పకడ్బందీగా రీ సర్వే
ABN , Publish Date - May 06 , 2026 | 11:47 PM
రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ సిబ్బందిని ఆదేశించారు.
ఇన్‌చార్జి కలెక్టర్ ఆదేశం
కోడుమూరు రూరల్ మే 6 (ఆంధ్రజ్యోతి): రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని ఇన్‌చార్జి కలెక్టర్ నూరుల్ ఖమర్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం ప్యాలకుర్తి గ్రామంలో రీ సర్వేను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రీ సర్వేను ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అన్నారు. సర్వేకు ముందు రైతులకు సమాచారం అందించాలని సూచించారు. భూమి సరిహద్దుల నిర్ధారణ, రికార్డులు పరిశీలన, రోవర్ యంత్రం పనితీరును స్వయంగా పరిశీలించారు. అలాగే కొలతల విధానం, సాంకేతిక పరికరాల వినియోగం, భూ వివరాల నమోదు ప్రక్రియపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా రైతుల భూమికి హద్దులు ఖచ్చితంగా నమోదు కావాలన్నారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి దశలో పారదర్శకత పాటించాలని తెలిపారు. అనంతరం ఆయన రైతులతో నేరుగా మా ట్లాడుతూ సర్వే ముందు నోటీసులు అందాయా? మీ సందేహాలకు సమాధానం ఇస్తున్నారా? అని ఆరా తీశారు. ప్యాలకుర్తిలో 7157 ఎకరాల భూమి కి 2300 మంది రైతులు ఉన్నట్లు తహసీల్దార్ నాగరాజు ఇన్‌చార్జి కలెక్టర్‌కు వివరించారు. సర్వే సిబ్బంది, వీఆర్వోలు, రైతులు పాల్గొన్నారు.