Share News

నిబంధనలు తప్పనిసరి

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:10 PM

ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు వారి మద్దతుదారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు.

నిబంధనలు తప్పనిసరి
నామినేషన్‌ కేంద్రాల వద్ద బందోబస్తును పరిశీలిస్తున్న ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌

నామినేషన్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు

కర్నూలు క్రైం, అక్టోబరు 22(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా రాజకీయ పార్టీల నాయకులు, అభ్యర్థులు వారి మద్దతుదారులు ఎన్నికల సంఘం నిర్దేశించిన నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించలని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. గురువారం నామినేషన్‌ కేంద్రాల వద్ద విధించిన ఆంక్షలను ఆయన పరిశీలించారు. నామినేషన్‌ కేంద్రాల పరిసరాల్లో అనవసరంగా గుమిగూడటం, ర్యాలీలు నిర్వహించడం, అధిక సంఖ్యలో మద్దతుదారులను వెంట తీసుకురావడం వంటి చర్యలకు దూరంగా ఉండాలన్నారు. నిబంధనల ప్రకారం అనుమతించిన వాహనాలు, వ్యక్తులకు మాత్రమే నామినేషన్‌ కేంద్రాల వద్దకు అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. జిల్లాలో ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు అన్ని వర్గాల వారు బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసు శాఖకు సహకరించాలని ఆయన కోరారు. అత్యవసర సమయంలో డీసీఆర్‌బీ సీఐ గుణశేఖర్‌బాబు నెంబర్‌ 9121101039ను సంప్రదించాలన్నారు. లేదా పోలీసు సహాయం కోసం డయల్‌ 112 లేదా 100కు కాల్‌ చేయాలని సూచించారు.

డ్రోన్‌ కెమెరాలతో నిరంతర నిఘా: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోందని ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ తెలిపారు. గురువారం కర్నూలు జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని నామినేషన్‌ కేంద్రాన్ని భద్రతా ఏర్పాట్లను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియకు 26 కేంద్రాలు, జడ్పీటీసీ ప్రక్రియకు జడ్పీ కార్యాలయంలో ఒక కేంద్రం కలిసి మొత్తం 27 కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరణ జరుగుతోందన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల ప్రక్యి కొనసాగుతుందన్నారు. శుక్రవారం చివరి రోజు కావడంతో అభ్యర్థులు సరైన ధ్రువపత్రాలతో సకాలంలో హాజరు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐలు తేజమూర్తి, శ్రీధర్‌, ఎస్‌ఐలు ఉన్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:10 PM