నకిలీ మందుల అమ్మకాన్ని నివారించాలి
ABN , Publish Date - May 21 , 2026 | 12:05 AM
అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం చేపట్టిన దేశ వ్యాప్త మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. సమ్మెలో భాగంగా నగరంలోని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెల్ల చొక్కాలు, టీషర్టులు ధరించి బుధవారం అవుట్‌డోర్ స్టేడియం వద్ద ర్యాలీ చేపట్టారు.
కర్నూలు హాస్పిటల్, మే 20 (ఆంధ్రజ్యోతి): అఖిల భారత కెమిస్టుల సమాఖ్య పిలుపు మేరకు బుధవారం చేపట్టిన దేశ వ్యాప్త మెడికల్ షాపుల బంద్ విజయవంతమైంది. సమ్మెలో భాగంగా నగరంలోని జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెల్ల చొక్కాలు, టీషర్టులు ధరించి బుధవారం అవుట్‌డోర్ స్టేడియం వద్ద ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ స్టేడియం నుంచి చిల్డ్రన్స్ పార్కు మీదుగా ఎస్టీబీసీ కాలేజీ గ్రౌండు వరకు కొనసాగింది. జిల్లా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వై. పుల్లయ్య, కార్యదర్శి జి. శ్రీధర్, జిల్లా కోశాధికారి, సిటీ అధ్యక్షుడు జి. విజయకుమార్ మాట్లాడుతూ తక్షణమే నకిలీ మందుల అమ్మకాలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
జిల్లా వ్యాప్తంగా మూతపడ్డ షాపులు
దేశ వ్యాప్త సమ్మెలో భాగంగా ఉమ్మడి జిల్లాలోని 3వేల మెడికల్ షాపులు మూతపడ్డాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మందుల కొరత లేకుండా జిల్లా ఔషద నియంత్రణ శాఖ ఏడీ హరిహరతేజ, కొన్ని చోట్ల దుకాణాలను తెరిచి ఉండేలా చర్యలు తీసుకోవడంతో అత్యవసర మందులకు ఇబ్బందులు లేకుండా చేశామని ఏడీ పేర్కొన్నారు. అయినప్పటికీ మెడికల్ షాపులు మూతపడటంతో రోగులు ఇబ్బందులు పడ్డారు.
స్కిన్ మందుల కొరత ఉంది
చర్మ వ్యాధుల ఓపీకి ఉదయం వచ్చి తమ బంధువుకు చూపించాను. వైద్యులు నాలుగు రకాల మందులు రాస్తే ఓపీ నెంబర్.13లో రెండు రకాల మాత్రలు ఇచ్చి, మిగిలినవి బయట తెచ్చుకోమన్నారు. బయట మెడికల్ షాపులు మూత పడటంతో ఇబ్బందిపడ్డాను. - మహబూబ్ బాషా, కర్నూలు