ఆదోనిలో ఉద్రిక్తత
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:16 PM
డీఎస్సీ అంశంపై వైసీపీ చేపట్టిన నిరసనలు, ధర్నాలపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
డీఎస్సీ అంశంపై ఎమ్మెల్యే పార్థసారథి మండిపాటు
వైసీపీ కార్యాలయానికి వస్తానని సవాల్
అడ్డుకున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించి నిరసన
ఆదోని, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): డీఎస్సీ అంశంపై వైసీపీ చేపట్టిన నిరసనలు, ధర్నాలపై ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైసీపీ నేతల సవాల్‌ను స్వీకరించి వివరణ ఇచ్చేందుకు వెళ్లిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకోవడంతో ఆదోనిలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. సాయంత్రం 4 గంటలలోపు డీఎస్సీ ద్వారా నష్టం జరిగినట్లు భావిస్తే తమ కార్యాలయానికి రావాలని, లేనిపక్షంలో తానే నేరుగా వైసీపీ కార్యాలయానికి వచ్చి వివరణ ఇస్తానని సవాల్ విసిరారు. లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తకుండా ఆదోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, వైసీపీ కార్యాలయాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. వైసీపీ కార్యాలయం వద్ద భారీగా కార్యకర్తలు గుమిగూడగా వన్, టూ టౌన్ సీఐలు చంద్రశేఖర్, రాజశేఖర్‌రెడ్డి తమ సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని పంపించేశారు.
గొడ్డలి పార్టీ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు
వైసీపీ కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ డీఎస్పీ వెంకటరమణ, సీఐలు నల్లప్ప, చంద్రశేఖర్ వారిని అడ్డుకోవడంతో ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వైసీపీ గొడ్డలి పార్టీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. రోడ్డుపైకి వచ్చి పోలీసుల తీరును ప్రశ్నించారు. అనంతరం అక్కడే విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబునాయుడు తొలి సంతకం డీఎస్సీపైనే పెట్టారని గుర్తు చేశారు. ఇచ్చిన మాట ప్రకారం 16,848 పై చిలుకు టీచర్ పోస్టులను భర్తీ చేశామన్నారు. ప్రభుత్వానికి వస్తున్న మంచి పేరును చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రతి ప్రశ్నకు పూర్తి సమాచారంతో పక్కా ఆధారా లతో నివృత్తి చేస్తామని తెలిపారు.
ఉద్యమంలో పాల్గొంటానని సవాల్
తాము ఇచ్చే వివరణతో సంతృప్తి చెందకపోతే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని, మీ నిరసనలో ఒక్కటి నిజమని నిరూపితమైనా తనను తప్పుబట్టవచ్చని, మీతో పాటు కలిసి ఆ ఉద్యమంలో పాల్గొంటానని ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీ నాయకులకు సవాల్ విసిరారు. పోలీసులు ఆయనను జీపులో క్యాంపు కార్యాలయానికి తరలించారు. టీడీపీ సీనియర్ నాయకులు మదిరె భాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు కనిగిరి నీలకంఠ, నాగరాజుగౌడ్, ఉపేంద్రకుమార్, శ్రీనివాస్ ఆచారి, రమే్‌షయాదవ్, మల్లికవ్వ పాల్గొన్నారు.