Share News

స్వామీ స్టైలే వేరు..!

ABN , Publish Date - Nov 15 , 2026 | 11:54 PM

అతడి స్టైలే వేరు.. ఏది చేసినా అందులో ప్రత్యేకత ఉండాల్సిందే. జాతరలు అయి నా.. వేడుకలైనా వైరల్‌గా మారాల్సిందే.

స్వామీ స్టైలే వేరు..!

నేరచరిత్రులతో కలిసి ఎస్‌ఐ పుట్టిన రోజు వేడుకలు

సోషల్‌ మీడియాలో వైరలైన వీడియో

దూకుడు ప్రవర్తనతో సొంత శాఖలోని వారికే ఇక్కట్లు

అతడి వ్యవహారశైలిపై పలు ఆరోపణలు

గుర్రుగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులు

అతడి స్టైలే వేరు.. ఏది చేసినా అందులో ప్రత్యేకత ఉండాల్సిందే. జాతరలు అయి నా.. వేడుకలైనా వైరల్‌గా మారాల్సిందే. వివాదంగా మార కపోతే నచ్చదేమో.. అదే ఆయన స్పెషాలిటీగా మారిం ది. ఆ అధికారి తీరుతో పోలీ సు శాఖకే మచ్చ తీసుకు వస్తు న్నారు. కర్నూలు జిల్లాలోని ఓ పట్టణంలోని పోలీసుస్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ తీరు వివాదా స్పదంగా మారింది. శాంతి భద్ర తలకు విఘాతం కలిగిస్తే అడ్డు కోవాల్సిన అధికారే విచక్షణ మరిచి వ్యవహరిం చడం చర్చనీయాంశమైంది. నడి రోడ్డుపై బుల్లెట్‌ పెట్టి పుట్టిన రోజు సంబరాలు చేసుకు న్నారు. ఈ అధికారి దూకుడు ప్రవర్తనతో సొంత శాఖకు చెందిన పలు వురు కానిస్టేబుళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం.

కర్నూలు క్రైం, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): కర్నూలు నుంచి ఆదోనికి వెళ్లే మార్గంలో ఉన్న పోలీసుస్టేషన్‌కు చెందిన ఎస్‌ఐ తీరు వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవలే ఆయన చేసుకున్న సంబరాలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. శాంతిభద్రతలను కాపాడాల్సిన అధికారే వీటికి విఘాతం కలిగేలా వ్యవహరించడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. నడిరోడ్డుపై బుల్లెట్‌ బైక్‌ పెట్టి నేరచరిత్ర కలిగినవారు, కొంతమంది రాజకీయ నాయకులతో కలిసి బర్త్‌డే వేడుకలు చేసుకోవడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఏమిటీ వేడుకలు?

నెల రోజులుగా జిల్లా వ్యాప్తంగా స్థానిక ఎన్నికలతో పోలీసు శాఖ తలామునకలై ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తోంది. ఇలాంటి తరుణంలో ఆయన ఇలా వేడుకలు చేసుకోవడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఆ పోలీస్‌ అధికారి ఇలా ఐదారు మంది పాత నేరచరిత్ర కలిగిన వ్యక్తులతో కలిసి ఇటీవలే ఎంపీటీసీగా ఎన్నికైన వ్యక్తితో తన స్టేషన్‌కు చెందిన సిబ్బందితో కలిసి నడిరోడ్డుపై సంబరాలు చేసుకోవడంపై ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. శివమణి జిందాబాద్‌ అంటూ నినాదాలు చేయడంపై పోలీసు శాఖ ముక్కున వేలేసుకుంటుంది. రౌడీషీటర్లను కంట్రోల్‌ చేయాల్సిన ఆయన వారితోనే కలిసి ఇలా చేయడంపై ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు.

బైకుల మాయం కేసు..

గతంలో ఈస్టేషన్‌లో కొన్ని బైకులు మాయం కాగా ఆ కేసు బయట పడటంతో ఆనెపం కొంతమంది పోలీసులపై నెట్టేసి వారిని సస్పెండ్‌ చేయించినట్లు విమర్శలు న్నాయి. ఎవరైనా స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వస్తే కేసు నమోదు చేయడంలో తీవ్ర జాప్యం చేస్తారనే ఆరోపణలున్నాయి. తన పోలీస్‌ స్టేషన్‌లో సుమారు నాలుగైదు టిప్పర్లు సీజ్‌ చేసిన ఇసుక ఉండగా ఆ ఇసుకను కూడా తన సొంత అవసరాలకు ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.

పోలీసు ఉన్నతాధికారులు కూడా..

ఆ ఎస్‌ఐ దూకుడు ప్రవర్తనతో సొంత శాఖకు చెందిన పలువురు కానిస్టేబుల్స్‌ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు సమాచారం. ఈ యన వ్యవహారశైలితో పోలీసు ఉన్నతాధికారులు కూడా విసుగెత్తిపోయారని విమర్శలున్నాయి. కర్నూలు సమీపంలో ఉన్న ఓ రిసార్ట్‌ వ్యవహారంలో ఆయన ప్రవర్తించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ఈ రిసార్ట్‌ యజమానిని బెదిరించి ఆయనకు చెందిన వెంచర్‌లో ఓ రెండు ప్లాట్లను తక్కువ ధరకే తనకు తెలిసిన వ్యక్తికి విక్రయించాలని పట్టుబడటం, దానికి సంబంధించిన రిజిస్ర్టేషన్ల ఫీజులు కూడా యజమానే భరించాలని చెప్పారు. ఆయన కాదనడంతో రిసార్ట్‌లో జరిగే కొన్ని కార్యక్రమాలపై కేసులు నమోదు చేసే స్థాయికి వెళ్లినట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ రిసార్ట్‌లోకి తను వెళ్లే సమయంలో అక్కడ ఎవరూ కూడా ఉండకూడదని హుకుం జారీ చేయడంతో తమ బిజినెస్‌ ఎలా జరుగుతుందంటూ నిర్వాహకులు ప్రశ్నించినట్లు తెలిసింది.

ఓ మీడియా ప్రతినిధిపై..

ఇటీవల ఓ ఎలక్ర్టానిక్‌ మీడియా ప్రతినిధిపై కొంత మంది వర్గీయులు దాడి చేయగా వారిపై కేసు నమోదు చేసేందుకు తాత్సారం చేసినట్లుగా సమాచారం. ఇటీ వల తన పోలీ్‌సస్టేషన్‌ కేంద్రంలో ఓజాతర జరగ్గా.. దీన్ని ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించి గొడవ చేయడంతో ఆటీవీ రిపోర్టర్‌ వీడియో చిత్రీకరించారు. దాన్ని మనసులో పెట్టుకున్న ఆయనే కొంత మందితో దాడి చేయించాడని పలు విమర్శలు న్నాయి. ఆ దాడి చేసినవారిని కావాలనే కనిపెట్టలేదనే సమాచారం. బీరు సీసాలతో దాడి చేసిన సమీపంలో సీసీ కెమెరాలున్నా కూడా కావాలని వాటిని పరిశీలించలేదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.

డాబాలు మూసివేసేలా..

తన పోలీస్‌ స్టేషన్‌ కేంద్రానికి బస్టాండు సమీపంలో ఉన్న డాబాల్లో తనకు చెందిన వారి డాబా ఉంది. వీళ్ల వ్యాపారం బాగా జరిగేందుకు ఇతర డాబాలను ఏ కారణాలు లేకుండానే మూసివేసేలా చేస్తున్నట్లు కూడా విమర్శలున్నాయి. ఆ డాబాకు చెందిన వ్యక్తినే తన బినామీగా మార్చుకున్నట్లుగా సమాచారం. తన సొంత ఊరిలో చేపట్టిన ఇంటి నిర్మాణం కోసం పలువురు వ్యాపారుల నుంచి సిమెంటు, ఇతర ఇంటి నిర్మాణ సామగ్రిని తరలించినట్లుగా తెలిసింది. గతంలో ఈయన ఆదోనిలో పని చేసే సమయంలో కూడా పలు విమర్శలు వచ్చాయి.

ఇసుకను తరలించేందుకు కూడా..

తెలంగాణ రాష్ట్రం గద్వాల జిల్లా గట్టు మండలానికి చెందిన ఆంజనేయ అనే వ్యక్తి నుంచి రూ.3లక్షలు దోచుకెళ్లిన సంఘటనలో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా న్యాయం జరగలేదనే విమర్శలున్నాయి. ఓముఠాకు చెందిన వారితో కూడా ఎస్‌ఐకు సంబంధాలు ఉన్నట్లుగా సమాచారం. తన పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఉన్న నది నుంచి భారీఎత్తున ఇసుకను తరలించేందుకు పర్మిషన్‌ ఇచ్చినట్లుగా సమాచారం. వారి నుంచి పెద్ద ఎత్తున వసూలు చేసి జిల్లా పోలీస్‌ కార్యాలయంలో పని చేసే ఓ ప్రముఖ అధికారికి నెల నెలా ముడుపులు ఇస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.

సీఐది ఓ దారి.. ఈయనది మరో..

ఈ ఎస్‌ఐ ‘నేను ఎవరి మాట వినను’ అను ధోరణిలో ప్రవర్తిస్తుండటంతో ఉన్నతాధికారులు కూడా ఏమీ చేయలేని స్థితి. ఈ స్టేషన్‌ పరిధిలో ఉన్న సర్కిల్‌లో సీఐకి చెప్పకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కేసులు పెట్టినా, ఎవరిని రిమాండ్‌కు పంపినా తన దృష్టికి తీసుకురాక పోవడంతో మొదట కొంత చివాట్లు పెట్టిన సీఐ ఆ తర్వాత చేసేదేమీలేక వదిలేశాడు. డీఎస్పీ, ఆ పైస్థాయి అధికారి అయినా ఆ వివాద ఎస్‌ఐ లెక్కలేని విధంగా ప్రవర్తిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఉన్నతాఽధికారులు కూడా..

జిల్లా బాస్‌ కూడా పలుసార్లు టెలి కాన్ఫరెన్స్‌లో చివాట్లు పెట్టినా కూడా నాకేంటి.. రాజకీయ అండదండలు ఉన్నాయంటూ లెక్కలేనితనంతో ఉన్న వ్యవహారశైలిపై పోలీసు ఉన్నతాధికారులు గుర్రుగా ఉన్నట్లు సమాచారం. తన స్టేషన్‌ పరిధిలో ఉన్న ఓ గ్రామంలో ఓ ఎస్‌ఐ తండ్రిపై కూడా చేయి చేసుకున్నట్లు సమాచారం. పక్కపక్కనే ఉన్న ఇళ్లలో చిన్న సమస్యను పెద్దదిగా చేసి సామరస్య పరిష్కారించాల్సింది పోయి.. ఆఎస్‌ఐ తండ్రినే టార్గెట్‌ చేయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ ఎస్‌ఐ కూడా ఈయనకు సీనియర్‌ బ్యాచే.

నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం

ఎస్‌ఐపై ఆరోపణలు మా దృష్టికొచ్చాయి. ఆయనకు చార్జీ మోమో జారీచేసి వివరణ అడిగాం. ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాం. నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం

విక్రాంత్‌ పాటిల్‌, ఎస్పీ, కర్నూలు

Updated Date - Nov 15 , 2026 | 11:54 PM