Share News

ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం

ABN , Publish Date - Feb 02 , 2026 | 11:31 PM

శ్రీశైల క్షేత్రంలో జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రులు దిశానిర్దేశం చేశారు.

ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌కు శ్రీకారం
శ్రీశైలంలో సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలి

గతంలో లేని విధంగా దర్శన విధానాలు

నాలుగు రోజులపాటు ఉచిత లడ్డూ ప్రసాదం

కలెక్టర్‌ మాటే తుది నిర్ణయం - దేవదాయశాఖ మంత్రి

పెట్రోలింగ్‌ విధానంతో రేయింబవళ్లు లైవ్‌ స్ట్రీమింగ్‌ - ఎస్పీ సునీల్‌ షరాణ్‌

శ్రీశైలం, ఫిబ్రవరి 02 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రంలో జరగబోయే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇస్తూ ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దాలని రాష్ట్ర మంత్రులు దిశానిర్దేశం చేశారు. సోమవారం క్షేత్ర పరిధిలోని సదాశివయ్య భవన్‌లో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై రెండో సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి, దేవదాయశాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌, ఎక్స్‌ అఫిషియో ప్రిన్సిపాల్‌ సెక్రటరీ హరిజవహర్‌లాల్‌, కలెక్టర్‌ రాజకుమారి, ఎస్పీ సునీల్‌ షరాణ, ఆర్‌జేసీ చంద్రశేఖర్‌ ఆజాద్‌, ఈవో శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మెన్‌ రమే్‌షనాయుడు, ఆత్మకూరు డీఎ్‌ఫవో విఘ్నేష్‌ అప్పావు, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లు, ట్రస్ట్‌బోర్డు సభ్యులు, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. ఈవో శ్రీనివాసరావు పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం ఛైర్మెన్‌ మాట్లాడుతూ సీఎం దిశా నిర్దేశం ప్రకారం రాష్ట్రాన్ని ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా మార్చే కర్తవ్యంలో భాగంగా శివరాత్రి వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో ఏర్పాట్లు తుది దశకు పనులు చేరుకుంటాయని వివరించారు. క్షేత్ర పరిఽధిలో ప్రత్యేక నిఘాలో భాగంగా డ్రోన్‌ పెట్రోలింగ్‌ విధానంతో రేయింబగుళ్లు లైవ్‌ స్ట్రీమింగ్‌తో పోలీసులు కంట్రోల్‌ రూంలో పర్యవేక్షిస్తుంటారని ఎస్పీ సునీల్‌ షరాణ్‌ తెలిపారు.

సింగిల్‌ అడ్మిన్‌ కలెక్టర్‌ మాటే తుది నిర్ణయం - ఆనం

బ్రహ్మోత్సవాల ఆద్యంతం అన్ని శాఖల అధికారులు సిబ్బందికి కలెక్టర్‌ ఇచ్చిన సూచనలే కీలక తుది నిర్ణయమని ఆనం రామనారాయణరెడ్డి తేల్చి చెప్పారు. భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లలో గత అనుభవాలను స్మరిస్తూ సమస్యకు పరిష్కార దిశగా తక్షణ చర్యలు తీసుకోవలని అన్నారు. శివరాత్రి సందర్భంగా నాలుగు రోజులపాటు భక్తులందరికీ ఉచిత లడ్డూ ప్రసాదాలు పంచేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. వీఐపీ దర్శనాలకు వచ్చే వారు టైంస్లాట్‌ను ఖచ్చితంగా అనుసరించేలా చూసుకోవాలని ఆలయ అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్న శివసేవకులకు ప్రత్యేక గుర్తింపు కార్డులు ఇస్తూ కీలక సూచనలు పాటించవలసి ఉంటుందని చెప్పారు.

2300 వందల మంది సిబ్బందితో ప్రత్యేక భద్రత హోం మంత్రి అనిత

బ్రహ్మోత్సవాలలో శాంతి భద్రతలకు భంగం కలుగకుండా పటిష్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని హోం మంత్రి అనిత పోలీస్‌ అధికారులను ఆదేశించారు. జీరో ఇన్సిడెంట్‌ బ్రహ్మోత్సవ్‌గా పేరు తెచ్చుకోవడానికి 2300 మంది పోలీస్‌ అధికారులు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాని చెప్పారు. భక్తుల భద్రతా దృష్ట్యా ట్రాఫిక్‌ నియంత్రణ, అత్యవసర సేవలు, బందోబస్తు నిర్వహణ పై ప్రత్యేక ప్రణాళికలు చేసుకోవాలని సూచించారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్‌లకు 1 ప్లస్‌ 1 డ్రైవర్లు అన్నివేళలా అందుబాటులో ఉండాలని అన్నారు.

వీఐపీల దర్శనాలతో సామాన్యులకు ఇబ్బంది కలగకూడదు - హరిజవర్‌లాల్‌

తెల్లవారుజాము నుండి రాత్రి వరకు సామాన్య భక్తులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ స్వామి అమ్మవార్ల సర్వ దర్శనాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. వీఐపీలు తమకు కేటాయించిన టైంస్లాట్స్‌లలో మాత్రమే ఆలయ ప్రవేశం చేసి దర్శనాలు పూర్తి చేసుకోవాలని కోరారు. వీఐపీల దర్శనాలు సామాన్య భక్తులకు ఇబ్బందికరంగా మారకూడదని అన్నారు.

గతంలో లేని విధంగా దర్శన విధానాలు

- బీసీ జనార్దన్‌ రెడ్డి

శివరాత్రి బ్రహ్మోత్సవాలలో స్వామి అమ్మవార్లను దర్శించుకునేందుకు వచ్చే సామాన్య భక్తులకు మునుపెన్నడూ లేని విధంగా దర్శన విధానాలు కల్పిస్తున్నట్లు ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి జనార్దన్‌ రెడ్డి వెల్లడించారు. లక్షలాదిగా తరలి వచ్చే భక్తుల మనోభావాలకు ప్రాధాన్యతనిస్తూ అపశృతులకు తావివ్వకుండా తగు జాగ్రత్తలతో మౌలిక వసతులు కల్పించాలన్నారు.

Updated Date - Feb 02 , 2026 | 11:31 PM