Share News

స్వర్ణనగరి.. జొన్నగిరి

ABN , Publish Date - Jun 22 , 2026 | 11:13 PM

నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ.. ఒక పూట తిని.. రెండు పూటలా పస్తులుండే కరువు సీమలో జియో మైసూరు కంపెనీ పుణ్యమా అని బంగారు పంటలు పండుతాయి.

స్వర్ణనగరి.. జొన్నగిరి

దేశంలోనే తొలి ప్రైవేటు బంగారు శుద్ధి కర్మాగారం

రైతుల పసిడి కలలు నెరవేరే సమయం

ఏటా 500 నుంచి 1000కిలోల బంగారు నిక్షేపాలు వెలికితీత

నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు

కరువు సీమలో బంగారు పంటలు

ప్రారంభానికి సిద్ధంగా ‘జేజీఎఫ్‌’

రేపు జొన్నగిరికి రానున్న సీఎం చంద్రబాబు నాయుడు

నిత్యం కరువు కాటకాలతో అల్లాడుతూ.. ఒక పూట తిని.. రెండు పూటలా పస్తులుండే కరువు సీమలో జియో మైసూరు కంపెనీ పుణ్యమా అని బంగారు పంటలు పండుతాయి. రైతుల పొలాలకు మంచి ధరలు రావడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు వస్తున్నాయి. 2000 సంవత్సరం నుంచి ఎన్నో కంపెనీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడంతో పాటు ప్రైవేటు కంపెనీలు కూడా బంగారు నిక్షేపాల కోసం అన్వేషించారు. 2012లో డెక్కెన్‌ కంపెనీ ఆధ్వర్యంలో జియో మైసూరు కంపెనీ ప్రాజెక్టు పనులు ప్రారంభించడంతో పాటు పైలట్‌ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం, భూములు లీజుకు తీసుకోవడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఏటా 500 కిలోల నుంచి 1000 కిలోల వరకు బంగారం వెలికితీతకు కంపెనీ సిద్ధమైంది. బుధవారం సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రారంభించునున్నారు.

తుగ్గలి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): మండలంలోని జొన్నగిరి స్వర్ణనగరిగా మారనుంది. ఎన్నో సంవత్సరాల పరిశోధనలకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 2012లో డెక్కెన్‌ కంపెనీ ఆధ్వర్యంలో జియో మైసూరు కంపెనీ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. దాదాపు రూ.400 కోట్లు పెట్టుబడులు పెట్టి ప్యాక్టరీ పనులు పూర్తి చేసి బంగారు నిక్షేపాలు వెలికితీసేందుకు సిద్ధమైంది. ఏటా 500 నుంచి 1000కిలోల బంగారు వెలికితీత ప్రణాళిక సిద్ధం చేశారు. ఈనెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా బంగారు నిక్షేపాల జియో మైసూరు కంపెనీ ప్రారంభానికి ఏర్పాట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే హెలిప్యాడ్‌ నిర్మాణంతో పాటు వాహనాల్లో వెళ్లేందుకు రహ దారులను బహిరంగ సభకు షెడ్డు ఏర్పాటు చేయడం, సభకు వచ్చిన రైతులకు భోజన వసతికి అన్ని ఏర్పాట్లు కంపెనీ యాజమాన్యం సిద్ధం చేసిం ది. రెండు దశాబ్దాల కల నెరవేరు తుంది.

1,500 ఎకరాలను లీజుకు తీసుకుని..

జొన్నగిరి, పగిడిరాయి, బొల్లవానిపల్లె గ్రామాల పరిధిలోని దాదాపు 1,500 ఎకరాలను లీజుకు తీసుకుని అందులో ఇప్పటికే దాదాపు 300ఎకరాలు కొనుగోలు చేసి ఓపెన్‌ క్యాస్ట్‌ మైనింగ్‌ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన భూములకు ఏటా లీజులు చెల్లిస్తున్నారు. బంగారంను శుద్ధిచేసేందుకు మద్దికెర మండలంలోని ఎడవలి గ్రామం సమీపంలోని హంద్రీనీవా కాలువ నుంచి సుమారు 20 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి 0.021 టీఎంసీల నీరు ఫ్యాక్టరీకి సరఫరా అయ్యేలా కూటమి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది.

దేశంలోనే తొలి ప్రైవేటు..

బంగారు నిక్షేపాల గని అంటేనే మనకు కేజీఎఫ్‌ గుర్తుకు వస్తుంది. ఆ కంపెనీ ప్రభుత్వం ఆధ్వర్యంలో బంగారు నిక్షేపాలు వెలికితీస్తుంది. ఆకంపెనీ ప్రస్తుతం ఉనికిలో లేదు. మన జేజీఎఫ్‌(జియో మైసూరు గోల్డ్‌ ఫీల్డ్స్‌) దేశంలోనే మొట్టమొదటి ప్రైవేటు గోల్డ్‌ మైన్స్‌ కంపెనీగా జియో మైసూరు కంపెనీ బంగారు వెలికితీత పనులు ప్రారంభం అవుతు న్నాయి.

రైతుల కుటుంబాలకు..

జియో మైసూరు కంపెనీ కోసం భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు కల్పించడమే కాకుండా వారితో పాటు నియోజకవర్గంలోని నిరుద్యోగులకు కూడా ఉద్యోగావకాశాలు కల్పించారు. దాదాపు 800 మంది పనిచేస్తున్నారు. 80 శాతం మంది స్థానికులే పని చేయడం గమనార్హం.

ఒకటిన్నర టన్ను మట్టికి..

జియో మైసూరు కంపెనీ ఓపెన్‌ కాస్ట్‌ మైనింగ్‌లో 1.5 టన్నుల మట్టికి ఒక గ్రాము బంగారం వస్తుంది. దాదాపు ప్రతిరోజు 1 కిలో 3గ్రాముల బంగారం వెలికితీస్తారు.

40 ఏళ్ల కల సాకారం

40 ఏళ్ల నుంచి కలలు గంటున్న బంగారు నిక్షేపాల వెలికితీత జియో మైసూరు కంపెనీ. ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించనున్నారు. సీఎం పర్యటన కోసం హెలి ప్యాడ్‌ సిద్ధం చేయడంతో పాటు వాహనాలు వెళ్లేందుకు రహదారులు, బహిరంగ సభకు షెడ్లు, రైతులు భోజనం చేసేందుకు టెంట్లు, షామియానాలు అన్ని భద్రతా ఏర్పాట్లు సిద్ధమయ్యాయని కంపెనీ యాజమాన్యం తెలిపారు. జియో మైసూరు కంపెనీ బం గారు నిక్షేపాల వెలికితీత పనులు ప్రారంభమైతే దేశంలో బంగారు దిగుమతులు కూడా తగ్గే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు.

అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం

ఈ నెల 24న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా జియో మైసూరు కంపెనీని ప్రారంభించనున్నారు. అందుకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా స్వయంగా పర్యవేక్షిస్తూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నాం.

కేఈ శ్యాంబాబు, ఎమ్మెల్యే, పత్తికొండ నియోజకవర్గం

అదృష్టంగా భావిస్తున్నా

అహర్నిశలు కష్టపడి ఫ్యాక్టరీ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నా. కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. రైతులందరూ సహాయ సహకారాలు అందించి ఫ్యాక్టరీ నిర్మాణానికి కృషి చేశారు. ప్రతి రైతుకు జియో మైసూరు కంపెనీ రుణపడి ఉంటుంది.

మానస రంజన్‌ బిశ్వాల్‌, డైరెక్టర్‌, జియో మైసూరు కంపెనీ

పకడ్బందీగా భద్రతా ఏర్పాట్లు

పరిశీలించిన కలెక్టర్‌, ఎస్పీ

తుగ్గలి, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ఏ,సిరి, ఎస్పీ విక్రాంత్‌ పాటిల్‌ అన్నారు. సోమవారం మండలంలోని జొన్నగిరి జియో మైసూరు గోల్డ్‌ మైన్స్‌ కంపెనీకి కలెక్టర్‌, ఎస్పీతో పాటు జేసీ నూరుల్‌ ఖమర్‌ వచ్చారు. ఫ్యాక్టరీ లోపల, పరిసర ప్రాంతాలతో పాటు హెలిప్యాడ్‌, రైతుల బహిరంగ సభ, భోజనశాల, భద్రతా ఏర్పాట్లును కంపెనీ ప్రతినిధులు, అన్నిశాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. హెలిప్యాడ్‌ పనులను త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. బహిరంగ సభలో దాదాపు 5వేల నుంచి 10వేల దాకా రైతులు, ప్రజలు పాల్గొంటారని, వారికి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తుగ్గలి నాగేంద్ర, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె కిష్టమ్మ, వెంకటపతి, ఆయా శాఖల అధికారులు మహేశ్వరరెడ్డి, నరసింహారెడ్డి, ప్రదీప్‌ కుమార్‌, ఆర్డీవో ఓబులేసు, తహసీల్దార్‌ రవి, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - Jun 22 , 2026 | 11:13 PM