విద్యార్థులకు వెలుగు పంచడమే ధ్యేయం
ABN , Publish Date - Jan 30 , 2026 | 11:15 PM
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, వెలుగు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు.
పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్
ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులు పునఃప్రారంభం
రూ.కోటి విరాళమిచ్చిన మంత్రి
ఓర్వకల్లు, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించి, వెలుగు పంచడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ అన్నారు. శుక్రవారం మండలంలోని ఓర్వకల్లు గ్రామ సమీపాన ఉన్న డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ భవన నిర్మాణ పనులను మంత్రి టీజీ భరత్, ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డితో కలిసి పునఃనిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ ఉర్దూ యూనివర్సిటీ నిర్మాణానికి తన వంతుగా రూ.కోటి విరాళం ఇచ్చామన్నారు. గత ప్రభుత్వం ఉర్దూ యూనివర్సిటీ, బీసీ భవన్, కాపు భవనం వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను నిలిపివేసిందని అన్నారు. గతంలో లేని విధంగా కర్నూలు జిల్లాకు భారీ పెట్టుబడులు తీసుకువస్తున్నామని అన్నారు. ఇప్పటికే రూ.10వేల కోట్ల పెట్టుబడుల పనులు మొదలయ్యాయని, రానున్న రోజుల్లో రూ.50వేల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని మంత్రి తెలిపారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి మాట్లాడుతూ నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2014-19 కాలంలో ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని మంజూరు చేయడం ద్వారా మైనార్టీల విద్యాభివృద్ధికి బలమైన పునాది వేశారని పేర్కొన్నారు. మంత్రి టీజీ భరత్ రూ.కోటి నిధులు ప్రకటించడం ఎంతో ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ ప్రొ. షావలి ఖాన్, పారిశ్రామికవేత్త బీకే సింగ్, ఎంపీడీవో నాగ అనుసూయ, తహసీల్దార్ విద్యాసాగర్, డీఎస్పీ బాబు ప్రసాద్, సీఐ చంద్రబాబు నాయుడు, ఎస్‌ఐ సునీల్ కుమార్, టీడీపీ మండల కన్వీనర్ బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, ఉపాధ్యక్షుడు గోవిందరెడ్డి పాల్గొన్నారు.