Share News

ఇసుక తవ్వకాలు ఆపండి

ABN , Publish Date - May 26 , 2026 | 11:22 PM

కర్నూలు మండలం తుంగభద్రనదిలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న భూగర్భ జలాలను కలిసికట్టుగా కాపాడుకుందామని కేడీసీసీబీ చైర్మన్‌ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గద్వాల జిల్లా మైనింగ్‌ అధికారులను కోరారు.

ఇసుక తవ్వకాలు ఆపండి
సుంకేసుల డ్యామ్‌పై రైతులతో కలిసి వెళ్తున్న విష్ణు, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి

ఏపీ సరిహద్దుల్లో తరలిస్తే సహించం

కేడీసీసీ చైర్మన్‌ విష్ణు, కోడుమూరు ఎమ్మెల్యే దస్తగిరి

కర్నూలు రూరల్‌, మే 26 (ఆంధ్రజ్యోతి): కర్నూలు మండలం తుంగభద్రనదిలో ఏపీ, తెలంగాణ రాష్ట్ర పరిధిలో ఉన్న భూగర్భ జలాలను కలిసికట్టుగా కాపాడుకుందామని కేడీసీసీబీ చైర్మన్‌ ఎదురూరు విష్ణువర్దన్‌రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి గద్వాల జిల్లా మైనింగ్‌ అధికారులను కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉచిత ఇసుక అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గద్వాల జిల్లా రాజోలి మండలం పరిధిలో ఉన్న పరిసర గ్రామాల నుంచి ట్రాక్టర్ల ద్వారా తుంగభద్రలో ఇసుకను తరలించుకుపోతున్నారు. ఈ విషయంపై మంగళవారం కర్నూలు ఆర్డీవో కిడారి సందీ్‌పకుమార్‌, మైనింగ్‌ అధికారులు, కర్నూలు మండల రూరల్‌ తహసీల్దార్‌ వెంకటరమే్‌షబాబుతో కలిసి కేడీసీసీబీ చైర్మెన్‌ విష్ణువర్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి తూర్పు గార్లపాడు నది పాయింట్‌ వద్దకు వెళ్లారు. అనంతరం గద్వాల జిల్లా మైనింగ్‌ డిప్యూటీ డైరెక్టర్‌, సర్వేయర్‌ ఏడీ, ఎస్‌ఐలతో కలిసి సమీక్షించారు. పర్యావరణ సమతుల్యతను దెబ్బతినే విధంగా చేయవద్దని అక్కడి అధికారులకు సూచించారు. ఇసుక ఉచితమని, రాజోలి, కొర్విపాడు, తూర్పుగార్లపాడు గ్రామస్థులు కర్నూలు జిల్లా సరిహద్దులోకి వచ్చి ఇసుకను తరలిస్తే చూస్తు ఊరుకునేది లేదని విష్ణు, ఎమ్మెల్యే దస్తగిరిలు ఆగ్రహం వ్యక్తం చేశారు. విచ్చలవిడిగా ఇసుకను తరలించడంతో కర్నూలు ప్రజలకు జీవనదిగా పేరుఉన్న దేవమ్మమడుగు, రాజుల మడుగు జలాలు ఇంకిపోయే ప్రమాదం ఉందన్నారు. కర్నూలు రూరల్‌ మండలంలోని ఆర్‌.కొంతలపాడు, ఎదురూరు, సుంకేసుల, దుద్యాల గ్రామాల పరిధిలో ఇప్పటికే తుంగభద్ర నదిలో రీసర్వే జరిగిందని, సరిహద్దులకు సంబందించిన నివేదికను తహసీల్దార్‌ గద్వాల జిల్లా మైనింగ్‌శాఖ అధికారులకు అందజేశారు. అనంతరం విష్ణువర్దన్‌రెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి రైతులతో కలిసి సుంకేసుల డ్యామ్‌లో నీటిమట్టాన్ని పరిశీలించారు. వీరివెంట కర్నూలు తాలుకా సీఐ తేజోమూర్తి, సిబ్బంది ఉన్నారు.

Updated Date - May 26 , 2026 | 11:22 PM