ఆశావహుల్లో ఉత్కంఠ..!
ABN , Publish Date - Nov 22 , 2026 | 12:11 AM
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాల పరంగా టీడీపీ-4, వైసీపీ-2 చొప్పున గెలుపొందాయి
వైస్ చైర్మన్ పదవుల కోసం పైరవీలు
మూడు టీడీపీ.. మూడు వైసీపీ దక్కే అవకాశం
రేపు వైస్ చైర్మన్, కోఆప్షన్ సభ్యుల ఎంపిక
నంద్యాల, నవంబరు21(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్ పీఠాల పరంగా టీడీపీ-4, వైసీపీ-2 చొప్పున గెలుపొందాయి. మున్సిపాలిటీల పరంగా వైస్ చైర్మన్ పదవుల కోసం అన్నిచోట్ల పోటీ పెరిగింది. చైర్మన్ పీఠాల పరంగా టీడీపీ సత్తా చాటిన.. అక్కడక్కడ వార్డుల పరంగా వైసీపీ కొంత ముందంజలో ఉంది. ఈ క్రమంలో ఇటు టీడీపీ.. అటు వైసీపీ సైతం ఎవరికి వారు తమదైన శైలిలో ఆయా పదవులు కోసం పైరవీలు చేస్తున్నారు. ఆరు మున్సిపాలిటీల్లోని ఆరు వైస్ చైర్మన్‌ల పరంగా టీడీపీ-3, వైసీపీ-3 చొప్పున వరించే అవకాశం ఉందని తెలుస్తోంది. లేదంటే టీడీపీ-2, వైసీపీ-4 స్థానాలు దక్కించుకునే అవకాశముంది.
తీవ్ర పోటీ..
నంద్యాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ స్థానం కోసం టీడీపీ, వైసీపీలో తీవ్ర పోటీ నెలకొంది. నంద్యాల మున్సిపాలిటీలో 52 వార్డులుండగా టీడీపీ-24, వైసీపీ-27, బీజేపీ-1 గెలుపొందారు. ఇక్కడ వైస్ చైర్మన్ ఎన్నిక ఇరుపార్టీల్లోనూ రసవత్తరంగా మారింది. వైస్ చైర్మన్ పీఠం ఏపార్టీకి వస్తుందో? అని పట్టణంలో హాట్ టాఫిక్‌గా మారింది. విశ్వసనీయ సమాచారం మేరకు బీజేపీ నుంచి గెలుపొందిన వార్డుమెంబర్ పబ్బతి వేణు, టీడీపీ తరుపున గెలుపొందిన ఖండే శ్యామ్‌కు దక్కే అవకాశం లేకపోలేదు.
ముమ్మరం ఏర్పాట్లు
జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో చైర్మన్, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంతో పాటు వైస్‌చైర్మన్, కో ఆఫ్షన్ సభ్యుల పరోక్ష ఎన్నిక సోమవారం జరగనుంది. జిల్లా అధికార యంత్రాంగం ఎక్కడిక్కడ ఆయా ఏర్పాట్లలో నిమగ్నమైంది. కలెక్టర్ రాజకుమారి సైతం పర్యవేక్షించారు. పోలీసు యంత్రాంగం భద్రతను కట్టుదిట్టం చేశారు.
ముగ్గురి మధ్య పోటీ..
డోన్ 36 వార్డుల్లో టీడీపీ-16, వైసీపీ-15, జనసేన-2, సీపీఐ-2, ఇండిపెండెంట్-1 చొప్పున వార్డులు దక్కించకున్నారు. చైర్‌పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి కోట్ల సుజాతమ్మ విజయం సాధించారు. ఇక్కడ వైస్‌చైర్మన్ పదవికోసం ముగ్గురు మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం.
వైసీపీకే దక్కే అవకాశం
నందికొట్కూరులో 32 వార్డుల్లో టీడీపీ- 9, వైసీపీ-23 చొప్పున గెలుపొందారు. వైసీపీ చైర్‌పర్సన్‌గా ఫాతిమాబీ గెలుపొందారు. ఇక్కడ వైస్ చైర్మన్ వైసీపీకే దక్కే అవకాశముందని తెలుస్తోంది. వైస్ చైర్మన్ పదవికి వైసీపీలోనూ ముగ్గురు మధ్య పోటీ ఉన్నట్లు సమాచారం.
ఆత్మకూరులో ఏకగ్రీవం
ఆత్మకూరులో 32 వార్డుల్లో టీడీపీ- 18, వైసీపీ-9, బీజేపీ-1, జనసేన-1, ఇండిపెండెంట్-1 చొప్పున దక్కించుకున్నారు. చైర్మన్‌గా టీడీపీకి చెందిన డాక్టర్ గోవిందరాజులు ఏకగ్రీవ మయ్యారు. 20వ వార్డు వైసీపీ అభ్యర్థి ప్రియాంకబాయి రీ షెడ్యూల్ ఎన్నికలో ఏకగ్రీవమైంది. టీడీపీ, వైసీపీ ఒప్పందంలో భాగంగా ఆమెకు వైస్ చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించారు.
బేతంచర్లలో వైసీపీకే..
బేతంచెర్ల నగర పంచాయతీలోని 28 వార్డుల్లో టీడీపీ- 10, వైసీపీ-18 చొప్పున గెలుపొందారు. ఇక్కడ చైర్మన్‌గా వైసీపీ నుంచి దూదేకుల దస్తగిరి గెలుపొందారు. ఇక్కడ కూడా వైసీపీ వాళ్లకే వైస్ చైర్మన్ పదవి దక్కే అవకాశం లేకపోలేదు. వారిలో కూడా ముగ్గురి మద్య పోటీ ఉన్నట్లు సమాచారం.
నలుగురి మధ్య పోటీ
ఆళ్లగడ్డలో 32వార్డుల్లో టీడీపీ-22, వైసీపీ-8, జనసేన-2 చొప్పున ఏకగ్రీవమయ్యారు. చైర్ పర్సన్‌గా టీడీపీ అభ్యర్థి షేక్ అనీషా ఏకగ్రీవమయ్యారు. ఇక్కడ వైస్ చైర్మన్ పదవి కోసం టీడీపీలోని నలుగురి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. మరోవైపు జనసేన నుంచి కూడా వైస్ చైర్మన్ పదవి ఆశిస్తున్నారని తెలిసింది.