తుంగభద్రకు వరద ఉధృతి
ABN , Publish Date - Jul 09 , 2026 | 11:57 PM
ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది.
హాలహర్వి, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ఎగువన కురుస్తున్న వర్షాలకు తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పోటెత్తింది. మొన్నటి వరకు ఇన్‌ఫ్లో లేక ఆందోళన చెందుతున్న రైతులకు వరద ప్రవాహం రోజురోజుకూ పెరగడంతో ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. ఎగువ ప్రాంతాలైన శివమొగ్గ, హవేరి, హరిహర, మలేనాడు, ఆగుంబే తదితర ప్రాంతాల్లో గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురవడంతో తుంగ, భద్ర ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండిపోయాయి. ఆ రెండు జలాశయాలు గరిష్ఠ మట్టానికి వరద ప్రభావం చేరిపోవడంతో అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీరు వదిలారు. దిగువ ప్రాంతాల్లో ఉన్న తుంగభద్ర జలాశయానికి గురువారం 31,456 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతుండడంతో జలాశయం జలకళ సంతరించుకుంది. గత మూడు రోజుల క్రితం 9 టీఎంసీలున్న జలాశయం 13.668 టీఎంసీలకు చేరింది. ఇలాగే రోజురోజుకూ వరద పెరిగితే నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని తుంగభద్ర బోర్డు నీటి విడుదల నివేదిక తయారు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఎల్‌నినో ప్రభావంతో తొలకరి వర్షాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో తుంగభద్ర జలాశయానికి గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని అనుకుంటున్న తరుణంలో ఈ వరద కాస్త ఊరటనిచ్చింది.