ఉత్కంఠ..!
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:21 PM
ఉత్కంఠ..!
గెలుపుపై ప్రధాన పార్టీల ధీమా
గెలిచేదెవరు? ఓడేదెవరు?
ఆదోనిలో జనసేన రెబల్ నష్టమెంత?
చూపంతా ఫలితాలవైపే
నేడు పుర ఓట్ల లెక్కింపు
కర్నూలు, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఓటరు తీర్పు ఎటువైపు..? గెలుపు ముంగిట నిలచేదెవరు..? ఓటమి చవిచూసేదెవరు..? ఆదివారం జరిగిన పోలింగ్‌లో ఓటరు తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో భద్రంగా ఉంది. రాజకీయ పార్టీలు, విశ్లేషకులు, బరిలో తలపడిన అభ్యర్థులు, వారి వర్గీయుల్లో గెలుపు, ఓటములపై లెక్కలు మొదలయ్యాయి. వార్డులు, కాలనీల వారీగా నమోదైన పోలింగ్ సరళిని అంచనా వేస్తూ గెలుపుపై ఎవరికి వారే ధీమాగా ఉన్నారు. అయితే కర్నూలు నగరం, ఆదోని మున్సిపాలిటీల్లో పోలింగ్ శాతం తగ్గడం ఎవరికి లాభం చేకూరుస్తుంది..? ఎవరికి నష్టం కలిగిస్తుంది..? ఏ వార్డులో ఏ పార్టీకి అధిక్యం లభిస్తుంది..? ఆదోనిలో జనసేన రెబల్ అభ్యర్థి ప్రభావం ఎవరికి ప్రతికూలంగా మారుతుంది..? నగర, పట్టణ రాజకీయాల్లో రకరకాల విశ్లేషణలు.. ఇంతకు మించిన అంచనాలు తీవ్ర ఉత్కంఠకు దారి తీస్తున్నాయి. నగర, పట్టణ ప్రజా తీర్పు ఎవరికి అనుకూలం కానుంది..? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. జిల్లాలో ఎన్నికలు జరిగిన నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో మేయర్, చైర్‌పర్సన్‌లకు పోలైన 4,25,196 ఓట్లు, 187 మంది కార్పొరేటర్, కౌన్సిలర్ అభ్యర్థులకు పోలైన 4,25,196 ఓట్లను మంగళవారం లెక్కించనున్నారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి పర్యవేక్షణలో ఎన్నికల యంత్రాంగం ఓట్ల లెక్కింపు ఏర్పాట్లు పూర్తి చేసింది.
జిల్లాలో కర్నూలు నగరపాలక సంస్థ, ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీలు, గూడూరు నగర పంచాయతీల మేయర్, చైర్‌పర్సన్, 187 వార్డులకు ఆదివారం పోలింగ్ జరిగింది. నాలుగు పట్టణ స్థానిక సంస్థల్లో 7,59,141 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి 780 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పుర ఎన్నికల్లో 4,25,196 ఓటర్లు తమ ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్నారు. కర్నూలు నగరంలో 68 వార్డుల్లో ఓటర్లకు గానూ 2,58,035 మంది ఓటేశారు. ఆదోని మున్సిపాలిటీలో 52 వార్డులు 1,76,676 మంది ఓటర్లకు గానూ 57,365 మంది (42.28 శాతం), ఎమ్మిగనూరు మున్సిపాలిటీలో 44 వార్డుల్లో 84,939 మంది ఓటర్లు ఉంటే.. 57,673 మంది (67.90 శాతం), గూడూరు నగర పంచాయతీలో 23 వార్డుల్లో 17,665 మంది ఓటర్లకు గానూ 14,971 మంది ఓటర్లు (83.73 శాతం) ఓటు వేశారు. ప్రజా తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో, స్ట్రాంగ్ రూంల్లో, మూడంచెల పోలీస్ భద్రత వలయం మధ్య భద్రంగా ఉంది.
ఉదయం 8 గంటలకు లెక్కింపు షురూ
పట్టణ స్థానిక సంస్థల ఓట్ల లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తారు.
తొలి దశలో పోలింగ్ కేంద్రాల వారీగా బ్యాలెట్ పేపర్లను తీసి మేయర్/చైర్మన్, వార్డు సభ్యుల బ్యాలెట్లను వేరు చేస్తారు. వాటిని 25 చొప్పున కట్టకట్టి డ్రమ్ముల్లో వేస్తారు.
రెండో దశలో డ్రమ్ముల నుంచి వెయ్యి బ్యాలెట్ పేపర్లు చొప్పున (40 కట్టలు) తీసుకొని టేబుళ్ల వారీగా అభ్యర్థులను వర్గీకరించి వివరంగా లెక్కిస్తారు. ఇలా రౌండ్ల వారీగా ప్రక్రియ జరుగుతుంది.
బ్యాలెట్ పేపర్లు తిరస్కరించాల్సి వస్తే అందుకు గల కారణాలు ఏజెంట్లకు తెలపాలి. వాటిపై అభ్యంతరాలు ఉంటే 15 నిమిషాల్లోపు రాతపూర్వకంగా దరఖాస్తులు చేయాలి. వాటిపై ఆర్వో నిర్ణయమే అంతిమం. ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత ఫలితాలు ప్రకటించాక సంబంధిత షీట్‌పై ఆర్వో సంతకం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
పటిష్టమైన పోలీస్ భద్రత, సీసీటీవీ నిఘా, వెబ్‌కాస్టింగ్ మధ్య ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు.
అభ్యర్థుల్లో ఆందోళన
మేయర్/చైర్మన్, కార్పోరేటర్/కౌన్సిలర్ అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. అభ్యర్థులు, వారికి మద్దతుగా నిలిచిన ఆయా పార్టీల నాయకుల్లో ఆందోళన నెలకొంది. కర్నూలు నరగంలో భారీగా పోలింగ్ తగ్గింది. ముఖ్యంగా మేధావివర్గంగా భావించే విద్యావంతులు, ఉద్యోగులు ఉండే కాలనీల్లో సగం కంటే తక్కువ పోలింగ్ నమోదు కావడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఇదే క్రమంలో దినసరి కూలీలు, మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు నివాసం ఉండే కాలనీల్లో 50 శాతానికిపైగా పోలింగ్ నమోదు కావడంపై ఓటరు ఎటువైపు మొగ్గు చూపాడన్నది అంతు చిక్కడం లేదు. పోలింగ్ శాతం తగ్గడం వల్ల తమకు అనుకూలిస్తుందని విజయం మాదే అంటూ ప్రతిపక్ష వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు. అయితే.. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై సహజంగా కొంత వ్యతిరేకత ఉంటుంది. పోలింగ్ తగ్గడం వల్ల ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు రాకపోవడంతో అధికార కూటమికి అనుకూలిస్తుందని టీడీపీ నేతలు అత్యంత ధీమాగా ఉన్నారు. ఇక ఆదోనిలో పోలింగ్ తగ్గడమే కాదు.. కూటమికి చెందిన జనసేన ఇన్‌చార్జి మల్లప్ప భార్య రెబల్‌గా స్వతంత్ర అభ్యర్థిగా బరిలో దిగారు. ఆయన కూటమి ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలుస్తుందని ఆ పార్టీ నాయకులు అంచనాలు వేస్తున్నారు. అయితే.. ఇక్కడ టీడీపీ గెలుపునకు ఏమాత్రం డోకా లేదని, కూటమి నాయకులు ధీమాగా ఉన్నారు. ఆదోనిలో టీడీపీ, వైసీపీ గెలుపోటములపై భారీగా బెట్టింగ్‌లు పెట్టడం కొసమెరుపు. గూడూరులో కూటమి పార్టీల మధ్య సమన్వయం లేకపోవడంతో కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎమ్మిగనూరులో మాత్రం టీడీపీ గెలుపుపై అందరిలో ఽధీమా వ్యక్తం అవుతోంది.
పట్టణ స్థానిక సంస్థల వారిగా లెక్కించాల్సి ఓట్ల వివరాలు
నగర/పురపాలికలు లెక్కింపు కేంద్రాలు లెక్కించే ఓట్లు సిబ్బంది టేబుళ్ల రౌండ్లు
కర్నూలు అథెనా స్కూల్ 2,58,035 1.000 73/72 4-5
ఎమ్మిగనూరు నవోదయ పాఠశాల 56,673 300 44 1-2
ఆదోని ఏఏఎస్ కాలేజీ 94,687 416 104 4
గూడూరు ఇండోర్ స్టేడీయం 14,791 60 10 4-6