ప్రశాంతంగా పది పరీక్షలు ప్రారంభం
ABN , Publish Date - Mar 16 , 2026 | 11:31 PM
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి.
మొదటి రోజు 1,094 మంది విద్యార్థులు గైర్హాజర్
మాల్ ప్రాక్టికల్ కేసు నమోదు నిల్
కర్నూలు ఎడ్యుకేషన్, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): పదో తరగతి పబ్లిక్ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమ య్యాయి. ఉదయం 9.30 నుంచి మధ్యా హ్నం 12.45 గంటల వరకు కొనసాగాయి. 8.30 గంటలకే విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్ష కేంద్రంలోని నోటీసు బోర్డులో తమ హాల్ టికెట్ నెంబర్‌ను, గదిని తెలుసుకున్నారు. పరీక్షల నిర్వాహకులు 8.30 గంటలకే పాఠశాల మెయిన్ గేటు ఎదుట విద్యార్థులను చెకింగ్ చేసి కేంద్రంలోకి పంపారు. కర్నూలు నగర పాలక సంస్థ ఐజీఎం హై స్కూల్‌లోని పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ డా.ఏ. సిరి పర్యవేక్షించారు. అలాగే నగరంలోని అమ్మ హాస్పిటల్ సమీపంలోని శ్రీ చైతన్య పాఠశాల పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర పరిశీలకులు అబ్రహాం, జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. సుధాకర్ పర్యవేక్షించారు. వేసవి ఉష్ణోగ్రతకు తోడు పరీక్షల టెన్షన్‌తో విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని పరీక్ష కేంద్రాలకు సమీపంలోని దూర ప్రాంతాల నుంచి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు మోటారు సైకిల్, ఆటోల్లో ప్రయాణించాల్సి వచ్చింది. కర్నూలు నగరంలో పరీక్ష కేంద్రాలకు చేరుకోవడానికి ఆటో డ్రైవర్లు విద్యార్థుల నుంచి అధిక డబ్బులు వసూలు చేశారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లాలో 555 ఉన్నత పాఠశాలల నుంచి పదో తరగతి రెగ్యులర్ విద్యార్థులు మొదటి రోజు 35,851 మంది ఉన్నారు. ఇందులో 34,809 మంది పరీక్షకు హాజరు కాగా, 1,042 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా 160 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఓపెన్ స్కూల్ పదో తరగతి విద్యార్థులు మొత్తం 702 మంది ఉండగా.. 650 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, 52 మంది గైర్హాజరయ్యారు. మొదటిరోజు ఎలాంటి మాల్ ప్రాక్టీసు కేసులు నమోదు కాలేదు. దీంతో పది పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ప్రశాంత వాతావరణంలో పది పరీక్షలు
జిల్లాలో పదో తరగతి పరీక్షలు విద్యార్థులు ఎటువంటి ఒత్తిళ్లకు లోనుకాకుండా ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని కలెక్టర్ డా.ఏ. సిరి పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల్లో విద్యార్థులకు కల్పించిన వసతులు, పరీక్షల నిర్వహణ తీరును క్షుణ్ణంగా పరిశీలించారు. వేసవి దృష్ట్యా విద్యార్థులకు తాగునీరు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, గదులో వెల్తురు, ప్యాన్లు పని చేసేలా చూడాలని విద్యాశాఖ అధికారులను సూచించారు. ఇన్విజిలేటర్లు తమ విధులను అత్యంత బాధ్యతాయుతంగా నిర్వహించాలని, అనధికార వ్యక్తులు పరీక్ష కేంద్రాల పరీక్ష హాలులోకి రాకుండా చూడాలని కలెక్టర్ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బందిని ఆదేశించారు.