సూర్యదేవా.. పాహిమాం..!
ABN , Publish Date - Jan 26 , 2026 | 12:06 AM
ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి.
కన్నుల పండువగా రథసప్తమి వేడుకలు
సూర్యనారాయణ స్వామి ఆలయంలో రద్దీ
హాజరైన మైసూరు దత్త పీఠాధిపతి శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ
కర్నూలు కల్చరల్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆదివారం రథసప్తమి వేడుకలు వైభవంగా సాగాయి. కర్నూలు నగరంలోని గుత్తి రోడ్‌లో ఉన్న సూర్యనారాయణ స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. సప్తమ వార్షికోత్సవాల సందర్భంగా మూడు రోజులుగా ఆలయంలో ప్రత్యేక పూజాది కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆదివారం ఆలయానికి మైసూరు దత్తపీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామీజీ, శ్రీదత్త విజయానంద తీర్థ స్వామీజీలు విచ్చేశారు. వారి పర్యవేక్షణలో 2,106 భక్తులతో సామూహిక సంపూర్ణ భగవద్గీత పారాయణాలు కొనసాగాయి. సూర్యభగవానుడికి ఉదయం నుంచి రాత్రి దాకా ప్రత్యేక పూజా కైంకర్యాలు కొనసాగాయి. ఉదయం 9 గంటలకు శ్రీచక్ర పూజ చేపట్టారు. ఉదయం 11 గంటలకు శ్రీగణపతి సచ్చిదానంద స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణం చేశారు. వేద పండితుడు సుబ్రహ్మణ్యం శర్మ పర్యవేక్షణలో అర్చక స్వాములు సూర్యభగవానుడికి ఉదయం 10 గంటలకు అరుణ హోమము, సూర్య పంచాతన హోమము చేపట్టి మహా పూర్ణాహుతి అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. నగరంలోని సూర్య దేవాలయంలో రాయలసీమలోనే అతిపెద్ద ఏకైక సూర్యదేవాలయం కావడంతో అటు తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలతోపాటూ, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది.
భారీగా క్యూ
ఆలయం నుంచి కిలోమీటరుకు పైగా క్యూలైన్లలో భక్తులు వేచి ఉండి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ వేడుకల్లో మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్, టీజీ రాజ్యలక్ష్మి దంపతులు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, విజయ మనోహరి దంపతులు దర్శించుకున్నారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు టీఎస్ రామకృష్ణ బృందం ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.
నేడు కల్యాణోత్సవం
సోమవారం ఉదయం 9 గంటలకు ఛాయ, ఉష సమేత సూర్యనారాయణ స్వామి వారి కల్యాణోత్స వాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం మహా మంగళహారతి, అన్నప్రసాదం వితరణ తదితర కార్యక్రమాలు ఉంటాయన్నారు.