అంచెలంచెలుగా శ్రీశైల క్షేత్రం అభివృద్ధి
ABN , Publish Date - Jan 29 , 2026 | 11:15 PM
భక్తుల అవసరాలకు అనుగుణంగా దర్శన విధానాల అమలు, వసతుల కల్పనలో శ్రీశైల క్షేత్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు అన్నారు.
గర్భాలయంలో బంగారు తాపడంతో రుద్రాక్ష మండపం
ఆలయ చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు
పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు
శ్రీశైలం, జనవరి 29 (ఆంధ్రజ్యోతి): భక్తుల అవసరాలకు అనుగుణంగా దర్శన విధానాల అమలు, వసతుల కల్పనలో శ్రీశైల క్షేత్రం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతోందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు అన్నారు. ప్రపంచ దేశాల పర్యాటకులు క్షేత్రానికి వచ్చి స్వామిఅమ్మవార్లను దర్శించుకుని కనీసం మూడు రోజులపాటు బసచేసేలా అభివృద్ధి చేయాలన్న ముఖ్యమంత్రి ప్రణాళికలు సజావుగా అమలవుతున్నాయన్నారు. గురువారం దేవస్థాన పరిపాలనా భవనంలో పాలకమండలి సమావేశం జరిగింది. చైర్మన్ పోతుగుంట రమే్‌షనాయుడు అధ్యక్షతన ఈవో ఎం.శ్రీనివాసరావుతోపాటు మండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు సమావేశంలో పాల్గొన్నారు. 42 అంశాలను చర్చించుకోగా 39 అంశాను ఆమోదించారు. రెండు అంశాలు వాయిదాపడగా మరో అంశాన్ని తిరస్కరించారు. ప్రధానంగా తిరుమలలోని పీఎస్‌సీ-5 తరహాలో పబ్లిక్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణం చేపట్టాలని తీర్మానించారు. ప్రభుత్వ సెలవుదినాలతోపాటు శని, ఆది, సోమవారాల్లో ఉదయం రాత్రి వేళల్లో పరిమిత టిక్కెట్లకు మాత్రమే గర్బాలయ స్పర్శ దర్శనం కల్పిస్తూ సామాన్య భక్తులకు అధిక సమయం సర్వ దర్శనం భాగ్యాన్ని అందించేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. దాతల సహకారంతో గర్భాలయంలో స్వామివారికి బంగారుతాపడంతో రుద్రాక్ష మండపాన్ని ఏర్పాటు చేసేందుకు తీర్మానించారు. సీప్లేన్ ఏరోడ్రమ్ టెర్మినల్ భవన నిర్మాణానికి 1.06 ఎకరాల స్థలం కేటాయిపునకు ఆమోదం తెలిపారు. సదుపాయాల కల్పనకు అంచనాలు రూపొందించడం, స్వామిఅమ్మవార్ల పాకశాలలను సంప్రదాయరీతిలో కళాత్మకంగా తీర్చిదిద్దే ఆర్నమెంటల్ పనులకు ఆమోదం తెలిపారు. .