Share News

ఉన్నత లక్ష్యానికి విజయం తొలి అడుగు

ABN , Publish Date - Jun 05 , 2026 | 12:01 AM

ఒక విజయం వద్దే ఆగిపోకుండా, దానిని మరిన్ని విజయాలకు పునాదిగా మలుచుకొని ఉన్నత లక్ష్యాలకు తొలి అడుగుగా ముందుకు సాగాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు.

ఉన్నత లక్ష్యానికి విజయం తొలి అడుగు
ప్రతిభ చూపిన విద్యార్థులతో కలెక్టర్‌

కలెక్టర్‌ రాజకుమారి

నంద్యాల నూనెపల్లి, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి) : ఒక విజయం వద్దే ఆగిపోకుండా, దానిని మరిన్ని విజయాలకు పునాదిగా మలుచుకొని ఉన్నత లక్ష్యాలకు తొలి అడుగుగా ముందుకు సాగాలని కలెక్టర్‌ రాజకుమారి అన్నారు. గురువారం కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాఠశాలలు, కళాశాలల్లో పదో తరగతి, ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, వారి తల్లిదండ్రులను ప్రశంసాపత్రాలు, మెమెంటోలు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. గురుకుల విద్యాసంస్థల్లో చదివి పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 12 మంది, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన 13 మంది విద్యార్థులతో పాటు ఏపీ మోడల్‌ స్కూల్‌, బీసీ వెల్ఫేర్‌ విద్యాసంస్థలకు చెందిన మరో ఐదుగురు విద్యార్థులను సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. జిజ్ఞాసతో ఉన్నత లక్ష్యం దిశగా ముందుకు పోవడానికి ప్రయత్నించాలని అన్నారు.

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

వన్‌ మంత్‌- ఫోర్‌ విజిట్‌ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆళ్లగడ్డ నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి తెలిపారు. గురువారం ఆమె మాట్లాడుతూ.. ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించనున్న ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే భూమా అఖిలప్రియతో కలిసి ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

Updated Date - Jun 05 , 2026 | 12:01 AM