శ్రీశైలంలో ఆలయ సంప్రోక్షణ
ABN , Publish Date - Mar 03 , 2026 | 11:33 PM
చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తెల్లవారుజామున శ్రీశైలం ఆలయాన్ని అర్చకులు మూసివేశారు.
గ్రహణకాలం వీడిన తర్వాత ఆలయ శుద్ధి
భక్తులకు అలంకార దర్శనం
నేటి నుంచి యథావిధిగా ఆర్జిత సేవలు
శ్రీశైలం, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): చంద్రగ్రహణం కారణంగా మంగళవారం తెల్లవారుజామున శ్రీశైలం ఆలయాన్ని అర్చకులు మూసివేశారు. రాత్రి 7 గంటలకు గ్రహణ కాలం వీడిన తర్వాత శాస్త్రోక్తంగా పూజాదికాలు చేసి ఆలయ సంప్రోక్షణ చేశారు. ఆలయ శుద్ధి అనంతరం భక్తులకు స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనం కల్పించారు. తెల్లవారుజామున ప్రాతఃకాల పూజలు, మహామంగళ హారతులు నిర్వహించారు. అనంతరం 4:30 నుంచి 5:30 గంటల వరకు భక్తులకు దర్శనాలు కల్పించి ఆలయాన్ని మూసివేశారు. ఉభయ దేవాలయాలతోపాటు పరివార, అనుబంధ ఆయాల్లో కూడా ఏకకాలంలో గ్రహణానంతర ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరిగి సాయంత్రం 7:30 గంటలకు ఆలయ ద్వారాలు తెరచి ఆలయ సంప్రోక్షణ, శుద్ధి నిర్వహించారు. రాత్రి 9 గంటల నుంచి 10:30 గంటల వరకు భక్తులకు అలంకార దర్శనాలు కల్పించారు. గ్రహణకాల పూజల్లో ఆలయ ప్రధానార్చకులు వీరయ్య, ముఖ్యఅర్చకులు హరి, ఈఓ శ్రీనివాసరావు, సీఎస్‌ఓ శ్రీనివాసరావు, ఏపీఆర్‌ఓ డాక్టర్ శివారెడ్డి, పర్యవేక్షకులు హర్యానాయక్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా స్వామిఅమ్మవార్ల ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులకు బుధవారం ఉదయం నుంచి యథావిధిగా సేవలు అందుబాటులో ఉంటాయని ఈఓ తెలిపారు.