వీధి కుక్కలతో బెంబేలు
ABN , Publish Date - Sep 06 , 2026 | 12:24 AM
మండలంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. కుక్కలు మందులుగా సంచరిస్తూ పాదచారులతో వాహనదారుల వెంటబడి దాడులు చేస్తున్నాయి.
కొలిమిగుండ్లలో అవస్థలు
నెలకు 30మంది బాధితులు
కళ్లు మూసుకున్న పంచాయతీ అధికారులు
కొలిమిగుండ్ల, సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): మండలంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోంది. కుక్కలు మందులుగా సంచరిస్తూ పాదచారులతో వాహనదారుల వెంటబడి దాడులు చేస్తున్నాయి.
నెలకు 30 మంది బాధితులు
ప్రభుత్వాసుపత్రికి నెలకు 30మంది వరకు బాధితులు చికిత్స చేయించుకునేందుకు వస్తున్నట్లు వైద్యులు తెలుపుతున్నారు. ఆరు నెలల క్రితం అంకిరెడ్డిపల్లె గ్రామంలో కుక్కల దాడిలో ఒకేరోజు 12మంది గాయపడ్డారు. అలాగే రెండు రోజుల క్రితం ఎర్రగుడిలో చిన్న పిల్లాడిపై కుక్కలు దాడిచేసి తీవ్రంగా గాయపరిచాయి.
జంతువులపైనా దాడులు
మీర్జాపురం గ్రామంలో రెండు రోజుల క్రితం మేకల మందపై వీధి కుక్కలు దాడి చేయడంతో రెండు మేకలు మృతి చెందగా, మరికొన్ని గాయపడ్డాయి. ఇలా ప్రతి రోజూ మేకలు, గొర్రెలపై దాడి చేసి చంపుతున్నట్లు కాపరులు అందోళనకు గురవుతున్నారు. గతేడాది నాయినిపల్లె, పెట్నీకోట గ్రామాల్లో కుక్కల దాడిలో వందకు పైగా గొర్రె పిల్లలు మృతి చెందాయి. మనుషులు లేని సమయంలో మేకలు, గొర్రెలపై దాడి చేస్తూ వాటిని చంపుతున్నాయి.
నియంత్రణ గాలికి..
వీధి కుక్కల నియంత్రణను పంచాయతీ అధికారులు గాలికి వేదిలేసినట్లు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆసుపత్రులు, పాఠశాలల వద్ద కుక్కలు తిష్టవేయడంతో రోగులు, విద్యార్థులు హడలిపోతున్నారు. పన్నుల వసూళ్లకు వీధి వీధినా తిరిగే పంచాయతీ అధికారులు సిబ్బంది వీధి కుక్కలను నియంత్రిచడంలో విఫలమైనట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడంతో వీటిని ఎవరూ పట్టించుకోలేదు. అధికారులు, ప్రజాప్రతినిదులు స్పందించి వీధి కుక్కలను తరలించాలని కోరుతున్నారు. వాటి సంతతి విస్తరించుకుండా శస్త్రచికిత్స చేసి, వాటికి వ్యాక్సిన్ వేస్తే సమస్య కొంత మేర పరిష్కారమవుతుందని ప్రజలు కోరుతున్నారు.
ఈ విషయమై ఎంపీడీవో ప్రసాదరెడ్డిని వివరణ కోరగా.. ఇటీవల వీధి కుక్కల సంఖ్య పెరిగినమాట వాస్తవేమనని, ఉన్నతాధికారులను సంప్రదించి, కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటామన్నారు.
ప్రథమ చికిత్స చేయించాలి
కుక్క కరిచిన వెంటనే గాయమైన చోట కొళాయి నీటి కింద సబ్బుతో కడగాలి. పది నిమిషాల పాటు గాయాన్ని శుభ్రం చేయాలి. లైనంత త్వరగా డాక్టరును సంప్రదించి, వారి సలహహా మేరకు యాంటీ రేబిస్ వాక్సిన్, మందులు వాడాలి. గాయంపై పసుపు ఇతర పదార్థాలను రుద్ది, నాటు వైద్యం చేయరాదు. - డాక్టర్ హరిచరణ్‌రెడ్డి, ప్రభుత్వ వైద్యుడు, కొలిమిగుండ్ల.