ప్రాణాలతో చెలగాటమాడితే కఠినచర్యలు
ABN , Publish Date - Mar 04 , 2026 | 10:52 PM
రంగు, తాత్కాలిక రుచి కోసం హానికర పదార్థాలను వాడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్‌రావు హెచ్చరించారు.
ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్‌రావు
ఆదోని, మార్చి 4 (ఆంధ్రజ్యోతి): రంగు, తాత్కాలిక రుచి కోసం హానికర పదార్థాలను వాడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడితే ఫాస్ట్ ఫుడ్ నిర్వాహకులపై చర్యలు తప్పవని ఫుడ్ సేఫ్టీ అధికారి రాజగోపాల్‌రావు హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డులో ఉన్న హనుమాన్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై ఆయన ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. హానికరమైన పదార్థాలను విక్రయిస్తున్న నిర్వాహకులకు హెచ్చరికలు జారీ చేశారు. ఫాస్ట్ ఫుడ్ తయారీలో ప్రభుత్వం నిషేధించిన ’అజంతా కలర్ పౌడర్’, ’టేస్టింగ్ సాల్ట్’ (అజినమోటో) విరివిగా ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సదరు యజమానికి గతంలోనే రెండుసార్లు నోటీసులు ఇచ్చి హెచ్చరించినప్పటికీ మొండిగా అదే పద్ధతిన కొనసాగించడంతో అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడికక్కడే ఆ హానికర రంగులను, తయారైన ఆహార పదార్థాలను అధికారులు ధ్వంసం చేశారు. గోబీ మంచూరియా, చికెన్ పకోడా, నూడిల్స్‌లో రంగులు లేకుం డా ఉండేలా చూసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఆదోని డివిజన్ వినియోగదారుల రక్షణ మండలి అధ్యక్షుడు ఈసాబాషా, ఆహార భద్రతా సిబ్బంది పాల్గొన్నారు.