Share News

అరటికి ఊతం

ABN , Publish Date - Jun 22 , 2026 | 12:35 AM

జిల్లాలో అరటి సాగు విస్తీర్ణం ఈ ఏడాది మరింత పెరిగింది. అరటిపై అన్నదాతలకు ప్రతి ఏటా క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా అరటి సాగులో లాభాలు గడిస్తున్న అన్నదాతలు క్రమంగా సాగు విస్తీర్ణం పెంచుతున్నారు.

అరటికి ఊతం
రైతులు విస్తారంగా సాగు చేసిన అరటి

డ్రిప్‌ సిస్టం, సూక్ష్మ సేద్యానికి రాయితీ

అరటి సాగుపై అన్నదాతల ఆసక్తి

ఈ ఏడాది మరింత పెరిగిన సాగు విస్తీర్ణం

జిల్లాలో 14 వేల ఎకరాల్లో అరటి

కొలిమిగుండ్ల, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో అరటి సాగు విస్తీర్ణం ఈ ఏడాది మరింత పెరిగింది. అరటిపై అన్నదాతలకు ప్రతి ఏటా క్రమంగా ఆసక్తి పెరుగుతోంది. గత కొన్నేళ్లుగా అరటి సాగులో లాభాలు గడిస్తున్న అన్నదాతలు క్రమంగా సాగు విస్తీర్ణం పెంచుతున్నారు. పెట్టుబడి అధికంగా ఉన్నా, డ్రిప్‌ సిస్టం ద్వారా తక్కువ నీటి వనరుల వినియోగం, శారీరక శ్రమ తక్కువగా ఉన్న అరటి సాగుపైనే రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అప్పుడప్పుడు ధర పతనంతో నష్టాలు కలుగుతున్నా, తిరిగి మరో కాపులో లాభాలు గడిస్తుండటంతో అరటి సాగు విస్తీర్ణం పెరుగుతూ వస్తోంది. ఒకప్పుడు కొలిమిగుండ్ల మండలంలో కేవలం మదనంతపురం గ్రామానికే పరిమితమైన అరటి సాగు క్రమంగా ఇతర గ్రామాలకు విస్తరిస్తోంది. మండలంలోని అబ్దులాపురం, కోరుమానుపల్లె, కొలిమిగుండ్ల గ్రామాల్లో ఈఏడాది అరటి విస్తీర్ణం పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది అరటి సాగు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది జిల్లాలో 10వేల ఎకరాల్లో అరటి సాగు చేయగా, ఈఏడాది 14వేల ఎకరాల్లో ఇప్పటికే అరటి సాగు చేసినట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంటున్నారు.

అరటి రైతులకు ప్రభుత్వం చేయూత

అరటి రైతులకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక చేయూతను అందిస్తోంది. గత వైసీపీ ఐదేళ్ల పాలనలో సబ్సిడీ డ్రిప్‌ సిస్టం విధానం అటకెక్కించారు. దీంతో రైతులు హార్టికల్చర్‌ సాగులో అసౌకర్యానికి గురయ్యారు. కూటమి ప్రభుత్వం రాగానే సబ్పిడీపై డ్రిప్‌ సిస్టం విధానం, సూక్ష్మ సేద్యం, ఉద్యానవన పంటల సాగు వంటి పథకాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించింది. ఉద్యానవన పంటలకు 90 శాతం సబ్సిడీతో డ్రిప్‌ ఇరిగేషన్‌ మెటీరియల్‌ను రైతులకు అందజేస్తున్నారు. మరోవైపు ఫ్రూట్‌ కేర్‌ విధానంతో రైతులకు అదనపు ఆదాయం లభిస్తోంది. దీని కోసం ప్రభుత్వం అరటి గెలలకు తొడిగే కవర్లను సబ్సిడీ కింద పంపిణీ చేస్తోంది. అరటి రైతులు గ్రామ రైతు సేవా కేంద్రంలో సంప్రదించి, ప్రభుత్వ పథకాలను పొందవచ్చు. ఫ్రూట్‌ కేర్‌ విధానంతో పండ్లు నాణ్యత పెరిగి, దిగుబడి పెరగడంతో పాటు, నాణ్యతగా ఉండటం వలన అదనపు ధర లభిస్తుందని అధికారులు సూచిస్తున్నారు.

సబ్సిడీని సద్వినియోగం చేసుకోండి

అరటి రైతులు ప్రభుత్వం అందించే సబ్సిడీ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి. డ్రిప్‌ ఇరిగేషన్‌తో పాటు, మొక్కల ఎంపిక, ఫ్రూట్‌ కేర్‌ విధానంపై ఉద్యానవన శాఖ సలహాలు పాటించాలి. - శ్రీధర్‌, ఉద్యానవన శాఖ అధికారి

Updated Date - Jun 22 , 2026 | 12:35 AM