ఆసుపత్రిలో మిన్నంటిన రోదనలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 12:22 AM
మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఎమ్మిగనూరు ప్రభుత ్వ వైద్యశాలలో మృతి చెందారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
కంటతడి పెట్టించిన కర్ణాటకవాసుల మృత్యుఘోష
మృతదేహాలను పరిశీలించిన సబ్ కలెక్టర్, టీడీపీ నాయకులు
స్వస్థలాలకు మృతదేహాల తరలింపు
ఎమ్మిగనూరు/టౌన్, ఏప్రిల్ 16(ఆంధ్రజ్యోతి): మంత్రాలయం మండలం చిలకలడోన గ్రామంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడిక్కడే మృతి చెందగా మరో ముగ్గురు ఎమ్మిగనూరు ప్రభుత ్వ వైద్యశాలలో మృతి చెందారు. వీరిలో తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రమాద సంఘటన తెలిసిన వెంటనే ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో మంత్రాలయం, ఎమ్మిగనూరు పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మృతి చెందిన వారితో పాటు క్షతగాత్రులను అంబులెన్స్‌ల్లో ఎమ్మిగనూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన 13మందికి ప్రాథమిక చికిత్సలు చేసి మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన 8 మంది మృత దేహాలు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉండడంతో విషాదఛాయలు అలముకున్నాయి. సాయంత్రం 4గంటల సమయంలో మృతుల బంధువులు దాదాపు 15 నుంచి 20 మంది ఆస్పత్రికి చేరుకొని కన్నీరు మున్నీరయ్యారు. ప్రమాదంలో హసన్‌జిల్లా శెట్టిగేరి గ్రామానికి చెందిన రాజేష్ భార్య వీణ, కుమారె ్త చిన్నారి నిషిత, మామ సుశీల కుమార్, బావ ఎస్.కె. సునీల్‌తో పాటు మరొకరు మృత్యువాత పడడంతో రాజేష్ ఆస్పత్రిలో రోదించిన తీరు చూపరులను సైతం కంటతడి పెట్టించింది. ముక్కు పచ్చలారని నాలుగేళ్ల నిషితను పోస్టుమార్టం చేసి అంబులెన్స్‌లో పెడుతున్న సందర్భంలో తండ్రి రాజేష్ చిన్నారి మృతదేహాన్ని చూసి అంబులెన్స్‌ను పట్టుకొని విలపించిన తీరు స్థానికులు, అక్కడ ఉన్న అధికారులను సైతం కలచి వేసింది. అతనితో పాటు వచ్చిన బంధువులు, స్నేహితులు ఆయన దుఃఖాన్ని ఆపలేకపోయారు. పోస్టుమార్టం అనంతరం అనంతరం ఆదోని సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి ఆధ్వర్యంలో మృతదేహాలను తరలించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అంబులెన్స్‌లలో ఆరుగురిని హసన్‌జిల్లా శెట్టిగేరి గ్రామానికి, మరో ఇద్దరిని చిక్‌మంగళూరు జిల్లాలోని ఉడేవ గ్రామాలకు తరలించారు.
మృతదేహాలను పరిశీలించిన సబ్‌కలెక్టర్, డీఎస్పీ, టీడీపీ నాయకులు..
ఆదోని సబ్‌కలెక్టర్ అజయ్‌కుమార్, ఎమ్మిగనూరు డీఎస్పీ భార్గవి, మంత్రాలయం టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి రాఘవేంద్రారెడ్డి, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు భాస్కర్ల చంద్రశేఖర్, ఎమ్మిగనూరు, మంత్రాలయం తహసీల్దార్‌లు శ్రీనివాసులు, రమాదేవి ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను పరిశీలించారు. ప్రమాదంలో మృతి చెందిన, గాయపడిన క్షతగాత్రుల వివరాలను వారి బంధువు మనోజ్‌ను అడిగి తెలుసుకున్నారు. సబ్ కలెక్టర్ అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రమాదం దృరదృష్టకరమన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం తరఫున మెరుగైన వైద్యం అందజేస్తామని, మృతదేహాలను ప్రభుత్వం ఆధ్వర్యంలో వారి స్వగ్రామాలకు తరలిస్తామని తెలిపారు.