ఆళ్లగడ్డలో టెన్షన్
ABN , Publish Date - Feb 02 , 2026 | 11:33 PM
ఆళ్లగడ్డలో రెండు వర్గాల పోరు తార స్థాయికి చేరుకుంది. అధికార టీడీపీలోనే రెండు వర్గాలు ఉండటంతో ‘ఆళ్లగడ్డ’ పోరు పార్టీ హైకమాండ్‌కు తలపోటుగా మారింది.
ఉద్రిక్తతలకు దారి తీసిన గోడ కూల్చివేత
ఎమ్మెల్యేపై టీడీపీ సీనియర్ నేత ఏవీ సుబ్బారెడ్డి ఆగ్రహం
తనకేమీ తెలియదంటున్న మున్సిపల్ కమిషనర్
నంద్యాల, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): ఆళ్లగడ్డలో రెండు వర్గాల పోరు తార స్థాయికి చేరుకుంది. అధికార టీడీపీలోనే రెండు వర్గాలు ఉండటంతో ‘ఆళ్లగడ్డ’ పోరు పార్టీ హైకమాండ్‌కు తలపోటుగా మారింది. తాజాగా ఆళ్లగడ్డలో టీడీపీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవీ సుబ్బారెడ్డికి చెందిన ఓ కాంప్లెక్స్ భవన గోడను అధికారులు కూల్చివేయడంతో అసలు సమస్య తలెత్తింది. పట్టణంలోని పాతబస్టాండ్ వద్ద టీడీపీ నాయకుడు ఏవీ సుబ్బారెడ్డి ‘ఏవీ కాంప్లెక్స్’ పేరిటో షాపింగ్ భవనం ఉంది. అయితే సోమవారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అక్కడకు చేరుకుని ఏవీ కాంప్లెక్స్ నుంచి ప్రధాన రహదారికి వెళ్లే సిమెంట్ రోడ్డును పరిశీలించారు. ప్రజల రాకపోకలకు అడ్డుగా ఉందని, ప్రజా సౌకర్యార్థం తాత్కాలికంగా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఈ క్రమంలో మున్సిపల్ అధికారులు ఏవీ కాంప్లెక్స్ వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన గోడను ప్రొక్లెయినర్లతో తొలగించారు. అదేవిధంగా పక్కనే ఉన్న పేడ దిబ్బలను కూడా తొలగించారు. తన కాంప్లెక్స్ పరిధిలోని గోడ కూల్చి వేస్తున్నారని సమాచారంతో ఏవీ సుబ్బారెడ్డి ఇద్దరు కుమార్తెలతో కలసి సంఘటనా స్ధలానికి చేరుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆయన్ను పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్పీ కె. ప్రమోద్ కుమార్, సీఐ యుగంధర్‌తో పాటు పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నాయి. ‘మా స్థలం వద్దకు మేం వెళ్లకూడదా..’ అంటూ ఏవీ సుబ్బారెడ్డి, ఆయన కుమార్తెలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. చివరకు పోలీసులతో కలసి ఆయన తన కాంప్లెక్స్ వద్దకు వెళ్లి కూల్చిన గోడను పరిశీలించారు. నోటీసులు ఇవ్వకుండా తన స్థలంలో కట్టడాలను ఎలా తొలగిస్తారని ఆయన ప్రశ్నించారు. ‘ఎమ్మెల్యే ఏది చెబితే అది చేస్తారా..’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థలానికి సంబంధించిన పత్రాలు ఏమైనా ఉంటే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో సంప్రదించాలని డీఎస్పీ సూచించారు. ఈ విషయం తనకు తెలియనది మున్సిపల్ కమిషనర్ కిశోర్ తెలపడం గమనార్హం.
ఆళ్లగడ్డలో ఆటవిక రాజ్యం : ఏవీ సుబ్బారెడ్డి
ఆళ్లగడ్డలో ఆటవిక రాజ్యం నడుస్తోంది. నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎమ్మెల్యే, ఆమె తమ్ముడు దగ్గరుండి గోడను కూల్చి వేశారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న నా వ్యవహారంలోనే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటి. ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, సోదరుడు భూమా జగత్ విఖ్యాత్ రెడ్డి, భార్గవ్‌రామ్‌లు కమీషన్ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు. చికెన్ దుకాణాల దందా నుంచి ఇసుక, మద్యం, శిల్పాల తయారీదారుల వద్ద కూడా అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. పార్టీ ప్రతిష్ఠను దృష్టిలో ఉంచుకుని ఎన్నో విషయాలను ప్రస్తావించలేదు. విమర్శిచడం లేదు. జరిగిన అన్యాయం, సంఘటనలను టీడీపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్తాను.
ప్రైవేట్ ఆస్తుల జోలికి పోలేదు
ఆళ్లగడ్డలోని పాత బస్టాండ్‌లో ఉన్న ప్రైవేట్ ఆస్తుల జోలికి పోలేదని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ అన్నారు. సోమవారం ఆమె మాట్లాడుతూ మున్సిపల్ అధికారులు వేసిన రోడ్డుపై బండలు పేర్చి గోడ ఏర్పాటు చేశారన్నారు. అలాగే పేడ దిబ్బలు, చెత్త ఉండటంతో వాటిని తొలగిం చామన్నారు. ఇటీవల ఆ ప్రాంతంలో తాను పర్యటిం చినప్పుడు చెత్త, అడ్డుగోడలపై ఫిర్యాదు చేశారని, ప్రజల విజ్ఞప్తి మేరకు మున్సిపల్ అధికారులకు చెప్పి తొలగించా మన్నారు. అంతే తప్ప ప్రైవేట్ ఆస్తుల జోలికి పోలేదని, ప్రైవేట్ కట్టడాలను కూల్చలేదన్నారు. ప్రజా ప్రతినిధిగా వ్యవహరించానే తప్ప ఎలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడలేదని ఎమ్మెల్యే అన్నారు. - ఎమ్మెల్యే అఖిలప్రియ