'చెత్త' లక్ష్యం
ABN , Publish Date - Jun 04 , 2026 | 12:23 AM
చెత్తను సేకరించి, వాటిని ఎరువుగా మార్చి రైతులుకు విక్రయించడం ద్వారా పంచాయతీలకు ఆదాయం సమకూర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకు ప్రభుత్వం రూ.లక్షల్లో ఖర్చు చేస్తోంది. అయితే క్షేత్రస్థాయిలో విఫలం కావడంతో లక్ష్యం నెరవేరలేదు.
బేతంచెర్ల మండలంలో నిరుపయోగంగా చెత్త నుంచి సంపద కేంద్రాలు
ఆసక్తి చూపని అధికారులు, పట్టించుకోని గత పాలకవర్గం
బేతంచెర్ల, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ప్రభుత్వం 19 చెత్త సంపద కేంద్రాలను ఉపాధి నిధుల కింద మంజూరు చేసింది. వీటిలో 17 కేంద్రాలు పూర్తిగా 2 కేంద్రాల నిర్మాణాలు ఆగిపోయాయి.
ఒక్కో కేంద్రానికి రూ.5 లక్షలు..
చెత్త నుంచి సంపద కేంద్రాలకు ఒక్కో కేంద్రానికి రూ.5లక్షలు కేటాయించారు. నిర్మాణం పూర్తయిన వాటిని ఉపయోగించుకునేందుకు గత పాలకవర్గం, ప్రత్యేకాధికారులు ఆసక్తి చూపడం లేదని ఆరోపణలు ఉన్నాయి. షెడ్లు, తొట్లు నిర్మించి అలాగే వదిలేశారు.
ఇలా చేస్తే అదనపు ఆదాయం
ప్లాస్టిక్, నిరుపయోగ వస్తువులను వేరుచేసి, సమీపంలోని సిమెంట్ ఫ్యాక్టరీలకు తరలిస్తే గ్రామ పంచాయితీలకు ఆదాయం వస్తుంది. అయితే ఈ విషయంలో కూడా అధికారులు ఎవరూ ఆసక్తి చూపడం లేదు. గత వైసీపీ ప్రభుత్వం చెత్త సంపద కేంద్రాలను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ ప్రభుత్వం, అధికారులు స్పందించి, చెత్త నుంచి సంపద కేంద్రాలను వినియోగంలోకి తీసుకువచ్చి పంచాయతీల అభివృద్ధికి కృషి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.
ఉపయోగంలోకి తెస్తాం
మండలంలో నిరుపయోగంగా ఉన్న చెత్త సంపద కేంద్రాలను ఉపయోగంలోకి తీసుకువస్తాం. క్షేత్రస్థాయిలో పరిశీలించి, చర్యలు తీసుకుంటాం. - మల్లికార్జున, డిప్యూటీ ఎంపీడీవో, బేతంచెర్ల