గాలివాన బీభత్సం
ABN , Publish Date - Apr 30 , 2026 | 12:20 AM
: జిల్లాలో పలు మండలాల్లో భారీగా ఈదురుగాలులు, వర్షం ధాటికి పలు పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. మహానంది, పాణ్యం, శిరువెళ్ల, డోన్ మండలాల్లో అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు పంటనష్టం వాటిల్లింది.
వర్షం, ఈదురు గాలులు
గడివేములలో 33.4 ఎంఎం వర్షపాతం
నంద్యాల ఎడ్యుకేషన్, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో పలు మండలాల్లో భారీగా ఈదురుగాలులు, వర్షం ధాటికి పలు పంటలకు భారీగా నష్టం వాటిల్లింది. మహానంది, పాణ్యం, శిరువెళ్ల, డోన్ మండలాల్లో అరటి, బొప్పాయి, మొక్కజొన్న పంటలకు పంటనష్టం వాటిల్లింది. మహానంది మండలం సుమారు వెయ్యి ఎకరాల్లో అరటి పంట, 60 ఎకరాల్లో బొప్పాయి పంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు ప్రాఽథమిక అంచనా వేశారు. ఈదురు గాలులతో పాటు గడివేముల మండలంలో 33.4ఎంఎం వర్షపాతం నమోదైంది.
భాస్కరాపురంలో పిడుగుపాటు
జూపాడుబంగ్లాలో 24.8 మి.మీ. వర్షపాతం
జూపాడుబంగ్లా, ఏప్రిల్ 29 (ఆంధ్రజ్యోతి): మండలంలోని వివిధ గ్రామాల్లో మంగళవారం రాత్రి ఉరుములు, మెరుపులతో గాలివాన బీభత్సం సృష్టించింది. భాస్కరాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో మిద్దె వెంకటేశ్వర్లు వ్యక్తి ఇంటి ఆవరణలో ఉన్న కొబ్బరిచెట్టుపై పిడుగు పడింది. పొలాలకు మందు పిచికారీ చేసే యంత్రంతో కొబ్బెరిచెట్టుపై ఉన్న మంటలను అదుపు చేశారు. గాలి వానకు మండలమంతా విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం కలిగింది. మండలంలో 24.8 మి.మీ. వర్షపాతం నమోదు అయినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.