మాధవరంలో ఉద్రిక్తత
ABN , Publish Date - Jun 12 , 2026 | 11:42 PM
మండలంలోని మాధవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు అల్లరి చేష్టలు చేశారు.
వైసీపీ కార్యకర్తల అల్లరి చేష్టలు
చితకబాదిన టీడీపీ నాయకులు
తుఫాన్ వాహనం, బైక్ దగ్ధం
పలువురికి తీవ్ర గాయాలు
ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు
మాధవరం, రాంపురం, బసాపురంలో భారీ బందోబస్తు
మంత్రాలయం, జూన్ 12(ఆంధ్రజ్యోతి): మండలంలోని మాధవరంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ కార్యకర్తలు అల్లరి చేష్టలు చేశారు. దీనికి ప్రతికారంగా టీడీపీ నా యకులు, కార్యకర్తలు వైసీపీకి చెందిన బైక్, తుఫాన్ వాహనానికి నిప్పు పెట్టారు. ఇరువర్గాల మధ్య దాడి జరిగింది. ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈసంఘటన శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఇరువర్గాలు, గ్రామస్థులు తెలిపిన వివరాలు.. సీఎం చంద్రబాబు నాయుడు పాలన వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమానికి మం త్రాలయం, రాంపురం, కాచాపురం ప్రాంతాల నుంచి వైసీపీ కార్యకర్తలు కోసిగికి బయ లు దేరేందుకు సిద్ధమయ్యారు.
రాఘవేంద్రరెడ్డి నివాసం ముందు..
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, ప్రదీప్‌రెడ్డి మాధవరం చేరుకోగానే అదేరోడ్డులో ఉన్న టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్ర రెడ్డి నివాసం ముఖద్వారం ముందు వైసీపీ అల్లరి మూకలు బైక్‌లతో, బాణసంచా పేల్చి అలజడి సృష్టించారు. అప్పటికే రాఘవేంద్ర రెడ్డి ఇంట్లో ఎవరూ లేరు. పనిమనిషి సాల్మాన్ బయటికొచ్చి ఇక్కడ ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించాడు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో వైసీపీ అల్లరి మూకలు అతడిపై దాడికి పాల్పడ్డారు. ఎమ్మెల్యే వెనుక ఉన్న నాయకులు కలుగజేసుకొని వైసీపీ అల్లరి మూకలను చెదరగొట్టి సాల్మాన్ ఇంట్లోకి పంపించారు.
నాయకులను సమీకరించి..
రాఘవేంద్రరెడ్డి పనిమనిషిపై దాడి విషయాన్ని తెలుసుకున్న మాజీ సర్పంచ్ రఘునాథ్ రెడ్డి, సింగిల్‌విండో అధ్యక్షుడు రామకృష్ణారెడ్డికి తెలపడంతో కోపోద్రికులైన నాయకులు ఆయా గ్రామాల నుంచి టీడీపీ శ్రేణులను సమీకరించారు. కోసిగిలో నిరసన కార్యక్రమం ముగించుకొని తిరిగి వెళ్తూ మాధవరంలోని రాఘవేంద్ర రెడ్డి ఇంటి ముందు మరోసారి కేకలు వేశారు. బైక్‌పై వెళ్తున్న వైసీపీకి చెందిన ఈరన్నతో పాటు మరొకరిని టీడీపీ కార్యకర్తలు చితకబాది బైక్‌కు నిప్పంటించారు. కొద్ది సేపటికే వైసీపీ కార్యకర్త పెట్రోల్ బంకు శీనుకు చెందిన తుఫాన్ వాహనం వస్తుండగా దాన్ని అడ్డగించారు. డ్రైవర్ లాజర్‌ను చితకబాది అందులో ఉన్న వైసీపీ కార్యకర్తలను దింపి వాహనంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు.
పోలీసులకు సైతం గాయాలు
అదేరోడ్డులో వస్తున్న వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల మధ్య మరోసారి ఘర్షణ చోటుచేసుకుంది. ఈఘర్షణలో సూగూరుకు చెందిన వైసీపీ నాయకులు దేవదాసు, బోయ లక్ష్మిరెడ్డికి గాయాలయ్యాయి. దీన్ని నివారించేదుకు వెళ్లిన మాధవరం హెడ్ కానిస్టేబుల్ వీరేష్, కానిస్టేబుల్ వీరాంజనేయులు సైతం టీడీపీ కార్యకర్తలు చేసిన దాడిలో గాయపడ్డారు. విషయం తెలుసుకున్న మంత్రాలయం, కోసిగి సీఐలు దస్తగిరి బాబు, శ్రీనివాసులు, మంత్రాలయం, మాధవరం, నందవరం, కోసిగి ఎస్‌ఐలు విజయ్ కుమార్, మల్లికార్జున, తిమ్మారెడ్డి, శ్రీనివాసులు, పోలీసు సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
వాహనాలకు నిప్పు పెట్టడంపై..
ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆదేశాలతో మాధవరం మీదుగా రావాల్సిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి, మిగతా నాయకులను దారిమళ్లించి సాతనూరు మీదుగా రాంపురానికి పంపారు. తన కార్యకర్తలపై దాడిచేసి రెండు వాహనాలకు నిప్పు పెట్టడంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాధవరం పోలీసుస్టేషన్‌కు వస్తుండగా బసాపురం దగ్గర అడ్డుకొని శాంతింప చేశారు. శాంతియుతంగా పోలీసుస్టేషన్‌కు వెళ్లకుండా పోలీసులు అడ్డుపడుతున్నారని ఎమ్మెల్యే నిరసన తెలిపారు.
నిరసన కార్యక్రమం విజయవంతం కావడంతో..
కోసిగిలో వైసీసీ చేపట్టిన నిరసన కార్యక్రమం విజయవంతం కావటం జీర్ణీంచుకోలేక తమ కార్యకర్తలపై టీడీపీ నాయకులు, కార్యకర్తలు దాడిచేసి రెండు వాహనాలకు నిప్పు పెట్టారని, ఇది ప్రజాస్వామ్యానికి విరుద్దమన్నారు. గాయపడిన తన పార్టీ కార్యకర్తలను పరామర్శించి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కూడా అనుమతి ఇవ్వకుండా అడ్డుకోవటమేమిటని ప్రశ్నించారు.
రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
మాధవరం చేరుకున్న డీఎస్పీ భార్గవి ఇరువర్గాల నాయకులతో మాట్లాడి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులకు సహకరించాలన్నారు. ఈ అల్లరి చేష్టలకు కారకులను గుర్తించి ఇరుపార్టీలపై కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. మాధవరం, బసాపురం, రాంపురం గ్రామాల్లో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు.
వైసీపీ జెండా ధ్వంసం
మాధవరం సర్కిల్‌లో ఉన్న వైసీపీ జెండాను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశారు. జెండాకట్టదగ్గర ఏర్పాటుచేసిన ఇనుప పైపును ధ్వంసం చేసి మురుగుకాలువలో పడేశారు. జెండాకు, ఫ్యాన్ రెక్కలకు సర్కిల్‌లో నిప్పు పెట్టారు.
దాడులకు పాల్పడటం సరికాదు
కోసిగిలో వైసీపీ నిరసన విజయవంతం కావటంతో జీర్ణించుకోలేకనే టీడీపీ శ్రేణులు వైసీపీ కార్యకర్తలపై చేశాయి. కార్యకర్తల వాహనాలను దగ్ధం చేసి దాడులకు పాల్పడటం సరికాదు. శాంతియుతంగా పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు సహనం పాటించాలి.
బాలనాగిరెడ్డి, ఎమ్మెల్యే, మంత్రాలయం
కార్యకర్తలు సహనం పాటించాలి
టీడీపీ నాయకులు, కార్యకర్తలు సహనం పాటించాలి. మరో మూడేళ్ల సహనంతో ఉండి చంద్రబాబు నాయుడు చూపిన దారిలో నడిచి అభివద్ధిని చేసి చూపెడుదాం. నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా ఇలాంటి ఘర్షణలు చేయించటం ఆయనకే బాగా తెలుసు. రాబోయే రోజుల్లో మంత్రాలయాన్ని అభివృద్ధి బాట పట్టిస్తాం.
- ఎన్ రాఘవేంద్ర రెడ్డి, టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మంత్రాలయం