ఏపీటీడీసీ చైర్మన్ ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Aug 07 , 2026 | 11:50 PM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ యాదవ్ శుక్రవారం ఉమ్మడి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
కర్నూలు కల్చరల్/ ఓర్వకల్లు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి) : ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ యాదవ్ శుక్రవారం ఉమ్మడి జిల్లాలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాక్ గార్డెన్స్, బెలూం గుహలను సందర్శించి, అక్కడ నిర్వహణ, పారిశుధ్యం, భద్రత, మౌలిక సదుపాయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ముందుగా కర్నూలు డివిజన్‌లోని రాక్ గార్డెన్స్‌ను సందర్శించిన చైర్మన్ రెస్టారెంట్‌లో ఆహార నాణ్యత, పరిశుభ్రత, పరిశుభ్రత, అతిథులుకు అందిస్తున్న సేవలను స్వయంగా పరిశీలించారు. అనంతరం యూనిట్‌లో ప్రతి వాష్‌రూమ్‌ను వ్యక్తిగతంగా తనిఖీ చేసి, పరిశుభ్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం, అలసత్వం, రాజీకి తావులేకుండా అత్యున్నత ప్రమాణాలు పాటించాలని సిబ్బందికి ఆదేశించారు. బెలూం గుహల పర్యటన సందర్భంగా చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ యాదవ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి జనార్దనరెడ్డితో ఫోన్‌లో మాట్లాడి, బెలూం గుహల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణ, మౌలిక సదుపాయాల విస్తరణ, పర్యాటక ఆకర్షణ పెంపు, సందర్శకులకు మరింత మెరుగైన సౌకర్యాల కల్పన తదితర అంశాలపై చర్చించారు.