Share News

రోజుకో అడుగు తగ్గుతూ...

ABN , Publish Date - Sep 04 , 2026 | 12:01 AM

శ్రీశైల జలాశయానికి ఇరవై రోజులుగా వరద ప్రవాహం పుర్తిగా నిలిచిపోయింది.

రోజుకో అడుగు తగ్గుతూ...
శ్రీశైలం డ్యాం రిజర్వాయర్‌లో తగ్గిన నీటినిల్వ

870 అడుగులకు చేరిన నీటిమట్టం

ఒక్కరోజు కూడా ఆగని టీఎస్‌ జెన్కో విద్యుదుత్పత్తి

శ్రీశైలం, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల జలాశయానికి ఇరవై రోజులుగా వరద ప్రవాహం పుర్తిగా నిలిచిపోయింది. ఎగువ ప్రాజెక్టుల నుంచి అంతంతమాత్రంగా వస్తున్న నీటిని ఎడమగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తిని కొనసాగిస్తూ వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు పంపుతున్నారు. ఈ క్రమంలో రోజుకో అడుగు తగ్గుతూ 880 అడుగులకు చేరుకున్న నీటిమట్టం ప్రస్తుతం 10 అడుగులమేర తగ్గిపోయింది. గురువారం జూరాల ప్రాజెక్టు నుంచి జూరాల ప్రాజెక్టు విద్యుదుత్పత్తి నుంచి 8,328 క్యూసెక్కులు విడుదల అయినప్పటికీ సాయంత్రానికి రిజర్వాయర్‌కు 6,522 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరింది. కొన్ని రోజులుగా కుడిగట్టు విద్యుదుత్పత్తి కేంద్రంలో ఉత్పత్తి నిలిపివేసినప్పటికీ ప్రతి రోజు మాదిరిగానే తెలంగాణ జల విద్యుదుత్పత్తి కేంద్రంలో 28,252 క్యూసెక్కుల నీటిని వినియోగించి దిగువకు విడుదల చేసేశారు. అదే విధంగా హంద్రీ నీవా నుంచి 2,711 క్యూసెక్కులు, కల్వకూర్తి నుంచి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు నుంచి 8,000 క్యూసెక్కులు, వెలిగొండ ప్రాజెక్టుకు 3,500 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 166 క్యూసెక్కుల నీరు విడుదలై మొత్తంగా 45,029 క్యూసెక్కుల నీరు అవుట్‌ఫ్లోగా నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకుగాను ప్రస్తుతం 870.70 అడుగులు, పూర్తిస్థాయి నీటి సామర్ధ్యం 215.80 టీఎంసీలకుగాను ప్రస్తుతం 144.80 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది.

Updated Date - Sep 04 , 2026 | 12:01 AM