ఆళ్లగడ్డలో మరోసారి టెన్షన్
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:12 PM
ఆళ్లగడ్డ పట్టణంలోని శివాలయం సెంటర్ పాతూరు వీధిలో మంగళవారం మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది.
నిఘా నీడలో శివాలయం సెంటర్
టీడీపీ నేత హర్షరెడ్డి ఇంటికి విందుకు వెళ్లిన ఎమ్మెల్యే
ఏవీ సుబ్బారెడ్డి ఇంటి పరిసరాలు కావడంతో ఉద్రిక్తత
రెండు గంటల పాటు కాలనీని ఆధీనంలో తీసుకున్న పోలీసులు
ఆళ్లగడ్డ, ఫిబ్రవరి 3(ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డ పట్టణంలోని శివాలయం సెంటర్ పాతూరు వీధిలో మంగళవారం మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. అహోబిలం లక్ష్మీనరసింహస్వామి పారువేట ఉత్సవాలలో భాగంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, భార్గవ్‌రామ్, జగత్‌విఖ్యాత్‌రెడ్డి తమ ముఖ్య అనుచరులతో కలిసి స్థానిక టీడీపీ నేత హర్షరెడ్డి పిలుపు మేరకు విందుకు హాజరయ్యారు. మాజీ ఆర్‌ఐసీ చైర్మెన్ ఏవీ సుబ్బారెడ్డి ఇంటి పక్కనే ఉన్న హర్షరెడ్డి నివాసానికి ఎమ్మెల్యే రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సఘటనలు జరగకుండా డిఎస్పీ ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో నియోజక వర్గ పరిధిలోని సీఐలు, ఎస్‌ఐలు స్పెషల్ పార్టీ పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక దశలో కాలనీ మొత్తాన్ని తమ ఆఽధీనంలోకి తీసుకొని ఎవ్వరినీ అనుమతి ఇవ్వలేదు. ఇరువర్గాల మధ్య కొంత కాలంగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకొన్నారు. కాలనీ పోలీసుల పహారాలో డ్రోన్ కెమెరాల నిఘాతో రెండు గంటలపాటు ఉత్కంఠ కొనసాగింది.