అధునాతన క్యూ కాంప్లెక్స్
ABN , Publish Date - Jun 22 , 2026 | 12:24 AM
శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించంలో భాగంగా అధునాతన సౌకర్యాలు కలిగిన క్యూ కాంప్లెక్స్‌ను త్వరలో నిర్మిస్తామని ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు వెల్లడించారు.
శ్రీశైల క్షేత్రంలో శాశ్వత సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం
ట్రస్ట్ బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు
శ్రీశైలం, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తులకు మెరుగైన వసతులు కల్పించంలో భాగంగా అధునాతన సౌకర్యాలు కలిగిన క్యూ కాంప్లెక్స్‌ను త్వరలో నిర్మిస్తామని ట్రస్ట్‌బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్‌నాయుడు వెల్లడించారు. ఆదివారం దేవస్థానం పరిపాలనా భవనంలో 8వ ధర్మకర్తల మండలి సమావేశం నిర్వహించారు. ఈవో శ్రీనివాసరావుతోపాటు ధర్మకర్తల మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, అధికారులు హాజరైన సమావేశంలో 45 అంశాలను చర్చించగా 34 అంశాలను మాత్రమే ఆమోదించి 7 అంశాలను వాయిదా వేస్తూ 4 అంశాలను తిరస్కరించినట్లు చైర్మన్ తెలిపారు. క్షేత్ర పరిధిలో భక్తులకు కల్పించే సౌకర్యాలు శాశ్వతంగా వినియోగంలో ఉండే విధంగా ప్రణాళికలను రూపొందించి వాటిని అమలు చేసేందుకే ట్రస్ట్ బోర్డు అహర్నిశలు శ్రమిస్తోందని అన్నారు. ప్రధానంగా పిలిగ్రీమ్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికై ప్రణాళికలు చేస్తున్నట్లు చెప్పారు. క్షేత్ర పరిధిలో అవసరమైన ప్రదేశాలలో హైమాస్ట్ టవర్ లైటింగ్, ఆక్టోగోనల్ ఎలక్ట్రిక్ పోల్స్, రింగ్ బ్రాకెట్స్, ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటు, ఎలక్ట్రికల్ మెటీరియల్, ఉచిత వైద్యశాలలో అవసరమైన సూది మందులు, ల్యాబ్ ఎక్విప్‌మెంట్ టెండర్లు, గణేష్ సదన్, మల్లికార్జున సదన్‌లలో 38 లక్షలతో బంకర్ బెడ్స్, కాటేజీలు డార్మిటరీలలో సివిల్ వర్క్స్ చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.
అక్రమాలకు తావులేదు
దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు జరిగే నిత్య కైంకర్యాలలో వినియో గించే పూజా సామగ్రి, పసుపు కుంకుమలతోపాటు భక్తులకు కల్పించే అన్నప్రసాద ముడి పదార్థాలు, సరుకుల కొనుగోలులో అక్రమాలకు తావివ్వకూడదని ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ అధికారులు సిబ్బందిని సూచించారు. ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు.