కూటమి ప్రభంజనం
ABN , Publish Date - Nov 08 , 2026 | 12:35 AM
పరిషత్ పోరులో కూటమి తిరుగులేని ఆధిపత్యం సాధించింది.
ఊరూవాడా వైసీపీని ఊడ్చేసిన కూటమి
గ్రామసీమల్లో పసుపు సునామీతో రెక్కలు విరిగిన ఫ్యాన్
26 జడ్పీటీసీల్లో 20 స్థానాల్లో కూటమి జెండా
432 ఎంపీటీసీలకు ఏకగ్రీవాలతో 313 చోట్ల విజయకేతనం
వైసీపీకి వచ్చిన ఎంపీటీసీ స్థానాలు 111
అభివృద్ధి, సంక్షేమానికి జైకొట్టిన ఓటర్లు
పరిషత్ పోరులో కూటమి తిరుగులేని ఆధిపత్యం సాధించింది. పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే కాదు.. పల్లెపోరులోనూ ఓటర్లు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి అఖండ విజయం అందించారు. కందనవోలు గడ్డపై తూర్పు నుంచి పశ్చిమం దాకా పల్లెపల్లెన విజయకేతనం ఎగురవేసింది. ఎన్నికలు ఏవైనా కూటమిదే విజయం అని చాటారు. పసుపు సునామీతో ఫ్యాన్ రెక్కలు విరిగిపోయాయి. అభివృద్ధి, సంక్షేమానికి జైకొట్టి సూపర్ సిక్స్.. సూపర్ హిట్.. అంటూ వైసీపీని ఊరూవాడా ప్రజలు ఊడ్చేశారు. ఎన్నికలు జరిగిన 26 జడ్పీటీసీ స్థానాలకు గానూ 22 స్థానాల్లో విజయఢంకా మోగిస్తే 358 ఎంపీటీసీ స్థానాలకు గానూ 325 చోట్ల విజయబావుటా ఎగురవేసింది. ఏకంగా 25 మండల పరిషత్తుల్లో ‘మండలాధీశుల’ పీఠాలను కైవసం చేసుకుని గ్రామీణ రాజకీయాల్లో తిరుగులేని పట్టును చాటుకుంది.
కర్నూలు, నవంబరు7 (ఆంధ్రజ్యోతి): పరిషత్ పోరులో కూటమి అభ్యర్థులు ప్రభంజనం సృష్టించారు. జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలు, 358 ఎంపీటీసీ స్థానాలకు గురువారం ఎన్నికలు జరిగాయి. జడ్పీటీసీ బరిలో 97 మంది, ఎంపీటీసీ కోసం 928 మంది పోటీ పడ్డారు. 26 మండ లాల్లో 12,49,212 మంది ఓటర్లు ఉంటే.. జిల్లా పరిషత్, మండల పరిషత్తుల్లో తమ ప్రతినిధులను ఎన్నుకోవడానికి 8,52,335 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. శనివారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పర్యవేక్షణలో ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది.
పోస్టల్ బ్యాలెట్‌లోనూ..
కర్నూలు నగరంలో సిల్వర్ జూబ్లీ కాలేజీ, ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల, ఆదోనిలో ఆర్ట్ అండ్ సైన్స్ కాలేజీ, ఎమ్మిగనూరులో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పత్తికొండలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆలూరులో ప్రభుత్వ డిగ్రీ, జూనియర్ కళాశాలు, ప్రభుత్వ బాలుర పాఠశాలల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టారు. 2060 మంది అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఓట్ల లెక్కింపులో పాల్గొన్నారు. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. అన్ని చోట్ల ఉద్యోగులు కూటమికే జైకొట్టడంతో పోస్టల్ బ్యాలెట్లలోనూ ఆధిక్యత సాధించింది. ఆజో్‌షను అలాగే కొనసాగిస్తూ.. రౌండ్ రౌండ్‌కు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి బులెట్ ట్రైన్ వేగంతో సైకిల్ దూసుకుపోయింది.
పసుపు జోరు.. సంబరాల హోరు
దీపావళి ముందే వచ్చిందా..! అన్నట్లుగా పల్లెల్లో టీడీపీ శ్రేణులు బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయం అందుకోవడంతో కూటమి, టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొంది. టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు ఎగురవేస్తూ గ్రామగ్రామాన కూటమి శ్రేణుల విజయోత్సవాలు మిన్నంటాయి. నగర, పట్టణాలతో పాటు గ్రామీణ స్థానిక సంస్థల్లో లభించిన ఈ విజయం ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువనేత, మంత్రి నారా లోకేశ్‌ల పాలనదక్షత, ట్రిపుల్ ఇంజన్ సర్కారుకు ప్రజా మద్దతు అని కూటమి నేతలు పేర్కొంటున్నారు.
కూటమికి 313 స్థానాలు...
26 మండల పరిషత్‌ల్లో 432 ఎంపీటీసీ స్థానాలుంటే 74 ఏకగ్రీవాలు అయ్యాయి. 358 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవాలతో కలిపి టీడీపీ 300 చోట్ల, జనసేన 7 స్థానాల్లో, బీజేపీ 6 స్థానాల్లో విజయం సాధించాయి. కూటమి మొత్తం 313 స్థానాలు దక్కించుకుంది. ఏకగ్రీవాలతో కలిపి వైసీపీ 111 ఎంపీటీసీ స్థానాలు దక్కించుకుంది. ఎనిమిది స్థానాల్లో సీపీఎం, స్వతంత్రులు గెలుపొందారు.
19 జడ్పీటీసీ స్థానాల్లో కూటమి విజయం
జిల్లాలో 26 జడ్పీటీసీ స్థానాలున్నాయి. 19 స్థానాల్లో కూటమి తిరుగులేని విజయం సాధించింది. సీట్లు సర్దుబాటులో భాగంగా టీడీపీ 22 స్థానాల్లో పోటీ చేస్తే 19స్థానాల్లో విజయం సాధిచింది. బీజేపీ హాలహర్విలో ఒక స్థానంలో పోటీ విజయకేతనం ఎగుర వేసింది. వైసీపీ 26 స్థానాల్లో పోటీ చేసి కేవలం ఐదు స్థానాలతో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. హోళగుంద జడ్పీటీసీ స్థానానికి టీడీపీ రెబల్‌గా బరిలో దిగిన స్వతంత్ర అభ్యర్థి ఈడిగ గోవిందగౌడ్ విజయం సాధించారు. కృష్ణగిరి జడ్పీటీసీగా టీడీపీ మద్దతుతో మర్రి శ్రీరాములు గెలిపొందారు. జనసేన మూడు స్థానాల్లో పోటీ చేస్తే మూడింట ఓడిపోయింది.
జిల్లాలో నియోజవర్గాల వారీగా పార్టీల దక్కించుకున్న ఎంపీటీసీ స్థానాలు
నియోజకవర్గం మొత్తం టీడీపీ జనసేన బీజేపీ మొత్తం వైసీపీ ఇతరులు
స్థానాలు కూటమి
పత్తికొండ 78 61 1 1 63 14 1
ఆలూరు 91 58 5 3 66 22 3
మంత్రాలయం 76 55 1 1 57 19 --
కోడుమూరు 67 44 -- -- 44 20 3
పాణ్యం 30 21 -- -- 21 9 --
ఎమ్మిగనూరు 59 41 -- -- 41 17 1
ఆదోని 31 21 -- 1 21 10 --
మొత్తం 432 300 7 6 313 111 8
జిల్లాలో పార్టీల వారీగా గెలుచుకున్న జడ్పీటీసీ స్థానాలు
జడ్పీటీసీ స్థానాలు 26 19 -- 1 20 5 1