పిల్లర్లకు పరిమితం
ABN , Publish Date - Mar 10 , 2026 | 01:09 AM
గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సచివాలయ భవనాలు పూర్తికాక ఉద్యోగులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు తదితర భవనాల పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
గత వైసీపీ హయాంలో ప్రారంభం.. మధ్యలోనే పనులను ఆపేసిన కాంట్రాక్టర్లు
కొలిమిగుండ్ల, మార్చి 9 (ఆంధ్రజ్యోతి) : గత ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన సచివాలయ భవనాలు పూర్తికాక ఉద్యోగులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, హెల్త్ క్లినిక్‌లు తదితర భవనాల పనులు అసంపూర్తిగానే మిగిలిపోయాయి.
వైసీపీ నాయకులే కాంట్రాక్టర్లు
గత ప్రభుత్వ హయాంలో పనులు చేసిన కాంట్రాక్టర్లంతా వైసీపీ నాయకులే కావడంతో వారిని అడిగేవారు లేని విమర్శలు వస్తున్నాయి. మండలంలోని బెలుం గ్రామంలో సచివాలయ భవనం పనులు నాలుగేళ్ల పాటు సాగదీసి, వదిలేశారు. దీంతో అవి దిష్టి బొమ్మలా దర్శనమిస్తోంది. రైతు భరోసా కేంద్రం కూడా పునాదులు దాటలేదు. అంకిరెడ్డిపల్లె, తోళ్లమడుగు, తిమ్మనాయినిపేట, గొర్విమానుపల్లె గ్రామాల్లో సచివాలయ భవనాలు పూర్తికాలేదు. దీంతో ఇటు సచివాలయ ఉద్యోగులు, అటు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొలిమిగుండ్ల మండలంలో 16 గ్రామ సచివాలయ భవనాలు నిర్మించాలన్నది లక్ష్యం కాగా, అనేక గ్రామాల్లో నిర్మాణాలు పూర్తి కాలేదు. నిర్మాణాలు పూర్తయిన భవనాలకు కూడా మౌలిక వసతులు కల్పించకపోవడంతో అవి నిరుపయోగంగా ఉన్నాయన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకుని భవనాల పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
పిల్లర్లకే పరిమితం
చాగలమర్రి: మండలంలోని శెట్టివీడు గ్రామంలో సచివాలయ భవనం పిల్లర్లకే పరిమితమైంది. గత వైసీపీ హయాంలో పనులు ప్రారంభించి, వదిలేశారు. భవనం లేక సచివాలయ ఉద్యోగులు గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే అరకొర సౌకర్యాలతో విధులు నిర్వహిస్తున్నారు. అధికారులు స్పందించి భవన పనులు పూర్తి చేసి సమస్య పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.