Share News

శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద

ABN , Publish Date - Jul 30 , 2026 | 11:59 PM

రాయలసీమ కరువు రైతులకు తీపి కబురు ఇది. శ్రీశైలం జాలశయానికి భారీగా వరద చేరుతుంది. గురువారం రాత్రి పది గంటల సమయంలో లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు చేసుకుంది.

శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద
శ్రీశైలం రిజర్వాయర్‌లో పెరుగుతున్న నీటిమట్టం

శ్రీశైలం డ్యాంలో 46.823 టీఎంసీల నీటి నిల్వ

తుంగభద్రలో చేరిన 36.043 టీఎంసీలు

శ్రీశైలం, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాయలసీమ కరువు రైతులకు తీపి కబురు ఇది. శ్రీశైలం జాలశయానికి భారీగా వరద చేరుతుంది. గురువారం రాత్రి పది గంటల సమయంలో లక్ష క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు చేసుకుంది. ఆలస్యంగానైనా వరద పెరగడంతో నీటి మట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం 46.823 టీఎంసీలు వరద చేరింది. లక్ష క్యూసెక్కులు ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఎగువన తెలంగాణ రాష్ట్రంలోని జూరాల ప్రాజెక్టుకు 1,09,519 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. దీంతో 17 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు విద్యుత్‌ ఉత్పతి జోరు పెంచారు. స్పిల్‌వే, పవర్‌ జనరేషన్‌ ద్వారా జూరాల నుంచి 1,05,141 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉదయం 6 గంటల సమయంలో స్పిల్‌వే, విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా 39,432 క్యూసెక్కులు విడుదల చేస్తే, జూరాల పైభాగంలో ఉన్న ఆల్మట్టి, నారాయణపుర్‌ జలాశయాల నుంచి భారీగా వరద వచ్చి చేరుతుండడంతో, వచ్చిన వరదను వచ్చినట్లు శ్రీశైలానికి వదిలేస్తున్నారు. దీంతో శ్రీశైలం డ్యాం వద్ద ఉదయం 19,151 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంటే, జూరాల నుంచి వరద పెరగడంతో శ్రీశైలంలో కూడా ఇన్‌ఫ్లో పెరుగుతూ వస్తోంది. సాయంత్రం 6 గంటలకు 87,240 క్యూసెక్కులకు చేరింది. రాత్రి 10 గంటలకు లక్ష క్యూసెక్కులు దాటిందని డ్యాం ఎస్‌ఈ వేణుగోపాల్‌రెడ్డి ఆంధ్రజ్యోతికి వివరించారు. శ్రీశైలం డ్యాం గరిష్ట నీటి మట్టం 855 అడుగులు, సామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా, 827.70 అడుగల లెవల్‌లో 46.823 టీఎంసీలు నీటి నిల్వకు చేరింది. శ్రీశైలంలో వరద పెరుగుతుండడంతో రాయలసీమ కరువు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కనీసం ఒక్క పంటకైనా సాగునీరు వచ్చే అవకాశం ఉందని తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కాలువ ఆయకట్టు రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తుంగభద్ర జలశయానికి నిలకడగా వరద కొనసాగుతోంది. గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు, సామర్థ్యం 105.788 టీఎంసీలకు గానూ 1,609.21 అడుగుల వద్ద 36.043 టీఎంసీలకు చేరింది. ఎగువ నుంచి 14,950 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. తాగునీటి అవసరాల కోసం 3,80 క్యూసెక్కులు వివిధ కాలువలకు విడుదల చేస్తున్నారు.

Updated Date - Jul 30 , 2026 | 11:59 PM