నిరంకుశ పాలనపై పోరాటాలు
ABN , Publish Date - Jul 26 , 2026 | 11:43 PM
కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిరంతర పోరాటాలు సాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య స్పష్టం చేశారు.
ఆగస్టు 6 నుంచి 15 వరకు నిరసనలు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య
బనగానపల్లె, జూలై 26 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వ నిరంకుశ పాలనపై నిరంతర పోరాటాలు సాగిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య స్పష్టం చేశారు. ఆదివారం బనగానపల్లె పట్టణంలోని మాంటిస్సోరీ పాఠశాలలో సీపీఐ నంద్యాల జిల్లా స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మండల కార్యదర్శి శివయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముందుగా సీనియర్ నాయకుడు ఎర్రగుడి రామన్న, సీపీఐ అగ్రనేత నల్లకన్ను, విశాఖ ప్రమాద బాధితులు, నీట్ పేపర్ లీకేజి వల్ల ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు సంతాపం ప్రకటించారు. అనంతరం గుజ్జల ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆగస్టు నెల 6 నుంచి 15వ తేదీ వరకు ప్రతి గ్రామంలో నిరసనలు చేపడతామన్నారు. 12 ఏళ్లుగా దేశాన్ని పాలిస్తున్న నరేంద్రమోదీ ఒక్క పత్రికా సమావేశం నిర్వహించకుండా నిరంకుశ పాలన సాగిస్తున్నాడన్నారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనలు, పోరాటాలు దేశవ్యాప్తంగా కదిలించాయన్నారు. బీజేపీ హాయంలో ఇప్పటి వరకు 152 సార్లు పోటీ పరీక్షల పేపర్లు లీకేజీ అయ్యాయన్నారు. దేశంలో 1.42 లక్షల మంది రైతులు బీజేపీ పాలనలో ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. మతాల మధ్య బీజేపీ చిచ్చుపెడుతోందని విమర్శించారు. అమరావతి, పోలవరం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఏమీ కనబడడం లేదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజనేయులు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అన్యాయాలను ప్రశ్నించలేని దుస్థితిలో వైసీపీ ఉందన్నారు. మహిళలు, బాలికలపై దాడులు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు రామచంద్రయ్య మాట్లాడుతూ స్వామినాథన్ కమిషన్ సిఫారసు మేరకు రైతులకు రుణమాఫీ చేయాలన్నారు. జిల్లా కార్యదర్శి రంగనాయుడు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు తమ స్వార్థ ప్రయోజనాలకు ప్రాధాన్యత నిస్తూ ప్రజాసమస్యలను గాలికి వదిలేశారన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసేందుకు సిద్దం కావాలన్నారు. ఈ సమావేశంలో పార్టీ సహాయ కార్యదర్శి బాబా ఫకృద్దీన్, రఘురాంమూర్తి, సుంకయ్య, మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, బనగానపల్లె సీపీఐ నాయకులు సుబ్బారెడ్డి, సంజీవులు, శివనాగయ్య, ఎర్రిస్వామి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.