాడ టీడీపీ అభ్యర్థి స్వరూపరాణి- 6321 ఓట్ల మెజార్టీతో గెలిపోందారు. ఆత్మకూరు టీడీపీ అభ్యర్థి ఆదిలక్ష్మిభాయ్‌ 4064, జూపాడుబంగ్లా టీడీపీ అభ్యర్థి శాంతకుమారి -3178, పగిడ్యాల టీడీపీ అభ్యర్ధి బండి రమణమ్మ 2103 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం రాజకీయంగా కూటమి నేతలతో పాటు నాయకులు, కార్యకర్తల్లో సంతోషం రెట్టింఫైంది.

ఆనందంలో కూటమి వర్గీయులు

పరిషత్‌ పోరు లో భాగంగా జడ్పీటీసీ, ఎంపీటీసీల పరంగా ఎక్కువ స్థానాలు కూటమి అభ్యర్థులు విజయం సాధించడంతో కూటమి నేతలతో పాటు నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థుల్లో ఆనందం వెల్లివిరిసింది. ఫలితాలు వెలువడిన అనంతరం ఎక్కడక్కిడ అభ్యర్థులను కూటమి వర్గీయులు పూలదండలు, హరతులతో సత్కరించారు. ఇదిలా ఉండగా... విజయం సాధించిన అభ్యర్థులకు మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రజాని ధులతో పాటు కీలక నాయకులు సైతం అభినందనలు తెలిపారు.

జిల్లాలో పరిస్థితి ఇలా..

జడ్పీటీసీలు, ఎంపీటీసీల పరంగా ఫలితాలు ఇలా...

నియోజకవర్గం జడ్పీటీసీలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీ

నందికొట్కూరు 06 05 - - 05 01

నంద్యాల 02 - - - - 02

పాణ్యం 02 02 - - 02 -

ఆళ్లగడ్డ 06 06 - - 06 -

ఆత్మకూరు 04 03 - - 03 01

డోన్‌ 03 02 - - 02 01

బనగానపల్లె 05 05 - - 05 -

మొత్తం 28 23 - - 23 05

నంద్యాల జిల్లాలో ఎంపీటీసీలు

నియోజకవర్గం ఎంపీటీసీలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి వైసీపీ ఇతరులు

నందికొట్కూరు 65 39 - - 38 26 01

నంద్యాల 27 07 - - 07 20 -

పాణ్యం 26 19 - - 19 07 -

ఆళ్లగడ్డ 71 42 04 - 46 25 -

ఆత్మకూరు 49 30 02 01 33 15 01

డోన్‌ 54 32 - - 32 21 01-

బనగానపల్లె 84 54 01 01 56 28 -

మొత్తం 376 222 07 02 231 142 03

ఏకగ్రీవమైన స్థానాలు ఇవే

జడ్పీటీసీల : టీడీపీ-7, వైసీపీ-1

ఎంపీటీసీలు : టీడీపీ-94, వైసీపీ-52, జనసేన-3, బీజేపీ-2, ఎస్‌డీపీఐ-1

Updated Date - Nov 08 , 2026 | 12:32 AM