Share News

అహోబిలంలో ఉద్రిక్తత

ABN , Publish Date - Nov 27 , 2026 | 12:16 AM

మండలంలో అహోబిలం గ్రామ పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనాలపై వైసీపీ మూకలు రాళ్ల దాడి చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల ఏజెంట్ల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది

అహోబిలంలో ఉద్రిక్తత
గాయపడ్డ డ్రైవర్‌ హుస్సేన్‌, దాడికి గురైన ఎమ్మెల్యే అఖిలప్రియ కారు

ఇరువర్గాల ఏజెంట్ల మధ్య వాగ్వాదం

ఎమ్మెల్యే వాహనాలపై వైసీపీ మూకల దాడి

ఏడుగురికి గాయాలు

ఇద్దరి పరిస్థితి విషమం

ఆళ్లగడ్డ, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): మండలంలో అహోబిలం గ్రామ పంచాయతీలోని పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. గురువారం ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనాలపై వైసీపీ మూకలు రాళ్ల దాడి చేశారు. పోలింగ్‌ కేంద్రం వద్ద ఇరువర్గాల ఏజెంట్ల మధ్య మొదలైన వాగ్వాదం తీవ్ర రూపం దాల్చింది. ఒకరినొకరు రాళ్లు, కర్రలతో పరస్పర దాడికి దిగారు. ఎన్నికల సరళిని పరిశీలించేందుకు వచ్చిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, యువ నాయకుడు జగత్‌ విఖ్యాత్‌రెడ్డి వాహనాలు పోలింగ్‌ కేంద్రంలోని బారికేడ్ల వద్ద ఉంచి వెళ్లారు. అంతలోనే వైసీపి నాయకులు అక్రోశంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వాహనాలపై రాళ్ల, కర్రలతో దాడి చేశారు. ఎమ్మెల్యేకు చెందిన మూడు వాహనాల అద్దాలు ద్వంసమయ్యాయి. తమ నాయకుల వాహనాలు ద్వంసం చేశారన్న ఆగ్రహంతో టీడీపీ నాయకులు ప్రతి దాడులకు దిగారు. ఒకరినొకరు రాళ్లు వేసుకుంటుండడంతో పోలింగ్‌ కేంద్రం పరిసరాలు రణ రంగాన్ని తలపించింది.

రోడ్డుపై బైఠాయించి నిరసన

విషయం తెలిసిన వెంటనే ఎస్పీ సునీల్‌ షెరాన్‌ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఎస్పీని చూసి వైసీపీ వర్గీయులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారితో మాట్లాడాలని ఎస్పీ వైసీపీ నాయకుల వద్దకు వెళ్లారు. పావన నరసింహ స్వామి వద్దకు వెళ్లే రోడ్డులో పార్కింగ్‌ చేసి ఉన్న భూమా అఖిలప్రియ వాహనాన్ని తీసుకువస్తున్న డ్రైవర్‌పై కూడా వైసీపీ నాయకులు దాడి చేశారు. వాహనం అదుపు తప్పి ధర్నాలో కూర్చున్న వారిపైకి దూసుకొచ్చింది. ధర్నా చేస్తున్న నలుగురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. డ్రైవర్‌ హుస్సేన్‌ను వైపీపీ నాయకులు కర్రలతో దాడి చేయడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. వైసీపీ నాయకుల రాళ్లు దాడిలో టీడీపీకి చెందిన ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఎస్పీ సమక్షంలోనే ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నారు. పోలీసు బలగాలు ఇరువర్గాల వారిని చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

పోలీసుల వైఫల్యంతోనే దాడులు

ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని అహొబిలం, జం బులదిన్నె, మాయలూరు పంచాయతీ ఎన్నికల్లో పోలీసుల వైఫల్యంతోనే వైసీపీ నాయకులు దాడులకు పాల్పడ్డారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం అహోబిలంలో ఆమె, టీడీపీ యువ నాయకుడు భూమా జగత్‌విఖ్యాత్‌రెడ్డి పోలీసుల తీరుకు నిరసనగా బైఠాయించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అహోబిలంకి చెందిన వైసీపీ నాయకుడు వెంకటేశ్వర్లుపై పలు కేసులున్నాయని, అతడిని హౌస్‌ అరెస్టు చేయాలని ముందే చెప్పామన్నారు. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఈ గొడవలు జరిగాయన్నారు. పోలీసులు సమస్యాత్మక గ్రామాల్లో ముందస్తు బందోబస్తు ఏర్పాటు చేయకపోగా వైసీపీ నాయకుల వైపు ఏకపక్షంగా వ్యహరించారన్నారు. తాము అహోబిలానికి వస్తున్నట్ల వైసీపీ నాయకులు ముందుగానే పసిగట్టి గ్రామ శివారులో రాళ్లు, కారంపొడి , కర్రలతో దాడులకు దిగేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఈవిషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లితే తనను అరెస్టు చేస్తామని అంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈవిషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

టీడీపీ నాయకుడిపై దాడి

చాగలమర్రి: పంచాయతీ ఎన్నికల్లో గురువారం మండలంలోని పెద్దబోదనంలో టీడీపీ నాయకుడు కుమార్‌రెడ్డిపై ముసుగులు ధరించిన వ్యక్తులు దాడి చేశారు. వివరాల మేరకు. అతడి ఇంటి సమీపంలోనే దాటి చేశారు. ఎన్నికల ఏజెంట్లు కేకలు వేయడంతో టీడీపీ వర్గీయులు వచ్చేలోపు దాడికి పాల్పడిన వ్యక్తులు తెచ్చుకున్న వాహనంలో పరారయ్యారు. ఈ విషయంపై స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దాడికి పాల్పడిన వారి కోసం ఆరా తీస్తున్నామని, టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగేంద్రప్రసాద్‌ తెలిపారు.

Updated Date - Nov 27 , 2026 | 12:16 AM