Share News

బిడ్డా.. భద్రం

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:19 AM

వేసవి సెలవుల్లో కాసింత సేదతీరడానికి నీటి కొలనులు, కుంటలు, బావుల వద్దకు వెళ్తున్న విద్యార్ధులు మృత్యువాత పడుతున్న ఘటనలు కొకోల్లలుగా కనిపిస్తున్నాయి.

బిడ్డా.. భద్రం
దిగుడు బావిలో ఈత నేర్చుకుంటున్న చిన్నారులు

సరదా మాటున పొంచి ఉండే ప్రమాదం

ఈతకెళ్లి మృత్యువాత పడుతున్న విద్యార్థులు

పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలంటున్న నిపుణులు

కొలిమిగుండ్ల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల్లో కాసింత సేదతీరడానికి నీటి కొలనులు, కుంటలు, బావుల వద్దకు వెళ్తున్న విద్యార్ధులు మృత్యువాత పడుతున్న ఘటనలు కొకోల్లలుగా కనిపిస్తున్నాయి. సరదా చాటున పొంచి ఉన్న ప్రమాదాన్ని గుర్తుంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇటీవల ఏప్రిల్‌ 10న నంద్యాల జిల్లా కేంద్రంలోని పొన్నాపురం కాలనీకి చెందిన 15ఏళ్ల సొహైల్‌ సరదాగా ఈతకు వెళ్లి తల్లిదండ్రులకు కడపుకోత మిగిల్చాడు. గత ఏడాది అక్టోబర్‌లో మహానంది మండలంలోని ఆచార్య ఎన్‌జి రంగ వ్యవసాయ కళాశాల విద్యార్ధి జనార్ధన్‌ నాయక్‌ ఇదే తరహాలో మృత్యువాత పడిన సంఘటన చోటు చేసుకుంది. కొలిమిగుండ్ల మండలంలో సరదాగా గనుల్లో ఈతకు వెళ్లిన విద్యార్ధి మృత్యువాత పడ్డాడు. సెలవుల్లో విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ చూపాల్సిన తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తుండడంతో నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఆట విడుపు కోసం నీటిలో దిగుతున్న వారు అనంత లోకాలకు చేరుకుంటున్నారు.

అవగాహన అవసరం

చిన్నారులకు నీటిపై ప్రత్యేక అవగాహన అవసరమని నిపుణులు సూచిస్తున్నారు. ఈత రాకుండా నీటిలో దిగడం ఎంత ప్రమాదమో పిల్లలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. లోతైన కుంటలు, చెరువులు, జలాశయాల్లోకి ఈతకు వెళ్లడం ప్రమాదమని తల్లిదండ్రులు పిల్లలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందని అభిప్రాయపడుతున్నారు. నీటి కొలనులు, తొట్ల వద్దకు తీసుకెళ్లి ఈతను నేర్పించాలి.

ప్రత్యేక సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలి

ప్రభుత్వం, అధికారులు జలాశయాల వద్ద అవగాహన కల్పించే సూచిక బోర్డులను ఏర్పాటుచేయాలని నిపుణులు సూచిస్తున్నారు. జలాశయాలు, చెరువులు, ప్రమాదకరమైన కుంటలు, వాగుల వద్ద పెద్ద పాటి బోర్డులు ఏర్పాటుచేసి నీటిలో ఈత కొట్టడం ప్రమాదకరమని సూచించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడుతున్నారు. ఈ బోర్డులతో కొంత మేర ప్రమాదాలు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచించారు.

తల్లిదండ్రులు నిఘా ఉంచాలి

సెలవుల్లో సరదాగా ఈతకెళ్లే విద్యార్థులపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలి. కుంటలు, వాగులు, చెరువుల్లో ఈత కొట్టడం ఎంత ప్రమాకరమో వారికి చెప్పాలి. సెలవులకు ముందు పాఠశాలల్లో సైతం ఉపాధ్యాయులు సైతం కల్పించాలి. - అబ్దుల్‌ కలాం, ఎంఈవో, కొలిమిగుండ్ల

ఈత నేర్పించాలి

ఈత రాని పిల్లలకు తల్లిదండ్రులు దగ్గర ఉండి ఈత నేర్పించాలి. వేసవి సెలవుల్లో నీటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. ఎప్పటికప్పుడు పిల్లలకు సరైన అవగాహన కల్పిస్తూ వారిని ముందుకు నడిపించాలి. - మద్దినేని రమేష్‌ బాబు, సీఐ, కొలిమిగుండ్ల

Updated Date - Apr 30 , 2026 | 12:19 AM