నిలిచిపోయిన ఎల్లెల్సీ నీరు
ABN , Publish Date - Apr 28 , 2026 | 11:52 PM
తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీటి విడుదల ఆపేసినట్లు తెలుస్తోంది.
గోనెగండ్లకు అరకొరగా 20 క్యూసెక్కుల నీరు
నేడు పూర్తిగా నిలిచిపోనున్న ఎల్లెల్సీ
కళకళ లాడుతున్న నీటి కుంటలు, ఎస్‌ఎస్ ట్యాంకులు
గోనెగండ్ల, ఏప్రిల్ 28(ఆంధ్రజ్యోతి): తుంగభద్ర దిగువ కాలువ నుంచి నీటి విడుదల ఆపేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దిగువ ప్రాంతమైన గోనెగండ్ల సెక్షన్‌కు మంగళవారం కేవలం 20 క్యూసెక్కుల నీరు మాత్రమే చేరింది. బుధవారానికి అది కూడా నిలిచిపోనున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ ఏడాది ఎల్లెల్సీ కింద తాగునీటి సమస్య లేకుండా చూసేందుకు ఇరిగేషన్ అఽధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఏప్రిల్ 1వ తేది నుంచి నెల చివరి వరకు నీరు విడుదలైంది. దీంతో దిగువ ప్రాంత గ్రామాలకు వేసవిలో తాగు నీటి సమస్య చాలా వరకు తీరింది. చాల గ్రామాలలో చెరువులు, కుంటలు, ఎస్‌ఎస్ ట్యాంకులను ఆయా గ్రామ పంచాయతీ అధికారులు ఎల్లెల్సీ నీటితో నింపుకున్నారు. ప్రస్తుతం విడుదల అవుతున్న 20 క్యూసెక్కుల నీరు గోనెగండ్ల కోడుమూరు, కాలువ వెంట వెళు తూ భూమిలో ఇంకిపోతూ బావులు, బోర్లకు ఎంతో ఉపయో గపడుతున్నాయి. మొదట్లో 15 రోజులు నీరు విడుదల చేస్తారని అనుకున్నారు. అయితే ఎండలు తీవ్రంగా ఉండటంతో దిగువ ప్రాంతాలలో తాగునీటి సమస్య రాకుండా ఉండేందుకు ఎల్లెల్సీ అధికారులు ఈ నెల చివరి వరకు నీరు విడుదల చేశారు. ఆదోని, ఎమ్మిగనూరు, కోడుమూరు, గోనెగండ్ల ప్రాంతా లలోని ఎస్‌ఎస్ ట్యాంకులు చెరువులు, నీటి కుంటలను అధికారులు నింపివేశారు. మండలంలోని పలు కుంటలు, చెరువులు ఎల్లెల్సీ నీటితో కళకళలాడుతున్నాయి.