Share News

విజయ డెయిరీ ప్రాంగణంలో ఉద్రిక్తత

ABN , Publish Date - Jan 10 , 2026 | 11:48 PM

నంద్యాల సమీపంలోని విజయ డెయిరీ ప్రాంగణంలో శనివారం పోలీసులు భారీ ఎత్తున మోహరించారు.

విజయ డెయిరీ ప్రాంగణంలో ఉద్రిక్తత
బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు

భారీగా పోలీసుల మోహరింపు

నంద్యాల క్రైం, జనవరి 10 (ఆంధ్రజ్యోతి) : నంద్యాల సమీపంలోని విజయ డెయిరీ ప్రాంగణంలో శనివారం పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ముత్యాలపాడు సొసైటీ సభ్యులు, త్రిసభ్య కమిటీ సభ్యులు హాజరు కానున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుందనే ఉద్దేశ్యంతో ముందస్తుగా పోలీసులు భారీగా చేరుకున్నారు. గత బుధవారం డెయిరీ ప్రాంగణంలో చోటు చేసుకున్న పరిణామాల వల్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదే రోజు కమిటీ డైరెక్టర్‌ రవికాంత్‌రెడ్డి, డెయిరీ ఎండీ ప్రదీప్‌ను తాలూకా పోలీసులు బైండోవర్‌ చేసి తహసీల్దార్‌ శ్రీనివాసులు ఎదుట హాజరు పరిచిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో పదో తేదీని చివరి అవకాశంగా నిర్ణయిస్తూ విచారణకు హాజరు కావాలని త్రిసభ్య కమిటీ సభ్యుడు గంగుల విజయ సింహారెడ్డి కోరినట్లు తెలిసింది. కాగా శనివారం ముత్యాలపాడు సొసైటీ సభ్యులు, సొసైటీ చైర్మన్‌గా ఎన్నికైన భూమా విఖ్యాత్‌రెడ్డి హాజరు కాకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. గతంలో చక్రవర్తిపల్లె పాల సొసైటీ చైర్మన్‌గా ఉన్న భూమా విఖ్యాత్‌రెడ్డిని డీఫాల్టర్‌గా కమిటీ సభ్యులు పేర్కొన్న నేపథ్యంలో ముత్యాలపాడు సొసైటీ ఎన్నిక చెల్లదని కమిటీ సభ్యులు స్పష్టం చేసినట్లు సమాచారం.

విచారణ రద్దు

నంద్యాల రూరల్‌ : విజయ డెయిరీ ముత్యాలపాడు పాల సేకరణ సొసైటీ విచారణ రద్దయినట్లు సమాచారం. శనివారం త్రిసభ్య కమిటీ విచారణ జరగాల్సి ఉండగా త్రిసభ్య కమిటీ సభ్యులు, విచారణకు ఇరువర్గాలవారు హాజరుకాలేదు. దీంతో సమావేశం రదైంది.

Updated Date - Jan 10 , 2026 | 11:48 PM