Share News

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌

ABN , Publish Date - Jul 01 , 2026 | 12:13 AM

నిత్యం ట్రాఫిక్‌ కష్టాలతో ఇబ్బందులు పడే బనగానపల్లె ప్రజలకు రింగ్‌రోడ్డు నిర్మాణంతో ఊరట కలగనుంది. గత టీడీపీ హయాంలో 2019లో రూ.50కోట్లతో నాటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి రింగ్‌రోడ్డు నిర్మాణపనులను ప్రారంభించారు

ట్రాఫిక్‌ కష్టాలకు చెక్‌
పట్టణ శివారులో నిర్మించిన బీటీ రోడ్డు

మంత్రి బీసీ చొరవతో వేగంగా సాగుతున్న బనగానపల్లె రింగ్‌ రోడ్డు పనులు

బనగానపల్లె, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): నిత్యం ట్రాఫిక్‌ కష్టాలతో ఇబ్బందులు పడే బనగానపల్లె ప్రజలకు రింగ్‌రోడ్డు నిర్మాణంతో ఊరట కలగనుంది. గత టీడీపీ హయాంలో 2019లో రూ.50కోట్లతో నాటి ఎమ్మెల్యే బీసీ జనార్దన్‌రెడ్డి రింగ్‌రోడ్డు నిర్మాణపనులను ప్రారంభించారు. అనంతరం ఎన్నికల కోడ్‌ రావడంతో పనులు ఆగిపోయాయి. అనంతరం అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవంతో పనులు ఆగిపోయాయి. ఇక రింగ్‌రోడ్డు పనులు సాగుతాయా? అని ప్రజలు సందేహించారు.

రింగ్‌ రోడ్డు నిర్మాణం ఇదీ..

రింగ్‌ రోడ్డు 3.5 కిలోమీటర్ల మేర ఉండగా ఇప్పటికే 6 కి.మీ.ల పనులు పూర్తయ్యాయి. అలాగే రాళ్ల కొత్తూరు నుంచి ఆర్‌ఆర్‌ పంక్షన్‌హాల్‌ మీదుగా కైప, అప్పలాపురం, టంగుటూరు మీదుగా గాజుల పల్లె వరకు నేషనల్‌ హైవే పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి. పట్టణ శివారులోని యాగంటిపల్లె ప్రధాన రహదారి నుంచి పాణ్యం రహదారి వరకు నిర్మాణం పూర్తయింది. ఇక భారీ వాహనాలు బనగానపల్లె పట్టణంలోకి వెళ్లకుండా రింగ్‌రోడ్డుపై వెల్లేలా ఆర్‌ఆండ్‌బీసీ అధికారులు పనులు పూర్తి చేస్తున్నారు. దీంతో బనగానపల్లె పట్టణంలో ట్రాఫిక్‌ సమస్య తీరనుంది.

మంత్రి బీసీ చొరవతో వేగం..

తిరిగి 2024లో టీడీపీ ప్రభుత్వం రావడం, బీసీ జనార్దన్‌రెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకోవడంతో పనుల్లో వేగం పెరిగింది. జనవరి 6న పాణ్యం ప్రధాన రహదారిలో పనులు ప్రారంభమయ్యాయి. రూ.50 కోట్లు మంజూరు కావడంతో పనులు వేగవంతంమయ్యాయి. భూములు కోల్పోయిన రైతులకు పరిహారం జమకావడంతో అడ్డంకులు తొలగిపోయాయి. మంత్రి బీసీ చొరవ తీసుకుని పనులు వేగంగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించడంతో త్వరలోనే పూర్తికానున్నాయి. రింగ్‌ నిర్మాణంతో పట్టణవాసులు, వాహనచోదకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పనులు వేగవంతం చేశాం

ఇప్పటికే 6 కిలోమీటర్ల మేర బీటీ రోడ్డు పనులు పూర్తి కావవచ్చాయి. త్వరలో భారీ వాహనాలు, ఇతర వాహనాలు తిరిగేలా ఏర్పాట్లు చేస్తున్నాం. మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు మిగతా 7.5 కి.మీ. పనులు వేగంగా సాగుతున్నాయి. రింగ్‌ రోడ్డు పూర్తయితే ట్రాఫిక్‌ సమస్య తీరుతుంది. - హుసేన్‌, ఆర్‌ఆండ్‌బీ ఏఈ

Updated Date - Jul 01 , 2026 | 12:13 AM