రాజీమార్గంతో సత్వర న్యాయం
ABN , Publish Date - Sep 12 , 2026 | 11:20 PM
కక్షిదారులు రాజీమార్గంలో తమ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే సత్వర న్యాయాన్ని పొందవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు తెలిపారు.
జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్
61వేలకు పైగా కేసుల పరిష్కారం
కర్నూలు లీగల్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కక్షిదారులు రాజీమార్గంలో తమ కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటే సత్వర న్యాయాన్ని పొందవచ్చని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి (ఎఫ్‌ఏసీ) పి.వాసు తెలిపారు. శనివారం విజయవంతమైన జాతీయ లోక్‌అదాలత్‌ను ప్రారంభించి ఆయన ప్రసంగించారు. కక్షిదారులు లోక్‌అదాలత్‌ల ద్వారా తమ కేసులను పరిష్కరించుకుని ఉచితంగా న్యాయ సహాయాన్ని పొందవచ్చన్నారు. ఈ జాతీయ లోక్ అదాలత్‌లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 61వేలకు పైగా కేసులు పరిష్కారమైనట్లు తెలిపారు. 153 యాక్సిడెంట్ కేసుల్లో బాధితులకు రూ.10,25,27,963 మొత్తాన్ని నష్టపరిహారంగా వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల నుంచి ఇప్పించినట్లు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు కింద ముంపునకు గురై నష్టపోయిన ఆరుగురు రైతుల వారసులకు రూ.98వేలను నష్టపరిహారంగా ప్రభుత్వం నుంచి ఇప్పించినట్లు తెలిపారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.లీలా వెంకట శేషాద్రి మాట్లాడుతూ ఉమ్మడి కర్నూలు జిల్లాలో 31 బెంచ్‌లను ఏర్పాటు చేసి 60వేలకు పైగా క్రిమినల్ కేసులు, 300 సివిల్ కేసులు, 131 బ్యాంకు కేసులను పరిష్కరించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏసీబీ కోర్టు అదనపు జిల్లా న్యాయాధికారి శ్రీవిద్య, లక్ష్మీరాజ్యం, శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్, ప్రిన్సిపుల్ సీనియర్ సివిల్ న్యాయాధికారి మల్లీశ్వరి, న్యాయాధికారులు సంధ్యారాణి, సరోజనమ్మ, అనూష, అపర్ణ, స్రవంతి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి.చంద్రుడు, పోలీసు అధికారులు, బ్యాంకు, ఇన్సూరెన్స్ అధికారులు పాల్గొన్నారు.