మేమింతే..!
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:54 PM
గత ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ విభాగాధిపతులు సచివాలయాల్లో పనిచేస్తున్న కొంతమంది వార్డు అమ్యూనిటీస్ సెక్రటరీలను అనధికార ఉత్తర్వుల ద్వారా డెలిగేటెడ్ ఏఈలుగా నియమించారు.
గాడి తప్పిన ఇంజనీరింగ్ శాఖ
ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న డెలిగేటెడ్ ఏఈలు
పట్టించుకోని ఉన్నతాధికారులు
గత ప్రభుత్వ హయాంలో ఇంజనీరింగ్ విభాగాధిపతులు సచివాలయాల్లో పనిచేస్తున్న కొంతమంది వార్డు అమ్యూనిటీస్ సెక్రటరీలను అనధికార ఉత్తర్వుల ద్వారా డెలిగేటెడ్ ఏఈలుగా నియమించారు. వారి సేవలను వినియోగించుకుంటున్నారు. అంతా బాగానే ఉన్నప్పటికీ డెలిగేటెడ్ ఏఈలుగా ఉన్న కొందరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మేమింతే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రెగ్యులర్ ఏఈల కంటే డెలిగేటెడ్ ఏఈలు బాగా పని చేస్తున్నప్పటికీ డబ్బు ప్రలోభాలు వారిపై ప్రభావం చూపుతున్నాయన్న ఆరోపణ లున్నాయి.
కర్నూలు న్యూసిటీ, ఏప్రిల్ 25(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థలో ఇంజనీరింగ్ శాఖ పూర్తిగా గాడి తప్పినట్లు కనిపిస్తుంది. ప్రజలకు సరఫరా చేసే తాగునీటిని రిజిడ్యువల్ (అవశేష) క్లోరిన్ స్థాయిల కోసం క్రమం తప్పకుండా పరీక్షించడం అవసరం. దీనికోసం అమ్యూని టీస్ సెక్రటరీ నీటి సరఫరా సమయంలో అందుబాటులో ఉండాలి. వారికి ప్రభుత్వం ఇతర సర్వే పనులు అప్పగించడంలో ఆర్‌సీ టెస్టులు నిలిచిపోయినట్లు తెలుస్తోంది. ఈఎన్‌సీ సమావేశం ఉన్నప్పుడు హడావిడిగా పరీక్షలు నిర్వహిస్తున్నారని, వాటిని సీరియస్‌గా తీసు కోవడం లేదని స్పష్టం కనబడుతోంది. పంప్‌హౌస్‌లో అనేక మంది ఖాళీగా ఉన్నప్పటికి వారికి ఆర్‌సీ పరీక్షలు అప్పగించకుండా అమ్యూనిటీస్ విభాగానికి అదనపు పనులు అప్ప గించినట్లు సమాచారం. ఈఒక్క విషయం సంబంధిత ఎస్‌ఈకి తన శాఖపై ఉన్న నియంత్రణ స్థాయిని స్పష్టంగా తెలియజేస్తుందని వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఎంపిక ఎలా చేశారో?
డిలిగేటేడ్ ఏఈల ఎంపిక ప్రమాణాలేమిటో స్పష్టత లేకుండా పోయింది. ఆ స్థానాల్లో ఉన్న కొందరు అధికారుల ప్రవర్తనపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. కొందరు ఇతరులను వేధించడమే తమ పనిగా భావిస్తున్నట్లుగా కనిపిస్తుంది.
మారని తీరు
ఒక మహిళా డెలిగేటేడ్ ఏఈ డబ్బునే ప్రాధాన్యంగా తీసుకుంటూ విధులు నిర్వహిస్తున్నారు. 22 నుంచి 25 వార్డుల వరకు డెలిగేటెడ్ ఏఈగా పని చేస్తున్న ఓ అమ్యూనిటీస్ సెక్రటరీపై గతంలో అదే వార్డులో పనిచేసే సమయంలో ఓ మహిళా ఉద్యోగికి సం బంధించిన విషయంపై మరో మహిళా ఉద్యోగిని బెదిరించినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన అనంతరం సంబంధిత ఉద్యోగిని తల్లిదండ్రులు ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేసేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. అప్పటి ఇన్‌చార్జి ఎస్‌ఈ జోక్యం చేసుకుని సంబంధిత ఆ ఉద్యోగిని తనకు అనుకూలమైన చోటుకు ట్రాన్స్‌ఫర్ చేసి విషయాన్ని సద్దుమణిగించినట్లు తెలిసింది. ఆ ఘటనలో ఆ డెలిగేటెడ్ ఏఈ, అప్పటి ఇన్‌చార్జి ఎస్‌ఈ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడంతో విషయం బయటకు రాలేదని కొన్నివర్గాలు చెబుతున్నాయి. అతడు ఇతర వార్డులకు బదిలీపై వెళ్లిన తరువాత కూడా తన ప్రవర్తన కొనసాగించినట్లు ఆధారాలు పుష్కలంగా ఉన్నాయి. తన ఉద్యోగానికి పూర్వమే జారీ అయిన పనులకు సంబంధించిన ఫైళ్లను కమిషనర్ లాగిన్‌కు పంపిస్తూ, కాంట్రాక్లర్ల వద్ద నుంచి అనుచితంగా లాభా లు పొందాడు. ఈవిషయాన్ని గమనించిన అప్పటి కమిషనర్ రవీంద్రబాబు ఆయనను పిలిచి మందలిం చినప్పటికీ అదే తరహ ప్రవర్తన కొనసాగించినట్లు తెలిసింది. అతడిని డెలిగేటెడ్ ఏఈ పదవి నుంచి తొలగించారు.
మళ్లీ తనకు అనుకూలమైన..
రవీంద్రబాబు బదిలీపై వెళ్లిన వెంటనే సంబంధిత డెలిగేటెడ్ ఏఈ మళ్లీ తనకు అనుకూలమైన వార్డులను పొందినట్లు సమా చారం. అనంతరం తన కార్యాకలాపాలను కొనసాగించి నట్లు వర్గాలు చెబుతున్నాయి. గత కమిషనర్ తనకు అప్పగించిన వార్డులను తొలగించినప్పటికీ మళ్లీ అదే వ్యక్తికి వార్డులు అప్పగించాలనే ఉద్దేశ్యంతో ఇంజనీరింగ్ విభా గంలోని కొందరు అధికారులు అత్యుత్సాహం చూపినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అంతా నా ఇష్టం..
అమ్యూనిటీస్ సెక్రటరీలకు సంబంధించిన సెలవులు, బదిలీలు, అరియర్స్ బిల్లుల విష యంలో ఓ క్లర్క్ అంతా నా ఇష్టం అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నాడు. ప్రతి పనికి డబ్బు లు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొంతమంది మహిళా సెక్రటరీలు ఇష్టనుసారంగా లీవ్ లెటర్లను తపాలాలో వేసి వెళ్లిపోతున్న ఘటనలున్నాయి. ఇంత జరుగుతున్నా ఎస్‌ఈ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
అదనపు విధులు..
అమ్యూనిటీస్ సెక్రటరీల ఇప్పటికే తక్కువ సంఖ్యల్లో ఉన్నారు. వారిలో కొంత మంది డిప్యుటేషన్‌పై ఇతర శాఖల్లో పనిచే స్తుండటంతో, మిగిలిన వారిపై పని భార మంతా పడుతున్నట్లు సమాచారం. కొత్త కమిషనర్ తమకు ఉన్న అదనపు భారాన్ని అర్థం చేసుకొని 3, 4 సచివాలయాల బాధ్య తలను తొలగిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
విచారణ చేపడతాం
కొత్తగా బాధ్యతలు చేపట్టాను. ఇంకా నా దృష్టికి రాలేదు. ఇంజనీరింగ్ అధికా రులతో సమావేశం ఏర్పాటు చేసుకుని దానిపై లోతుగా విచారణ చేపడతాం. అవినీతి ఆరోపణలుంటే వారిపై చర్యలు తీసుకుంటాం.
చల్లా ఓబులేసు. కమిషనర్, నగరపాలక సంస్థ, కర్నూలు