Share News

ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం

ABN , Publish Date - Jul 06 , 2026 | 12:04 AM

నవోదయ విద్యాల యంలో సీటు కోసం కోచింగ్‌ సెంటర్‌లో చేరిన విద్యార్థి ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఒత్తిడి తట్టుకోలేక.. విద్యార్థి ఆత్మహత్యాయత్నం
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నిశాంత్‌

భవనం పైనుంచి దూకిన చిన్నారికి తీవ్రగాయాలు

కర్నూలుకు తరలింపు

ఆందోళనకు దిగిన విద్యార్థి సంఘాలు

ఎమ్మిగనూరు, జూలై 5(ఆంధ్రజ్యోతి): నవోదయ విద్యాల యంలో సీటు కోసం కోచింగ్‌ సెంటర్‌లో చేరిన విద్యార్థి ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈఘటన ఎమ్మిగ నూరు పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలు.. దేవనకొండ మండ లం మాచాపురానికి చెందిన సుధాకర్‌ కుమారుడు నిశాంత్‌. అతడు వయస్సు పదేళ్లు. ఎమ్మిగనూరులోని గుడికల్‌ రోడ్డులో ఉన్న గురు నవోదయ కోచింగ్‌ సెంటర్‌లో శిక్షణ పొందుతున్నాడు. నిశాంత్‌ను నాలుగు రోజుల క్రితం తండ్రి కోచింగ్‌ సెంటర్‌లో చేర్పించాడు. ఆదివారం కుమారుడిని చూసేందుకు తండ్రి అక్కడికి వెళ్లాడు. నిశాంత్‌ను చూసి వెళ్తున్న తండ్రితో నేను ఇంటికి వస్తాను అని మారాం చేశాడు. తండ్రి సున్నితంగా సర్దిచెప్పి ఇక్కడే ఉండాలని ఊరికి బయలుదేరి వెళ్లాడు. కోచింగ్‌ సెంటర్‌లో ఉండటం ఇష్టంలేని ఆ చిన్నారి తండ్రి వెళ్లిన కొద్ది సేపటికే కోచింగ్‌ సెంటర్‌ భవనం పైకి(మూడో అంతస్థు) వెళ్లి అక్కడి నుంచి కిందకు దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.

ఒక్కసారిగా పెద్ద శబ్ధం రావటంతో..

నిశాంత్‌ భవనంపై నుంచి దూకటంతో భవనం ముందు పార్కింగ్‌ చేసిన మోటారు సైకిల్‌పై ఒక్కసారిగా పడటంతో పెద్దశబ్ధం వచ్చింది. వెంటనే స్థానికులు ప్రైవేటు అంబులెన్స్‌లో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బంధువులకు సమాచారమిచ్చారు. వారు ఆస్పత్రికి చేరుకొని పరిస్థితి విషమంగా ఉండటంతో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు.

రోడ్డుపై బైఠాయించి ఆందోళన

విద్యార్థి భవనంపై నుంచి దూకి ఆత్మహాత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు గురు నవో దయ కొచింగ్‌ సెంటర్‌ ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ సంఘటనపై పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. సమాచారం అందుకున్న ఎంఈవో-2 మధుసూదన్‌రాజు కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్థి నిశాంత్‌ ఆత్మహత్యాయత్నం సంఘటనపై విచారణ చేపట్టారు.

Updated Date - Jul 06 , 2026 | 12:04 AM