సర్పంచ్ పీఠంపై గురి..
ABN , Publish Date - Nov 14 , 2026 | 11:56 PM
మేజర్ గ్రామ పంచాయతీని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
చాగలమర్రి మేజర్ పంచాయతీని కైవసం చేసుకునేందుకు టీడీపీ, వైసీపీ నాయకుల కసరత్తు
నేటి నుంచి 17వరకు నామినేషన్లు.. 26న పోలింగ్
చాగలమర్రి, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): మేజర్ గ్రామ పంచాయతీని కైవసం చేసుకునేందుకు అధికార, ప్రతిపక్ష నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. సర్పంచ్‌తోపాటు, 20వార్డు సభ్యుల పదవులు ఉన్నాయి. 17,515 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 8906 మహిళలు, 8608 పురుషులు ఉన్నారు. ఈ దఫా చాగలమర్రి సర్పంచ్ బీసీ మహిళకు రిజర్వు అయింది. గ్రామాల్లో రచ్చబండలు, టీ హోటళ్లు, డాబాల వద్ద అంతా ఎన్నికల గురించే చర్చ నడుస్తోంది.
మొదటి విడతలోనే ఎన్నికలు..
ఆళ్లగడ్డ నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికలు మొతటి విడతలోనే ఉండటంతో గ్రామాల్లో మొదలైన రాజకీయ వేడి అలముకుంది. మండలంలోని ఏ గ్రామంలో చూసినా ప్రజలు సర్పంచ్ పదవి ఎవరికి వస్తుందని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలైంది.
షెడ్యూల్
15 నుంచి 17వరకు నామినేషన్ల స్వీకరణ
18న పరిశీలన, 19న అప్పీల్
21న ఉపసంహరణ
26న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్
27న అవసరమైతే రీ పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన
సర్పంచ్ పదవిపై ఆశావహుల గురి
సర్పంచ్ పదవి దక్కించుకునేందుకు ఆశావాహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రాజకీయంగా పట్టు నిరూపించుకోవడంతోపాటు స్థానికంగా గుర్తింపు తెచ్చుకునేందుకు సర్పంచ్ పదవి కీలకమని ముఖ్య నాయకులు భావించడటంతో వారి చుట్టూ ఆశావహులు ప్రదక్షిణలు చేస్తున్నారు..
టీడీపీ వైసీపీ పోటాపోటీ..
ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తులు లేకుండా నిర్వహిస్తుండటంతో అధికార టీడీపీ అలాగే ప్రతిపక్ష వైసీపీ ఎలాగైనా తమ మద్దతుదారులనే గెలిపించుకోవాలని ముఖ్యనాయకులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ముఖ్య నాయకులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇటు భూమా వర్గీలు, అటు గంగుల వర్గీయులు సైతం పావులు కదుపుతున్నారు. .
ఆరుసార్లు గెలిచిన టీడీపీ మద్దతుదారులు..
1935 సంవత్సరం నుంచి గ్రామపంచాయతీ వ్యవస్థ అమలులోకి వచ్చింది. ఇప్పటి వరకు ఆరు పర్యాయాలు టీడీపీ మద్దతుదారులు, మూడుసార్లు గంగుల వర్గీయులు గెలుపొందారు. 1970లో ఫయాజుద్దీన్, 1984లో అజీమోద్దీన్, 1997లో ముల్లా మహబూబ్‌బాషా, 1998లో ఎంఎ్సనిజాముద్దీన్, 2006లో అన్సర్‌బాష, 2001లో గంగుల వర్గీయులు అక్తర్‌బేగం, 2013లో మేదరి సావిత్రి, 2021లో తులమ్మ గెలుపొందారు. ఇక 2013 నుంచి 2021 ఎన్నికల్లో గంగుల వర్గీయులే గెలిచారు.