Share News

రూ.20వేలు ఇస్తా.. వెళ్లిపో..!

ABN , Publish Date - Apr 26 , 2026 | 12:05 AM

‘రేయ్‌.. రూ.20వేలు ఇస్తా తీసుకుని వెళ్లిపో. ఎందుకు ఆదోనిలో ఇష్యూ చేస్తున్నావ్‌. మర్యాదగా తీసుకునిపో లేకుంటే...’ అంటూ ఏకంగా ఓ సీఐ బాధితుడికి సెటిల్‌మెంట్‌ బెదిరింపు చేశాడు.

రూ.20వేలు ఇస్తా.. వెళ్లిపో..!
అవెంజర్‌ బైక్‌, బాధితుడు సోమశంకర్‌

అప్పటి సీఐ సెటిల్‌మెంట్‌ ఆఫర్‌

బైక్‌ కావాలని బాధితుడి పట్టు

ఆదోని, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): ‘రేయ్‌.. రూ.20వేలు ఇస్తా తీసుకుని వెళ్లిపో. ఎందుకు ఆదోనిలో ఇష్యూ చేస్తున్నావ్‌. మర్యాదగా తీసుకునిపో లేకుంటే...’ అంటూ ఏకంగా ఓ సీఐ బాధితుడికి సెటిల్‌మెంట్‌ బెదిరింపు చేశాడు. ‘లేదు సార్‌.. నాకు నా బైక్‌ కావాల్సిందే. దయచేసి నా బైక్‌ను ఇప్పించండి..’ అంటూ ఆ బాధితుడి ఆవేదన మరోవైపు. ఆదోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఖరీదైన అవెంజర్‌ బైక్‌ మాయం కావడంపై పట్టణంలో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాను సచ్ఛీలుడు అని చెప్పుకునే గతంలో పనిచేసిన ఓ సీఐ (ప్రస్తుతం పొరుగు జిల్లాలో పోస్టింగ్‌) బైక్‌ బాధితుడి పట్ల అనుచిత వ్యవహార శైలి సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. ఆదోని వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో కొన్ని నెలల క్రితం డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో హైదరాబాద్‌లో ఉంటున్న సోమశంకర్‌ అనే వ్యక్తికి చెందిన ఖరీదైన బైక్‌ (అవెంజర్‌ మోడల్‌)ను పోలీసులు సీజ్‌ చేశారు. మద్యం సేవించి వాహనం డ్రైవింగ్‌ చేయడంతో పోలీసులు బైక్‌ను సీజ్‌ చేసి రూ.10వేలు జరిమానా కూడా విధించారు. చట్ట ప్రకారం జరిమానా కట్టి తన వాహనం తీసుకోవడానికి వచ్చిన బాధితుడికి పోలీసులు చుక్కలు చూపించారు. ఆ బైక్‌ కోసం బాధిత యజమాని పోలీస్‌ స్టేషన్‌ చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వలేదు. ఏడు నెలల తర్వాత మళ్లీ వచ్చిన బాధితుడికి బైక్‌ మాయం కావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు. ఈ ఘటనపై బాధితుడు సోమశంకర్‌ మాట్లాడుతూ తనకు ఇష్టపడి కొనుక్కున్న బైక్‌ కావాలని అడిగితే అప్పటి సీఐ అవమానించాడని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘రేయ్‌..’ అని తిడుతూ రూ.20వేలు ఇస్తా నోరు మూసుకుని వెళ్లిపో అని మాట్లాడినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు డబ్బు ఏమీ వద్దని బైక్‌ కావాలని పట్టుపడుతున్నారు. ఇంతకూ స్టేషన్‌లో భద్రంగా ఉండాల్సిన తన ద్విచక్రవాహనం ఏమైందంటూ ప్రశ్నిస్తున్నాడు. ఒక సామాన్యుడి వాహనాన్ని మాయం చేసి అధికార గర్వంతో బెదిరింపులకు దిగుతున్న అధికారులపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని సదరు బాధితుడు డిమాండ్‌ చేస్తున్నాడు. ఇప్పటికీ స్టేషన్‌ చుట్టూ తిరుగుతున్నా.. ప్రస్తుత పోలీసులు కూడా అలాగే మాట్లాడుతున్నారని, తనపై బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితుడు సోమశంకర్‌ ఆరోపిస్తున్నాడు.

Updated Date - Apr 26 , 2026 | 12:05 AM