మద్దతు ధర ఇవ్వాల్సిందే
ABN , Publish Date - May 11 , 2026 | 11:41 PM
పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే.. అని మండలంలోని మాసపేట గ్రామ సమీపంలోని పొగాకు కంపెనీ గోడౌన్ దగ్గర రైతులు సోమవారం ఆందోళనకు దిగారు.
పొగాకు రైతుల డిమాండ్
పురుగు మందు డబ్బాలతో నిరసన
మిడుతూరు, మే 11 (ఆంధ్రజ్యోతి) : పొగాకుకు గిట్టుబాటు ధర ఇవ్వాల్సిందే.. అని మండలంలోని మాసపేట గ్రామ సమీపంలోని పొగాకు కంపెనీ గోడౌన్ దగ్గర రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. నాణ్యమైన పొగాకుకు మద్దతు ధర రూ.16 వేలు వుండగా తాము తెచ్చిన నాణ్యమైన పొగాకుకు రూ.9 వేలు మాత్రమే ఇవ్వడం అన్యాయమని అన్నారు. కొనుగోలు కేంద్రం యాజమాన్యం తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. పంట చేతికి వచ్చి మూడు నెలలు కావస్తున్నా తమ నాణ్యమైన పొగాకుకు గిట్టుబాటు ధర అందడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు సాగుకు ఎకరానికి రూ.60 వేలు ఖర్చు కాగా కంపెనీ ఇచ్చేది రూ.30 వేలు కూడా ఇవ్వడం లేదని రైతులు ఆరోపించారు. అప్పులు చేసి పంటను పండిస్తే పెట్టుబడి కూడా అందక పోతే తమకు ఆత్మహత్యలే శరణ్యమని పురుగు మందుల డబ్బాలతో రైతులు నిరసన చేశారు. పొగాకు కంపెనీ వారు తమకు మద్దతు ధర కల్పించి ఆదుకోవాలని డిమాండు చేశారు.