‘వీబీఆర్ ముట్టడి’లో ఉద్రిక్తత
ABN , Publish Date - Sep 01 , 2026 | 11:59 PM
రైతులకు తాగు, సాగు నీరు అందించాలని వైసీపీ నాయకులు చేపట్టిన వెలుగోడు జలాశయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మంగళవారం ఉదయం నుండే పోలీసులు భారీగా వెలుగోడు జలాశయానికి వెళ్లే రహదారులన్నీ దిగ్బంధం చేశారు.
వైసీపీ నేతలను అడ్డుకున్న పోలీసులు
భగ్నమైన ముట్టడి
వెలుగోడు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రైతులకు తాగు, సాగు నీరు అందించాలని వైసీపీ నాయకులు చేపట్టిన వెలుగోడు జలాశయం ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. మంగళవారం ఉదయం నుండే పోలీసులు భారీగా వెలుగోడు జలాశయానికి వెళ్లే రహదారులన్నీ దిగ్బంధం చేశారు. మోతుకూరు గ్రామం వద్ద మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి తనయుడు శిల్పా కార్తీక్‌రెడ్డి, శిల్పా భువనేశ్వరరెడ్డిలను ఆడ్డుకున్నారు. దీంతో పలువురు నాయకులు, రైతులు రోడ్డుపైనే భైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కల్గింది. పోలీసులు జోక్యం చేసుకొని రాకపోకలకు అంతరాయం లేకుండా చేశారు. దీంతో వారు ఆగ్రహించి వెలుగోడు వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు వైసీపీ నాయకులకు మధ్య వాదోపవాదాలు, తోపులాటలు జరిగాయి. నిరసనకారులను వాహనాల్లో ఎక్కించేందుకు పోలీసులు ప్రయత్నించగా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతరం నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవికిశోర్‌రెడ్డి మోతుకూరు వద్దకు చేరుకొని జలాశయం వద్దకు చేరుకొనేందుకు ప్రయత్నంచారు. పోలీసులు అతనిని కూడ అక్కడే అడ్డుకున్నారు. మరోవైపు వేల్పనూరు వైపు నుండి మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, కాటసాని రామిరెడ్డి జలాశయం ముట్టడికి తరలివచ్చారు. పోలీసులు వారిని కూడా అడ్డగించారు. దీంతో వారు పాదయాత్రగా వెలుగోడు గ్రామ శివార్లకు చేరుకొని రోడ్డుపైనే కూర్చొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకులు మాట్లాడుతూ రైతులకు తాగు, సాగునీరు ఇవ్వాలని కోరుతుంటే జాప్యం చేస్తున్నారని అన్నారు. ఇప్పటికెనా తాగుసాగు నీరందించి రైతులు నష్టపోకుండా పంటలను కాపాడాలని కోరారు.